ఉత్తర కోస్తాకు తీవ్ర తుఫాన్ ముప్పు!
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:45 AM
ఉత్తర కోస్తాకు తీవ్ర తుఫాన్ గండం పొంచి ఉంది. ఈనెల 29 లేదా 30వ తేదీన ఉత్తరకోస్తాలో తీవ్ర తుఫాన్ తీరం దాటనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర కోస్తాకు తీవ్ర తుఫాన్ ముప్పు!
24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం?
26, 27 తేదీల్లో వాయుగుండంగా బంగాళాఖాతంలోకి ప్రవేశం
29, 30 తేదీల్లో తీవ్ర తుఫాన్‌గా ఉత్తర కోస్తా తీరంపైకి..
ఐరోపా వాతావరణ సంస్థ అంచనా
ఉత్తర కోస్తాకు తీవ్ర తుఫాన్ ముప్పు!
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఉత్తర కోస్తాకు తీవ్ర తుఫాన్ గండం పొంచి ఉంది. ఈనెల 29 లేదా 30వ తేదీన ఉత్తరకోస్తాలో తీవ్ర తుఫాన్ తీరం దాటనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 22 నాటికి అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దాని ప్రభావంతో 24 లేదా 25న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 26వ తేదీ తర్వాత మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత ఉత్తర కోస్తా దిశగా పయనిస్తూ 28వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని ఐరోపా వాతావరణ సంస్థ అంచనా వేసింది. తర్వాత మరింత బలపడి 29 లేదా 30వ తేదీన ఉత్తరకోస్తాలో తీరం దాటనుందని తాజా బులెటిన్‌లో పేర్కొంది. కాగా, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా పరిసరాల్లో తీరం దాటుతుందని మరో వాతావరణ మోడల్ అంచనా వేసింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాల్లో భారీవర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు అదే సమయంలో అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడి, మహారాష్ట్రలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి ఒకరు తెలిపారు. నెలాఖరు వరకు ఏర్పడే తుఫాన్లు ఉత్తరకోస్తా, ఒడిశా పరిసరాల్లో తీరం దాటుతుంటాయని వివరించారు.
నేడు, రేపు భారీ వర్షాలు: ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అల్లూరి, పోలవరం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు