రాయలసీమ ద్రోహి జగన్
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:52 PM
రాయలసీమ ద్రోహి జగన్ అని, వైసీపీ హయాంలో ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజం
అవుకు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ద్రోహి జగన్ అని, వైసీపీ హయాంలో ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం అవుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఉనికిని కాపాడుకునేందుకే ఆ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80 శాతం అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలను సాకారం చేస్తూ డీఎస్సీ ద్వారా 16వేలు ఉపాధ్యాయ పోస్టులు, 6వేలు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. అయితే డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు చేయటం సరికాదని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్‌అండ్‌బీ, గ్రామ పంచాయతీ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేస్తున్న విమర్శలు అర్థరహితమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. అవుకు పట్టణంలో రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికే రూ. 5 కోట్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. గత వైసీపీ పాలనలో రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోటంతో లీకేజీల బారిన పడిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక రిజర్వాయర్ మరమ్మతు కోసం రూ. కోటి మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, నాయకులు పరమేశ్వరరెడ్డి, వెంకటరమణనాయక్, రమణ, కిట్టు పాల్గొన్నారు.