Share News

లాఠీ దెబ్బలకు సాయికృష్ణ మృతి

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:33 AM

విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బలకు రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ(28) చనిపోయాడని, ఆ తర్వాత మృతదేహాన్ని పీఎన్‌బీఎస్‌ ఎదురుగా ఉన్న స్వర్గపురిలో అర్ధరాత్రి దహనం చేశారని సిట్‌ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వివరించినట్టు తెలిసింది.

లాఠీ దెబ్బలకు సాయికృష్ణ మృతి

  • రాణిగారితోటలో పాడైపోయిన భవనంలో బంధించి.. చిత్రహింసలు పెట్టారు

  • డిజిటల్‌ సాక్ష్యాలను ధ్వంసం చేశారు

  • 50 పేజీల చార్జిషీటు దాఖలు చేసిన సిట్‌

విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బలకు రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ(28) చనిపోయాడని, ఆ తర్వాత మృతదేహాన్ని పీఎన్‌బీఎస్‌ ఎదురుగా ఉన్న స్వర్గపురిలో అర్ధరాత్రి దహనం చేశారని సిట్‌ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వివరించినట్టు తెలిసింది. ఈ కేసులో 50 పేజీలతో రూపొందించిన చార్జిషీటును సిట్‌ అధికారులు సోమవారం కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారంలో అప్పటి ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు, హెడ్‌ కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్‌కుమార్‌, జంగం నాని, నాగరాజు సన్నిహితుడు గులివిందల సురేశ్‌కుమార్‌, మాజీ కానిస్టేబుళ్లు కైతేపల్లి సాంబయ్య, జి.బాబూరావు, మాజీ హోంగార్డు కోనేటి వెంకటరాజు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉండడంతో సాయికృష్ణను మార్కాపురం నుంచి మే 5న కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. రెండు రోజులపాటు లాక్‌పలో విచారించారు. 8వ తేదీ రాత్రి నాని అతడిని ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత సాయికృష్ణను రాణిగారితోటలో పాడైపోయిన ఓ భవనంలో బంధించారు. సాయికృష్ణను కోర్టులో హాజరుపరచకుండా.. నిబంధనలకు విరుద్ధంగా బయట ఓ భవనంలో బంధించి చిత్రహింసలు పెట్టారు. పోలీసుల లాఠీ దెబ్బలకు అతడు మే 12 ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.


అదే రోజు అర్ధరాత్రి మృతదేహాన్ని అశోక్‌, నాని, సురేశ్‌ కలిసి ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేశారు. ఇదంతా నాటి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు ప్రణాళికల ప్రకారమే జరిగింది. వాటిని అమలు చేయడంలో అశోక్‌ కీలకంగా వ్యవహరించాడు. స్టేషన్‌ టెర్రస్‌ పైన, స్వర్గపురిలో కొన్ని ఎముకలు, రక్తపు మరకలు ఉన్న లాఠీలను, బూడిదను స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపాం. వాటి డీఎన్‌ఏను పరిశీలించడానికి మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి రక్తనమూనాలను ఎఫ్‌ఎస్ఎల్‌ సేకరించింది. సాయికృష్ణ చనిపోయిన తర్వాత మొత్తం డిజిటల్‌ సాక్ష్యాధారాలను నిందితులు మాయం చేశారు’’ అని సిట్‌ చార్జిషీట్‌లో రాసినట్టు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:33 AM