Share News

మన్యం కాఫీకి ఎల్‌నినో దెబ్బ

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:50 PM

ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల వల్ల మన్యం కాఫీ సంక్షోభంలో పడింది. కాఫీ పిందె దశ(జూలై- అక్టోబరు)లో 47 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.

మన్యం కాఫీకి ఎల్‌నినో దెబ్బ
జీకేవీధి పూజారిపాకలులో కాఫీ పండ్లు

వర్షాభావ పరిస్థితులతో భారీగా తగ్గనున్న దిగుబడులు, నాణ్యత

పిందె దశలో 47 శాతం తక్కువగా నమోదైన వర్షపాతం

కాఫీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం

ఆందోళన చెందుతున్న రైతులు, కాఫీ బోర్డు అధికారులు

చింతపల్లి/గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల వల్ల మన్యం కాఫీ సంక్షోభంలో పడింది. కాఫీ పిందె దశ(జూలై- అక్టోబరు)లో 47 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. మొక్కకు పోషకాలు అందకపోవడం వల్ల కాఫీ గింజ నాణ్యతపై తీవ్ర ప్రభావం పడిందని, దిగుబడులు తగ్గుతాయని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2026-27 కాఫీ మార్కెటింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

జిల్లాలో గిరిజన రైతులు సంప్రదాయేతర పంటగా కాఫీని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2.45 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. 2021లో నాట్లు వేసిన పది వేల ఎకరాల్లో ఈ ఏడాది తొలిసారిగా దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఎకరానికి గిరిజన రైతులు 400-500 కిలోల పండ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరానికి 80-90 కిలోల క్లీన్‌ కాఫీ లభిస్తుంది. గిరిజన రైతులు పండించిన కాఫీని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సహించడం వల్ల ప్రపంచస్థాయి గుర్తింపు సాధించింది. గిరిజన రైతుల ఆర్థిక ప్రగతికి కాఫీ ప్రధాన వాణిజ్య పంటగా మారిందని గుర్తించిన సీఎం చంద్రబాబు ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో సాగును విస్తరింపజేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. గత ఏడాది గిరిజన ప్రాంతంలో రైతులు 15 వేల మెట్రిక్‌ టన్నుల క్లీన్‌ కాఫీ ఉత్పత్తి చేశారు.

వర్షాభావ పరిస్థితులే కారణం

గిరిజన రైతులు కాఫీ పంటను కేవలం వర్షాధారంగా సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో నేటి వరకు ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్‌, మేలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌ నుంచి అక్టోబరు వరకు వర్షాలు అత్యధికంగా పడుతున్నాయి. సాధారణంగా వార్షిక వర్షపాతం 1,250 మిల్లీ మీటర్లుకాగా, ప్రతి ఏడాది 1,350-1,450 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండడంతో వర్షాభావ పరిస్థితులు గిరిజన ప్రాంతంలోనూ కనిపించాయి. ఈ ఏడాది కాఫీ పంట పూత దశ(మార్చి, ఏప్రిల్‌, మే)లో ఆశించిన మేరకు వర్షాలు పడ్డాయి. ప్రధానంగా పిందె దశ (జూలై- అక్టోబరు) వరకు 47 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొక్కకు పిందె దశలో సరైన పోషకాలు అందలేదు. దీంతో కాఫీ గింజల నాణ్యతపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. కాయ పరిమాణం తగ్గడంతో పాటు బీన్‌(గింజ) పరిపక్వత చెందలేదు. దీని వల్ల కాఫీ గింజ బరువు తగ్గడంతో పాటు నాణ్యత లోపించే అవకాశం ఉంది. పలు చోట్ల బ్లాక్‌ బెర్రీ(నల్ల కాయలు) అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కాఫీ దిగుబడులు సైతం భారీగా తగ్గే అవకాశం ఉంది.

కాఫీ మార్కెట్‌పై ప్రభావం

వర్షాభావ పరిస్థితులతో గింజల నాణ్యత తగ్గడం వల్ల 2026-27 కాఫీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కాఫీ అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేయడంతో రెట్టింపు దిగుబడులు సాధిస్తున్నారు. కాఫీ సాగులో అధిక మోతాదులో ఎరువులను రైతులు వినియోగిస్తున్నారు. అయితే గిరిజన రైతులు కాఫీ పంటను పూర్తిగా సేంద్రీయ (ఆర్గానిక్‌) పద్ధతిలో సాగు చేస్తున్నారు. దిగుబడులు తగ్గినప్పటికి కాఫీ గింజల నాణ్యతలో అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగానే గిరిజన రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ఠ ధరలు లభిస్తున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కాఫీ గింజల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల ఆశించిన ధర లభిస్తుందా?, లేదా అని రైతులు, కాఫీ బోర్డు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ముందుగానే పండిన కాఫీ

గూడెంకొత్తవీధి మండలంలో కాఫీ ఈ ఏడాది ముందుగానే పండింది. సాధారణంగా కాఫీ తోటల్లో నవంబరు రెండో పక్షంలో పండ్లు కనిపిస్తాయి. డిసెంబరు, జనవరిలో పండ్ల దిగుబడులు అధికంగా వస్తాయి. గిరిజన ప్రాంతంలో నవంబరు రెండో పక్షం నుంచి కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వర్షాలు అనుకూలించడంతో గూడెంకొత్తవీధి మండలం పూజారిపాకలు, పరిసర ప్రాంతాల తోటల్లో కాఫీ పండిపోయింది. దీంతో ఈ ఏడాది ముందుగానే రైతులు కాఫీ పండ్ల సేకరణ ప్రారంభించాల్సివుంది. ముందుగా పండిన ఈ పండ్ల నాణ్యతపై రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వర్షపాతం

నెల వర్షపాతం సాధారణ వర్షపాతం(మిల్లీమీటర్లలో)

జనవరి 1.4 4.8

ఫిబ్రవరి 48.6 4.3

మార్చి 70.4 29.6

ఏప్రిల్‌ 82.8 76.9

మే 109.6 101.2

జూన్‌ 165.2 155.3

జూలై 202.7 203.9

ఆగస్టు 80.9 202.4

సెప్టెంబరు(21) 141.4 223.5

Updated Date - Sep 21 , 2026 | 11:50 PM