Share News

పెళ్లి వద్దు.. పిల్లలూ వద్దు!

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:45 AM

Delayed marriages among the youth జిల్లాలో జననాల సంఖ్య పడిపోతోంది. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే జననాల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. 2021-22లో జిల్లాలో 31,810 జననాలు జరిగితే 2022-23లో 31,193 మాత్రమే నమోదయ్యాయి. 2023-24లో 31,970 మంది జన్మించగా.. 2024-25 నాటికి జననాల సంఖ్య 24,700కి పడిపోయింది. 2025-26లో 23,072 మంది మాత్రమే జన్మించారు. ఈ ఐదేళ్లలో జన్మించినవారిలో బాలురు కంటే బాలికలు తక్కువ.

పెళ్లి వద్దు.. పిల్లలూ వద్దు!

  • మారుతున్న ఆలోచనలు.. తగ్గుతున్న జననాలు

  • యువతకు ఆలస్యంగా వివాహాలు

  • కెరీర్‌పైనే దృష్టి.. సంతానంపై అనాసక్తి

  • పెరిగిన ఖర్చులు.. పని ఒత్తిడితో సతమతం

  • ఆందోళన కలిగిస్తున్న తాజా గణాంకాలు

  • శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి):

  • ఆయనో టీచర్‌. పేరు వెంకటరావు. కుటుంబంతో శ్రీకాకుళంలో నివసిస్తున్నారు. అతనికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కుమార్తెకు ఉన్నంతలో మంచి సంబంధం చేశాడు. ఆమె విషయంలో ఫుల్‌హ్యాపీ. కానీ కుమారుడి పెళ్లి విషయంలోనే ఆయనకు తంటా తప్పడం లేదు. కుమారుడు మద్రాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కుమారుడికి 26 ఏళ్ల వయసు నుంచీ పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఇప్పటికి 13 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాడు. కానీ అనుకున్నస్థాయిలో సంబంధం దొరకడం లేదు. ప్రారంభ దశలో వచ్చిన కొన్ని సంబంధాలను కుమారుడు నచ్చకపోగా.. ఇప్పుడు సర్దుకుపోదామనే ఆలోచన ఉన్నా.. పెళ్లికుమార్తెల కొరత కారణంగా వివాహం ఆలస్యమవుతోంది. కుమారుడికి ఎప్పుడు పెళ్లవుతుందో.. ఎప్పుడు పిల్లలు పుడతారోనన్న దిగులు వెంకటరావును వెంటాడుతోంది.

  • అతనో డాక్టర్‌. కార్పొరేట్‌ ఆస్పత్రిలో స్పెషలిస్ట్‌. భార్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెళ్లయి ఆరేళ్లవుతోంది. కానీ ఆ దంపతులకు ఇంతవరకూ పిల్లలు లేరు. భార్య ఉద్యోగోన్నతి కోసం విదేశాలకు వెళ్లింది. డాక్టర్‌ ఇక్కడ తన వృత్తి బిజీలో నిమగ్నమైపోయారు. ఇద్దరూ కెరీర్‌పైనే దృష్టి సారించడంతో.. పిల్లలను కనాలనే ఆలోచన కూడా లేకపోవడం గమనార్హం. ఇటువంటి జంటల ఆలోచనా ధోరణి జననాల రేటుపై ప్రభావం చూపిస్తోంది. కెరీర్‌ ధ్యాసలో పడి పిల్లలను కనడం వాయిదా వేసుకొనేవారే కాదు.. అసలు పిల్లలు వద్దనుకొనేవారు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నారు.

  • జిల్లాలో జననాల సంఖ్య పడిపోతోంది. గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే జననాల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. 2021-22లో జిల్లాలో 31,810 జననాలు జరిగితే 2022-23లో 31,193 మాత్రమే నమోదయ్యాయి. 2023-24లో 31,970 మంది జన్మించగా.. 2024-25 నాటికి జననాల సంఖ్య 24,700కి పడిపోయింది. 2025-26లో 23,072 మంది మాత్రమే జన్మించారు. ఈ ఐదేళ్లలో జన్మించినవారిలో బాలురు కంటే బాలికలు తక్కువ. ఐదేళ్లలో బాలురు 72,904 మంది, బాలికలు 69,966 మంది మాత్రమే జన్మించారు. యువతకు వివాహాలు ఆలస్యం కావడమే జననాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం వంటి కారణాలతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. చాలామంది యువతీ, యువకులకు కెరీర్‌పై దృష్టిలో భాగంగా.. 40 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు కావడం లేదు. పెళ్లయినా కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి కారణంగా కొంతమంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. పూర్వీకులు పదేసి మంది పిల్లలను కనేవారు. తర్వాత తరం.. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేవారు. క్రమేపీ చాలామంది ఒక్కరితోనే సరిపెట్టుకోగా.. ప్రస్తుతం అసలు పిల్లలే వద్దనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల పెంపకం భారమని భావించి చాలామంది కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది జననాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈనేపథ్యంలో ఒకప్పుడు ‘చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం’ అన్న స్లోగన్‌తో కుటుంబ నియంత్రణ కోసం వెంపర్లాడిన ప్రభుత్వాలు.. ఇప్పుడు జననాల రేటు పడిపోవడంతో ఉలిక్కి పడుతున్నాయి. ముగ్గురేసి.. నలుగురేసి పిల్లలను కనండి ప్రోత్సాహకాలిస్తాం అంటూ యువతరాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

  • పెర్టిలిటీరేటు దిగువకు..

  • ఒక మహిళ తన ప్రసవ వయసుల్లో సగటున కనబరిచే పిల్లల సంఖ్య (టోటల్‌ ఫెర్టిలిటీరేట్‌) గతంలో రెండు కంటే ఎక్కువగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం 1.4 నుంచి 1.5 మధ్యకు పడిపోయింది. జిల్లాకు కూడా ఇదే వర్తిస్తుంది. 2021లో దేశంలో టిఎఫ్‌ఆర్‌ 2.0గా ఉంటే ఏపీలో 1.7గా ఉందని నీతిఆయోగ్‌ ప్రకటించింది. అదిప్పుడు 1.4 నుంచి 1.5కు పడిపోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం.

  • సామాజిక సమతుల్యత తగ్గుతోంది

  • చిన్న కుటుంబమే మేలన్న భావన బలంగా పెరగడం, విద్య, వైద్యం, ఇల్లు నిర్వహణ వంటి ఖర్చులు పెరగడం, జీవనశైలిలో మార్పులు రావడంతో ఎక్కువమంది దంపతులు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువ కాలం జననాల తగ్గుదల కొనసాగితే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది. పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఇది ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడులకు దారితీయొచ్చు. జననాల తగ్గుదల ఇలానే కొనసాగితే మాత్రం భవిష్యత్‌లో ప్రమాదఘంటికలు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Updated Date - Sep 20 , 2026 | 12:45 AM