Share News

ఆమె బీసీ కాదట..!

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:50 AM

విజయనగరం జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కొత్త వివాదం తలెత్తింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న జడ్పీ మాజీ చైర్మన్‌ చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్ర నామినేషన్‌ చెల్లదంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆమె బీసీ కాదట..!

  • విజయనగరం జడ్పీ మాజీ చైర్మన్‌ చిన్న శ్రీను కుమార్తెపై కుల వివాదం

విజయనగరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కొత్త వివాదం తలెత్తింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న జడ్పీ మాజీ చైర్మన్‌ చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్ర నామినేషన్‌ చెల్లదంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు దీనిపై ఫిర్యాదు చేసింది. చిన్న శ్రీను ఇటీవల వైసీపీకి గుడ్‌బై చెప్పి కుమార్తెతో పాటు టీడీపీలో చేరారు. తాజాగా కుమార్తెను జడ్పీటీసీగా బరిలో దించారు. జనరల్‌ కేటగిరికి రిజర్వు చేసిన తెర్లాం, కొత్తవలస మండలాల నుంచి ఆమె నామినేషన్‌ వేశారు. ఆమె నామినేషన్‌ వేసిన నాడే వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఓసీ కులానికి చెందిన వ్యక్తికి బీసీగా ఎలా ధ్రువీకరణ పత్రం ఇస్తారని ప్రశ్నిస్తోంది. ఆమె అసలు పేరు ముస్కాన్‌ జైన్‌ అని.. తండ్రి పేరు రమేశ్‌ జైన్‌ అని వైసీపీ ఆరోపిస్తోంది. ఆమెకు బీసీ సర్టిఫికెట్‌ను తహశీల్దారు ఎలా జారీచేస్తారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. అభ్యంతరాలు తెలిపిన తరువాత కూడా అధికారులు నామినేషన్‌ స్వీకరించడాన్ని తప్పుపట్టారు. సోమవారం మరోసారి కలెక్టర్‌, జిల్లా రిటర్నింగ్‌ అధికారి ఎస్. రామసుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సిరిసహస్ర నామినేషన్‌ దాఖలుపై తొలుత తెర్లాం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బొమ్మి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. మజ్జి శ్రీనివాసరావు, సునీత దంపతులకు ఆమెను దత్తత ఇచ్చారనే వాదన కులాన్ని మార్చలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:50 AM