Share News

నాగావళిలో చిక్కుకున్న వృద్ధురాలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:55 PM

నాగావళి నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ వృద్ధురాలిని పాలకొండ అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.

నాగావళిలో చిక్కుకున్న వృద్ధురాలు
కాపాడిన చంద్రమ్మతో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు

- కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

పాలకొండ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నాగావళి నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ వృద్ధురాలిని పాలకొండ అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గొట్టమం గళాపురం గ్రామానికి చెందిన మడపల చంద్రమ్మ అనే వృద్ధురాలికి మతిస్థిమితం సరిగా లేదు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె నాగావళి నదిలో నీరు లేకపోవడంతో ఇసుకలో నడుచుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న గోపాలపురానికి చేరుకుంది. అయితే, తుఫాన్‌ కారణంగా సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం ఆమె గోపాలపురం వద్ద నదిలో దిగి ఇవతల ఒడ్డున ఉన్న గొట్టమంగళాపురానికి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, వరద ఎక్కువగా ఉండడంతో నదిలోని ఓ ఇసుక దెబ్బపై ఉండిపోయింది. ఆమెను ఓ పశువుల కాపరి గుర్తించి స్థానికులకు చెప్పాడు. వారి సమాచారంతో పాలకొండ అగ్నిమాపకశాఖ అధికారి సర్వేశ్వరరావు, సిబ్బంది, ఎస్‌ఐ వెంకన్న, తహసీల్దార్‌ రాధాకృష్ణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. నదీ ప్రవాహాన్ని దాటుకొని చంద్రమ్మను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Sep 22 , 2026 | 11:55 PM