విశాఖకు గోదావరి జలాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:01 AM
విశాఖపట్నానికి త్వరలో రోజుకు రెండు టీఎంసీల నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
రోజుకు 2 టీఎంసీలు ఇస్తాం...
వచ్చే ఏడాది నుంచి నీటికి కొరతే ఉండదు
నగర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
గత రెండేళ్లలో రూ.2.21 లక్షల కోట్ల పెట్టుబడులు
సింహాద్రి అప్పన్న, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో నగరానికి మంచి చేస్తా
పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేశాం
త్వరలో మరో 10 వేల మందికి పట్టాలు
పంచ గ్రామాల భూ సమస్యకు కూడా పరిష్కారం
పేదలకు పట్టాల పంపిణీ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నానికి త్వరలో రోజుకు రెండు టీఎంసీల నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. డేటా సెంటర్ల రాకతో విశాఖలో నీటి కొరత వస్తుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది నమ్మవద్దన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాంతో తీవ్రమైన నీటి కొరత వచ్చిందన్నారు. వచ్చే ఏడాది నుంచి నీటికి ఎటువంటి సమస్య ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వచ్చిన గోదావరి జలాలను విశాఖకు తీసుకువస్తామని, అందుకు అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించానన్నారు. రెండు టీఎంసీలు సరిపోవు అంటే 10/15/20 టీఎంసీలు...ఎంత నీరు కావాలంటే అంత తీసుకువస్తామని చెప్పారు. పరిశ్రమలకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికీ నీరు చేరేలా ప్రణాళిక తయారుచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రులు, జిల్లా అధికారులు, నాయకులు నీటి సమస్యపైనే చర్చించానన్నారు.
విశాఖ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
విశాఖపట్నానికి పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకువస్తున్నామని, ఈ నగరం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గత రెండేళ్లలో రూ.2.21 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, వాటి ద్వారా 1.86 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం ఇప్పించి, దానిని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. మాది విశాఖపట్నం...అని ఇక్కడివారు గర్వంగా చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలు తేవడం తన బాధ్యత అని, వాటిని సద్వినియోగం చేసుకొని, పేదరికం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. సింహాద్రి అప్పన్న, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో నగరానికి మంచి చేస్తానని, అంతా సంతోషంగా ఉండాలనేదే తన అభిమతమన్నారు.
త్వరలో పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం
ఇప్పుడు పదకొండు మండలాల పరిధిలో పేదలకు రూ.8,874 కోట్ల విలువైన పట్టాలు ఇచ్చి వారి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేశామని, త్వరలో పంచగ్రామాల భూ సమస్యకు కూడా కోర్టు నుంచి పరిష్కారం తెచ్చి 12,149 మందికి పట్టాలు ఇస్తామన్నారు. వారితో పాటు విశాఖలో మరో పది వేల మందికి పట్టాలు ఇవ్వాలని గుర్తించామన్నారు. ఇదే పనిపై ఉండాలని కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. నగరంలో పరిశుభ్రత బాగుందని, పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రుషికొండపై వైసీపీ నిర్మించిన భవనంపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
విశాఖ గర్వపడేలా పరిశ్రమలు తెస్తున్నాం
రాష్ట్రంలో విశాఖపట్నం తలసరి ఆదాయమే ఎక్కువని, విశాఖపట్నం అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. హుద్‌హుద్ సమయంలో తాను చేసిన పనులు చూసి, ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోను తమను గెలిపిస్తూనే ఉన్నారని సంతోషం వ్యక్తంచేశారు. అందుకే విశాఖ గర్వపడేలా పరిశ్రమలను తెస్తున్నామన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీ, ఐటీ పరిశ్రమలు...ఇలా అనేకం రప్పిస్తున్నామని, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖేనన్నారు. టూరిజం, టెక్నాలజీ, పోర్టు, ఎయిర్‌పోర్టులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తెచ్చామని, విశాఖకు కొద్దిగా దూరంగా ఉన్నా గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఈ అభివృద్ధిలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
పచ్చదనం పెంచాలి
విశాఖ చాలా పరిశుభ్రమైన నగరమని, నగరంలో పచ్చదనం కూడా పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు. తిరుపతిలో 89.4 శాతం పచ్చదనం ఉందని, విశాఖ ఆ స్థాయికి చేరుకోవాలన్నారు. నెట్ జీరో ఫాలో కావాలని, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానళ్లు పెట్టుకుంటే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదన్నారు. అదే విద్యుత్‌తో వంట చేసుకోవచ్చునని, గ్యాస్ పైపులైన్లు కూడా వేస్తామని, తక్కువ ధరకు గ్యాస్ వస్తుందన్నారు. అలా చేస్తే పేదలకు ప్రభుత్వం ఏడాది ఇచ్చే మూడు సిలిండర్ల డబ్బులు మిగులుతాయన్నారు.
