Share News

గంజాయి, నేర రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:51 PM

జిల్లాలో గంజాయి, నేర రహిత సమాజమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

గంజాయి, నేర రహిత సమాజమే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్య

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి, నేర రహిత సమాజమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇతర నేరాల నియంత్రణపై సోమవారం కలెక్టరేట్‌లో ఎస్‌పీ అమిత్‌బర్దార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గంజాయి ప్రభావం లేకుండా పోలీసు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారన్నారు. డ్రోన్ల ద్వారా దానిని గుర్తించి సంపూర్ణంగా నిర్మూలించారన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు ఊసేలేదని, అయినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ‘చైతన్యం- ప్రజల ఐక్యతతో గంజాయి నిర్మూలన’ కార్యక్రమాన్ని పటిష్ఠగా అమలు చేస్తున్నామన్నారు. గంజాయి సాగు, రవాణా, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికడుతున్నామని తెలిపారు. ఎంపిక చేసిన 147 గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించామని, గత నేర చరిత్ర ఉన్న 82 మందికి కౌన్సెలింగ్‌ చేశామన్నారు. గంజాయిని శాశ్వతంగా నిర్మూలించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలకు పది మందితో కూడిన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంలో భాగంగా 32 మంది స్మగ్లర్లను గుర్తించి, 15 మందిపై పీడీ యాక్ట్‌ను అమలు చేసి, 586 మంది అనుమానితులపై సస్పెక్ట్‌ షీట్లు తెరిచామన్నారు. త్రిశూల్‌ కార్యక్రమంలో భాగంగా మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు చట్టపరమైన పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని ఎస్‌పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రియాజ్‌బేగ్‌, ఐసీడీఎస్‌ పీడీ రాధామాధవి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, ఎల్‌డీఎం మాతునాయుడు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఈగల్‌, అటవీ, వెలుగు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:51 PM