Share News

రుణం లేదు.. ఉపాధి లేదు

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:50 AM

ఐదేళ్లపాటు ఉపాధి లేకుండా మైనార్టీ యువతను మాసీ సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్డు మీద నిలబెట్టారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వకపోవడంతో మైనార్టీ యువత ఉసూరు మంటున్నారు.

రుణం లేదు.. ఉపాధి లేదు

  • 30 వేల మంది మైనార్టీ యువత ఎదురుచూపులు

  • దరఖాస్తు చేసి ఏడాది దాటినా అందని వైనం

  • మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రాయితీ రుణాల దుస్థితి

  • స్వయం ఉపాధి కోసం కొనసాగుతున్న నిరీక్షణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఐదేళ్లపాటు ఉపాధి లేకుండా మైనార్టీ యువతను మాసీ సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్డు మీద నిలబెట్టారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వకపోవడంతో మైనార్టీ యువత ఉసూరు మంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ యువత స్వయంగా ఉపాధి పొందేందుకు ఆర్థికంగా చేయూతనందించాల్సిన ఏపీ స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్ఎంఎఫ్‌సీ) అందించే రాయితీ రుణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందాలనే లక్ష్యంతో వీరంతా దరఖాస్తు చేయగా.. రుణాలు ఎప్పుడందుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.


దరఖాస్తుల హ డావుడితో సరి..

2025 ఏప్రిల్‌లో మైనార్టీలకు స్వయం ఉపాధి పథకాల అమలు కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఏపీఎస్ఎంఎఫ్‌సీప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం(ఓబీఎంఎంఎస్‌) ద్వారా హడావుడిగా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది దాటినా ఇప్పటికీ ఆ రుణాల గురించి ఏం జరుగుతుందో చెప్పే వారు లేక, అసలు ఆ రుణాలు వస్తాయో? రావో? తెలియక దరఖాస్తుదారులు సతమతమవుతున్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత.. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్‌ ద్వారా అందించే రుణాలపై ఆశలు పెట్టుకున్నారు. ఆటోలు, చిన్న దుకాణాలు, సర్వీసు కేంద్రాలు, టైలరింగ్‌, చిరు పరిశ్రమలు తదితరాలకు ఆర్థిక సాయం అందితే తమ కుటుంబాలకు అండగా ఉంటుందని భావించారు. అయితే దరఖాస్తులు స్వీకరించి ఏడాది దాటిపోయింది. కనీసం ఆ దరఖాస్తులు ఏమయ్యాయి? రుణాలు మంజూరు చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే లేరని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని ఈ నిరీక్షణకు తెరదించి, అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నీరుగారుతున్న కూటమి ప్రభుత్వ లక్ష్యం..

మైనార్టీ సంక్షేమశాఖ అధికారుల అలక్ష్యంతో కూటమి ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నా... అధికారుల తీరుతో తమకు ఫలాలు సకాలంలో అందడంలేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 04:50 AM