Share News

లిక్కర్‌ స్కామ్‌లో అనిల్‌ రెడ్డే ‘కీ’!

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:54 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌కు ఆర్థిక వెన్నెముక, చిన్నాన్న జార్జ్‌ రెడ్డి కుమారుడు వైఎస్‌ అనిల్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దృష్టి సారించింది.

లిక్కర్‌ స్కామ్‌లో అనిల్‌ రెడ్డే ‘కీ’!

  • జగన్‌ సోదరుడి ప్రమేయంపై ‘సిట్‌’ ఫోకస్‌

  • జగన్‌ ఆర్థిక వ్యవహారాల్లో కీలక లింక్‌పై దృష్టి

  • సత్యప్రసాద్‌ వాంగ్మూలంలో తొలిసారి అనిల్‌ ప్రస్తావన

  • జగన్‌ వద్దకు తనను అనిల్‌ తీసుకెళ్లాడని వెల్లడి

  • దీంతో మరో కోణంలో దూకుడు పెంచిన సిట్‌

  • అన్ని లావాదేవీలపైనా ఆరా.. అనిల్‌ విచారణకు సిద్ధం!

(అమరావతి, ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌కు ఆర్థిక వెన్నెముక, చిన్నాన్న జార్జ్‌ రెడ్డి కుమారుడు వైఎస్‌ అనిల్‌రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దృష్టి సారించింది. ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఓఎస్‌డీ సత్యప్రసాద్‌ ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్‌ పేరు, ఆయన పాత్రకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయనను నేరుగా ప్రశ్నించే దిశగా ‘సిట్‌’ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఓఎఫ్ఎస్‌ వ్యవస్థను పక్కనపెట్టి మాన్యువల్‌ విధానంలో మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా నాటి ప్రభుత్వంలో సూచనలు వచ్చాయని సత్యప్రసాద్‌ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రత్యేక ప్రైవేట్‌ మెయిల్‌ ఐడీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆర్డర్లు పంపాలని తనకు అనిల్‌ సూచించినట్లు తెలిపారు. దానివల్ల మద్యం కంపెనీలకు సరఫరా ఆర్డర్ల కేటాయింపుపై ప్రభావం చూపే అవకాశం దొరికిందా.. అనే కోణంలో సిట్‌ పరిశీలిస్తోంది. అనిల్‌రెడ్డి, అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను జగన్‌ వద్దకు తీసుకెళ్లారని, అనిల్‌ సూచనల మేరకు వ్యవహరించాలని జగన్‌ చెప్పారని సత్యప్రసాద్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలంలోని అంశాలను ఇతర నిందితుల స్టేట్‌మెంట్లు, పత్రాలు, ఆర్థిక లావాదేవీలతో సిట్‌ సరిపోల్చి చూస్తోంది. మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి కమీషన్ల పేరుతో వసూలైన మొత్తాల కదలికపైనా దర్యాప్తు బృందం పూర్తి సమాచారం సేకరించింది. సింహభాగం మద్యం ముడుపులు కీలక వ్యక్తుల ద్వారా జగన్‌కు చేరినట్లు సత్య ప్రసాద్‌ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి సంబంధించిన లావాదేవీలు, మధ్యవర్తులు, సంస్థల పాత్రను సిట్‌ లోతుగా పరిశీలిస్తోంది.


ఎన్నికల నిధుల సర్దుబాటులో..

2019, 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి నిధుల సమీకరణ, పంపిణీలో అనిల్‌ కీలకంగా వ్యవహరించారా అన్న కోణంలో ముందుకెళ్లిన సిట్‌ అధికారులు, కీలక సమాచారమే సేకరించారు. వివిధ ప్రాంతాలకు నిధుల తరలింపు, పంపిణీ వ్యవస్థలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్రపైనా సిట్‌ వద్ద ఆధారాలున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో సిలికా అక్రమంగా తీసుకెళ్లే వ్యవహారంలో వ్యాపారులు పి.ఎస్‌. ప్రసాద్‌ రెడ్డికి, చెన్నైకు చెందిన బాలుకు మధ్య అనిల్‌ రెడ్డి బామ్మర్ది విష్ణు రెడ్డి మధ్యవర్తిత్వం వహించిన విషయాన్ని సిట్‌ వెలికితీసింది. హైదరాబాద్‌కు చెందిన హవాలా వ్యాపారి రాకేశ్‌పై నిఘా పెట్టిన ఈడీకి సైతం ఈ లింకుల బాగోతం తెలిసింది. దీంతో ఇటు సిట్‌, అటు ఈడీ ఒకరికొకరు సమాచారం పంచుకుంటూ సాగించిన దర్యాప్తులో అనిల్‌ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిట్‌, అక్కడ లభించిన పత్రాలు, సంస్థల ఆర్థిక వివరాలు, వివిధ వ్యక్తులు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తోంది. మద్యం కమీషన్ల వ్యవహారంలో చేతులు మారినట్టు చెబుతున్న కిక్‌బ్యాక్‌లతో వీటికి సంబంధం ఉందా అన్నది తేల్చే ప్రయత్నం జరుగుతోంది.


తమిళనాడు లింకులపైనా ఫోకస్‌

అనిల్‌కు తమిళనాడులో ఉన్న వ్యాపార, రాజకీయ పరిచయాలపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమాచారం సేకరించినట్లు తెలిసింది. తమిళనాడు సీఎం విజయ్‌ రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన నిధుల వ్యవహారాల్లో అనిల్‌ సహకరించారన్న సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. అధికార టీవీకే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న కొద్ది మందిలో అనిల్‌ పాత్ర ఏంటి.? జగన్‌తో నడిపిస్తున్న వ్యవహారాలు ఏంటి.? ప్రస్తుతం తమిళనాడులో లిక్కర్‌ ముఠాలతో ఉన్న సంబంధం, గత ప్రభుత్వంలో ఏపీలో వసూళ్లు.. తదితర అంశాలపై సమాచారాన్ని సిట్‌ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇందులో మనీ లాండరింగ్‌ సమాచారాన్ని ఈడీతో పంచుకోనున్నట్లు తెలిసింది. ఓఎఫ్ఎస్‌ విధానం మార్పు, ప్రైవేట్‌ మెయిల్‌ ద్వారా ఆర్డర్లు, మద్యం కంపెనీల నుంచి కమీషన్ల వసూళ్లు, రూ.వందల కోట్ల నిధుల కదలిక, ఎన్నికల ఆర్థిక వ్యవహారాల్లో పాత్ర.. ఇలా పలు అంశాలను సిట్‌ ఒకదానితో ఒకటి జోడించి పరిశీలిస్తోంది.

అనిల్‌ను ప్రశ్నిస్తే.. మరిన్ని లింకులా?

సత్యప్రసాద్‌ వాంగ్మూలంలోని అంశాలతోపాటు గతంలో సిట్‌ సోదాల్లో లభించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అనిల్‌ ఎదుట ఉంచి వివరణ కోరేందుకు సిట్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విచారణలో ఓఎఫ్ఎస్‌ మళ్లింపు, మద్యం కమీషన్లు, నిధుల తరలింపు వ్యవహారాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా.. అన్నది ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 03:54 AM