Share News

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:18 AM

నియోజకవర్గంలోని అన్ని చెరువులకూ నీళ్లిచ్చేందుకు సమగ్ర ప్రణాళిక

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

చిత్తూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిని మరింత విస్తృతం చేస్తున్నారు. గతేడాది కుప్పానికి కృష్ణమ్మ వస్తే సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 133 చెరువుల్ని కృష్ణమ్మతో నింపారు. తాజాగా నియోజకవర్గంలోని అన్ని 418 చెరువుల్నీ నింపే ప్రణాళికను సిద్ధం చేశారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.వేల కోట్లతో పరిశ్రమలు పురోగతిలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికీ హంద్రీనీవా నీళ్లను తెస్తున్నారు. ఇందుకోసం రూ.439 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేయగా.. సోమవారం సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

131.2 కిలోమీటర్ల మేర కుప్పం కెనాల్‌

హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ నుంచి పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ ప్రారంభమవుతుంది. పుంగనూరు కెనాల్‌లోని 207.800 కిలోమీటర్‌ వద్ద నుంచి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ప్రారంభమై 131.200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కుప్పం మండలం పరమసముద్రం గ్రామ సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద కుప్పం కెనాల్‌ ముగుస్తుంది. కుప్పం కెనాల్‌ లిఫ్ట్‌, గ్రావిటీ కెనాల్‌గా నిర్మితమైంది. ఈబ్రాంచ్‌ కెనాల్‌లోని 5.350, 39.995, 54.375/60.725 కిలోమీటర్ల వద్ద మూడు లిఫ్టులున్నాయి.

కుప్పం కెనాల్‌ లక్ష్యం ఇదే

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులకు నీళ్లు అందించి, 6300 ఎకరాల ఆయకట్టును స్ధిరీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కెనాల్‌ ద్వారా చివరి భాగం వరకు 161 క్యూసెక్కుల నీళ్లను తరలించేలా డిజైన్‌ చేశారు.

133 చెరువుల్ని నింపిన కృష్ణాజలాలు

2025-26 నీటి నియంత్రణ సంవత్సరంలో గతేడాది ఆగస్టు 21న పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కుప్పం కెనాల్‌లోకి నీళ్లు చేరాయి. 25న కుప్పం కెనాల్‌ చివరి భాగమైన పరమసముద్రం చెరువుకు నీళ్లు చేరాయి. అదే నెల 30న సీఎం చంద్రబాబు పరమసముద్రం చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతినిచ్చారు. 110 చెరువుల లక్ష్యానికి మించి నియోజకవర్గంలోని 133 చెరువుల్ని నింపారు. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ సీజన్‌కు కృష్ణాజలాలు కుప్పం వస్తుండగా, సీఎం ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.

నాలుగు మండలాల్లో సర్వే

కుప్పం కెనాల్‌ ద్వారా సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లను నింపాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులకు సూచించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పంలలో అధికారులు సర్వే చేపట్టారు. అన్ని చెరువులకు నీళ్లను అందించే అవకాశాలను పరిశీలించి డీపీఆర్‌లు రూపొందించారు.

పారిశ్రామిక ప్రాంతం కోసం రిజర్వాయర్‌

పొగురుపల్లెలో రూ.9300 కోట్లతో 30 భారీ పరిశ్రమలు నిర్మాణంలో ఉండడంతో పాటు ఇండస్ర్టియల్‌ పార్కులూ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ పారిశ్రామిక అవసరాల కోసం హంద్రీనీవా నీళ్లను తెస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అనుగుణంగా సమీపంలోని కల్లివంక చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. గుడుపల్లె మండలంలోని 96 చెరువుల్ని నింపడంతో పాటు 200 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి కలిపి రూ.207 కోట్ల ప్రతిపాదన సిద్ధం చేశారు.

మండలాల వారీగా ప్రతిపాదనలు

రామకుప్పం మండలంలోని 128 చెరువుల్ని నింపేందుకు రూ.101.83 కోట్లు, శాంతిపురం మండలంలోని 87 చెరువుల కోసం రూ.78 కోట్లు, కుప్పంలోని 107 చెరువుల కోసం రూ.63.57 కోట్లతో పాటు గుడుపల్లె మండలంలోని చెరువులకు, కల్లివంక రిజర్వాయర్‌కు రూ.207 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక అమలైతే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కుప్పం కెనాల్‌ నీళ్లతో భూగర్భజల మట్టం పెరుగుతుంది.

Updated Date - Sep 20 , 2026 | 01:18 AM