ఉప్పొంగిన వాగులు, వంకలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:05 AM
సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వరుసగా మూడో రోజు బండిఆత్మకూరు మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కుండపోతగా వాన కురియటంతో పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండలంలో 50 మిమీ వర్షపాతం నమోదైంది
బండిఆత్మకూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వరుసగా మూడో రోజు బండిఆత్మకూరు మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కుండపోతగా వాన కురియటంతో పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండలంలో 50 మిమీ వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా విరామం లేకుండా వాన కురవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మరోపక్క ఆరుతడి పంటలు వేసిన రైతుల పొలాల్లో నీరు నిల్వటంతో ఆందోళన చెందుతున్నారు. రామాపురం గ్రామాన్ని మద్దిలేరు వాగు చుట్టుముట్టింది. గ్రామ ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. కెసీ కెనాల్‌కు యూటీ లేకపోవటం, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవటంతోనే ఈ పరిస్థితి పదే పదే వస్తున్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ఉన్న అటవీ ప్రాంతంలో భారీ వాన పడటంతో మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహించి పార్నపల్లె గ్రామంలోకి నీరు చేరింది. లోతట్టు ఇళ్ళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌నినో కారణంగా కొన్ని నెలలుగా ముఖం చాటేసిన వానలు అల్పపీడణ ద్రోణి ప్రభావంతో మూడు రోజుల ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ముంచెత్తిన వర్షం
నంద్యాల ఎడ్యుకేషన్: నంద్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. నెలల తరబడి వర్షాల కోసం ఎదురుచూస్తున్న జిల్లా వాసులకు వరుణుడు కాస్త ఊరటనిచ్చింది. పాములపాడు మండలంలో 102.4 మి.మీ., వర్షం కురిసింది. జూపాడుబంగ్లాలో 58.6, నందికొట్కూరులో 58.4, రుద్రవరం 57.6, బేతంచర్ల 52.4, బండిఆత్మకూరు 49.4, మహానంది 44.2, ఆత్మకూరు 42.8, గడివేముల 39.0, శిరువెళ్ల 33.8, మిడ్తూరు 33.6, వెలుగోడు 32.2, కొలిమిగుండ్ల 29.2, గోస్పాడు, కొత్తపల్లె 20.4, పగిడ్యాల 19.8, శ్రీశైలం 18.2, చాగలమర్రి 18.2, నంద్యాల రూరల్ 15.4, నంద్యాల పట్టణం 14.0, పాణ్యం 10.4, ప్యాపిలి 9.4, బనగానపల్లె 8.4, ఉయ్యాలవాడ 5.6, ఆళ్లగడ్డ 3.8, అవుకు 3.2, దొర్నిపాడు 2.8, కోవెలకుంట్ల 2.2, సంజామల 1.8మి.మీ., వర్షపాతం నమోదైంది. బండి ఆత్మకూరు మండలంలో కుండపోత వర్షం కారణంగా మద్దిలేరు వాగు ఉప్పొంగింది. దీంతో రామాపురం గ్రామంలో వరద చేరింది. ఇదే మండలంలోని పార్నపల్లె గ్రామంలో కూడా వరద ప్రవహించి వీధుల్లోకి నీరు చేరాయి. అదేవిధంగా నంద్యాల మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో వర్షపు నీరు ప్రవహించింది. పాములపాడు మండలంలోని ఎర్రగూడూరు, బానుముక్కల, మిట్టకందాల, మద్దూరు గ్రామాల్లో పంటలన్నీ నీటమునిగాయి. మిట్టకందాల గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూపాడుబంగ్లా మండలంలో ఇసుకవాగు, కాకిలేరు, సుద్దవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చాగలమర్రి మండలంలోనూ వర్షం దంచికొట్టింది. రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది పరవళ్లు తొక్కింది. రాజోలి ఆనకట్ట నుంచి 6,700 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెక్‌డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. తోడెండ్లపల్లెలో మోహన్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట నేలవాలింది. సర్వీసు రహదారిలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచి రైతులకు నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉండగా బుధ, గురువారాల్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే నంద్యాల జిల్లాలో భారీ వర్షం కురిసినా నెలవారీ సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇంకా లోటు కొనసాగుతోంది. భారత వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం సెప్టెంబరు నెలలో నేటి వరకు సాధారణంగా 134.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నేటి వరకు 93.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 31శాతం లోటు నెలకొంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల సాగు కొనసాగుతున్న నేపథ్యంలో కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగింది.
ఇదే ఈ ఏడాది భారీ వర్షం
జూపాడుబంగ్లా: మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ ఏడాది ఖరీ్‌ఫలో ఇదే పెద్ద వర్షం. ఈ వర్షంతో బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రబీ ప్రారంభానికి ఈ వర్షం కొంత ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ వర్షంతో మండలంలోని కాకిలేరు, ఇసుకవాగు, సుద్దవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. జూపాడుబంగ్లాలో నిర్మిస్తున్న డ్రైనేజీ కాల్వలు ఉప్పొంగి ప్రవహించాయి. మండలంలో 58.6 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
నీట మునిగిన పొలాలు
పాములపాడు: పాములపాడు మండలంలో మంగళవారం తెల్లవారుజామున కురిసన వానకు లోతట్టు ప్రాంతాల ఇళ్ళలోకి నీరు చేరింది. పంటపొలాలను వర్షపునీరు ముంచెత్తింది. పొలాలు చెరువుల్లా మారాయి. మండలంలో అత్యధికంగా 104.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. పాములపాడు, ఎర్రగూడూరు, బానుముక్కల, మిట్టకందాల, మద్దూరు తదితర గ్రామాలలో మొక్కజొన్న, పత్తి తదితర పంటలు నీట మునిగాయి. మిట్టకందాల గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలోని లోతట్టు ప్రాంతాలలోని ఇళ్ళలోకి వర్షపునీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
విరిగి పడ్డ చెట్టు కొమ్మ వ్యక్తి కి తీవ్ర గాయాలు
రుద్రవరం: మండలంలోని పేరురు గ్రామంలో వేపచెట్టు కొమ్మ విరిగిపడి దసరా స్వామి దర్గా వద్ద వేప చెట్టు కొమ్మ పడటంతో అక్కడే ఉన్న ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుకావడంతో ఎర్రగుంట్ల ఆసుపత్రికి తరలించారు.