పులకించిన పేదలు...
ఙకిక్కిరిసిన ఇంజినీరింగ్ కాలేజీ మైదానం
పేదల పట్టాభిషేకానికి ప్రకృతి సహకారం
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ‘పేదలకు పట్టాభిషేకం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రకృతి కూడా సహకరించింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 30 వేల మంది హాజరు కాగా వారందరికీ సాయంత్రం ఏడు గంటల వరకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. అనంతరం ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు చెందిన వారందరికీ కేటాయించిన స్టాళ్లలో పట్టాల పంపిణీకి నడుం కట్టారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి ఏడు గంటలైంది. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య నగరంలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. సీతమ్మధార, మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ వద్ద కురిసిన వర్షం...ఏయూ మైదానంలో మాత్రం పడలేదు. పేదలు దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రకృతి కూడా సహకరించిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నాయకుల చేతులు మీదుగా స్వయంగా పట్టాలు అందుకోవడానికి జిల్లాలోని 11 మండలాల నుంచి లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకే ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా బస్సులు వేయడంతో ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొనలేదు. అందరికీ తగిన వసతి, పట్టాల ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ... లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ మధుర క్షణాలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అనడంతో లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కొక్కరికి రూ.50 లక్షలకు విలువైన స్థలంపై పట్టా లభించడంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తమ కష్టాలు తీరిపోయాయని, భూమిపై హక్కు వచ్చిందని, తమకు బ్యాంకుల్లో అప్పులు పుడతాయని సంబరపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అటు అధికారులు, ఇటు నాయకులు, లబ్ధిదారులు అంతా సంతోషించారు.
చంద్రబాబు దేవుడిలా ఆదుకున్నారు....
కచ్చల పద్మ
గాజువాక హిమాచల్ నగర్ కొండపైన 20 ఏళ్ల కిందట రూ.10 వేలు పెట్టి ఇంటి స్థలం కొన్నాను. రేకుల షెడ్ వేసుకుని నివాసముంటున్నాను. నెల నెలా వచ్చే పింఛన్ రూ.4 వేలతోనే బతుకుతున్నాను. కొండ మీద ఇల్లు తీసేస్తారని చాలామంది భయపెట్టారు. నాకు ఉన్న ఆధారం ఇల్లే. అది లేకపోతే రోడ్డున పడతాను. నా ఇంటిని నా పేరు మీద పట్టా ఇచ్చి చంద్రబాబు దేవుడిలా ఆదుకున్నారు. ఇక నుంచి ఏ భయము లేకుండా నా ఇంట్లో ధైర్యంగా ఉంటాను.
హక్కు వచ్చినందుకు ఆనందంగా ఉంది
షేక్ హసీనా బేగం, ఓల్డ్ డెయిరీ ఫాం, హనుమంతవాక
పాత డెయిరీ ఫారం వద్ద చిన్నపాటి స్థలంలో ఇల్లు కట్టుకొని 1984 నుంచి ఉంటున్నాం. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నామని బెదిరించేవారు. పేదోళ్లు కట్టుకున్న ఇళ్లకు హక్కు కల్పిస్తామని చాలా మంది నాయకులు చెబుతుండేవారు. అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. 2015లో పట్టా ఇచ్చినా, మాకెలాంటి హక్కురాదని చెప్పడంతో నిరాశకు గుర య్యాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2025లో మా ఇంటికి రిజిస్ర్టేషన్ చేశారు. ఇప్పుడు కన్వేయన్స్ డీడ్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిపై హక్కు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది.