కేఎన్‌ఆర్ ఖాతాల్లో కోట్ల వర్షం!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:02 AM
లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు! అలాంటి లావాదేవీలు వందలు, వేలల్లోనే! మొత్తంగా కోట్ల రూపాయల వర్షం! ఇదంతా మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్‌ఆర్ దందాల వ్యవహారం! ఆయన భార్య, బావమరిది....
భార్య, బామ్మర్ది, బినామీల ఖాతాల్లో జమ
అన్ని కోట్లు ఎవరు,ఎందుకు ఇచ్చినట్లు?
లింకులు పరిశీలిస్తున్న సిట్ అధికారులు
ఖాతాల శోధనకు తొమ్మిది బృందాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు! అలాంటి లావాదేవీలు వందలు, వేలల్లోనే! మొత్తంగా కోట్ల రూపాయల వర్షం! ఇదంతా మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్‌ఆర్ దందాల వ్యవహారం! ఆయన భార్య, బావమరిది, బినామీల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. దీంతో ఆయా ఖాతాల పరిశీలనకు ‘సిట్’ 9 ప్రత్యేక బృందాలను నియమించింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కేఎన్‌ఆర్ జరిపిన లావాదేవీల వివరాలు తెలుసుకొని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. జగన్ పీఏ దోపిడీ వ్యవహారం రాష్ట్ర సరిహద్దుల్ని దాటినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కేఎన్‌ఆర్‌కు ఆస్తులు ఉన్నట్లు సిట్ ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. దర్యాప్తులో భాగంగా కేఎన్‌ఆర్‌ను నాలుగు రోజుల నుంచి విచారణకు పిలిచి గుట్టు బయటికి లాగుతోంది. కేఎన్‌ఆర్, ఆయన భార్య, బామ్మర్ది, మరికొందరు బినామీలను గుర్తించిన సిట్ అధికారులు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కేఎన్‌ఆర్, ఆయన భార్య, బామ్మర్ది ఖాతాల్లోకి రూ.5లక్షలకు తగ్గకుండా డిపాజిట్ చేసిన లావాదేవీలు వేలల్లో ఉన్నట్లు తేల్చింది. ఆ మొత్తం పదుల కోట్లలో ఉండగా డిపాజిట్ చేసిన వ్యక్తులు వెనక్కి తీసుకున్నట్లు లేదు. ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసిన వ్యక్తులు సైతం డబ్బులు తిరిగి బదిలీ చేయించుకున్నట్లు లేకపోవడంతో ఈ సొమ్ము లిక్కర్ ముడుపులకు సంబంధించినదా.. లేక ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించిందా.. ఆనేది తేల్చేందుకు సిట్ నడుం బిగించింది. అందులో భాగంగా పోలీసుతో పాటు బ్యాంకు లావాదేవీలపై అవగాహన ఉన్న వారిని కలిపి తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఇందు లో కేఎన్‌ఆర్, ఆయన భార్య, బామ్మర్దితో పాటు ఇతర బినామీలుగా భావిస్తున్న వారి బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిపడిన సొమ్ము ఎందుకు జమ చేశారనే గుట్టు తేల్చబోతున్నారు.
కేఎన్‌ఆర్ భార్య బ్యాంకు ఖాతాల్లోకి 2020 నుంచి 2024 మధ్యలో నగదు డిపాజిట్, ఆన్‌లైన్ బదిలీ ద్వారా రూ.19.85కోట్ల లావాదేవీ జరిగింది. ఆ లావాదేవీలకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు పంపారు.. అప్పుగా ఇస్తే ఏం తాకట్టు పెట్టుకుని ఇచ్చారు.. అప్పటి సీఎం పీఏకు అప్పు ఇచ్చే స్థోమత వారికి ఉందా? ఆ సొమ్ము సక్రమమైనదేనా? అంటూ అన్ని కోణాల్లో సిట్ బృందాలు పరిశీలిస్తున్నాయి. భారీగా వచ్చిపడిన అయాచిత సొమ్ముతో కేఎన్‌ఆర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. మద్యం వ్యాపారులు, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వ్యక్తులను పిలిచి విచారించబోతోంది. ఆ స్కామ్‌కు సంబంధం లేని లావాదేవీల్లో అక్రమ, అనుమానాస్పదమైనవి ఉంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు(ఈడీ) వివరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు ఈడీ జప్తు చేస్తుందా.. ఏపీ ప్రభుత్వం సీజ్ చేస్తుందా.. అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారాలకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం వరకూ కేఎన్‌ఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం జరిగినవి తనకు ఏమీ గుర్తుంటాయని జగన్ పీఏ బదులిచ్చినట్లు సమాచారం. దీంతో పూర్తి ఆధారాలు వెలికితీసే పని లో తొమ్మిది బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. జగన్ కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యక్తికి కేఎన్‌ఆర్‌తో ఉన్న సంబంధాలూ బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో పాఠ్య పుస్తకాల ముద్రణ టెండరును ఆ ఇద్దరితోపాటు మరికొందరు సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సిండికేట్ ఐఅండ్‌పీఆర్‌లోనూ కొన్ని ముద్రణలకు సంబంధించిన కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ సొమ్ముతో పలుచోట్ల ఆస్తులు పోగేసుకున్నట్లు ‘సిట్’ గుర్తించింది.