Share News

స్థాయి పెరగని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:55 PM

మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) జిల్లాలోనే అతి పెద్దది. అయితే దీనిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)గా స్థాయు పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా నిబంధనల కారణంగా అది సాకారం కావడం లేదు.

స్థాయి పెరగని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ
సీహెచ్‌సీ స్థాయి పెంపునకు నోచని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ

సీహెచ్‌సీగా చేయాలని ప్రతిపాదనలు ఉన్నా అడ్డొచ్చిన నిబంధనలు

మండలంలో మరో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని గిరిజనుల వేడుకోలు

కొయ్యూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) జిల్లాలోనే అతి పెద్దది. అయితే దీనిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)గా స్థాయు పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా నిబంధనల కారణంగా అది సాకారం కావడం లేదు. దీంతో మండలంలో మరో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

మండలంలోని 16 సచివాలయాల పరిధిలో సుమారు 34 వేల జనాభాకు రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్య సేవలందిస్తోంది. ఈ పీహెచ్‌సీలో ఏటా 500 పైబడి ప్రసవాలు జరుగుతాయి. ప్రతి రోజూ 150 నుంచి 200 వరకు అవుట్‌ పేషెంట్లు వస్తుంటారు. జిల్లాల విభజనకు ముందు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో చేరిన గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పీహెచ్‌సీ పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉండేది. దానిని ఆనుకుని ఉన్న మండలానికి చెందిన 12 పంచాయతీల గిరిజనులు కృష్ణాదేవిపేట పీహెచ్‌సీలోనే వైద్య సేవలు పొందేవారు. అయితే ఆ పీహెచ్‌సీ వేరే జిల్లాలో చేరడంతో ఇప్పుడు మండల వాసులకు అత్యవసర సమయాల్లో మినహా మిగిలిన సమయాల్లో వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో రోగులు సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి వ్యయప్రయాసలకు ఓర్చి వస్తున్నారు. దీని వల్ల రాజేంద్రపాలెం పీహెచ్‌సీపై మరింత పని భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునైనా ఈ పీహెచ్‌సీ స్థాయి పెంచాలనే యోచన ఉన్నా ఇందుకు నిబంధనలు అడ్డు వస్తున్నాయి.

అడ్డొచ్చిన నిబంధనలు

రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోలవరం జిల్లా రాజవొమ్మంగి పీహెచ్‌సీని ఇటీవల సీహెచ్‌సీగా మార్చారు. దీంతో నిబంధనల ప్రకారం జిల్లాలతో సంబంధం లేకుండా ఒక సీహెచ్‌సీకి 50 కిలోమీటర్ల పరిధిలో మరో సీహెచ్‌సీ ఉండ కూడదు. దీంతో రాజేంద్రపాలెం పీహెచ్‌సీ స్థాయి పెంపుపై అనేక ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో రావణాపల్లి, లేదా పెదమాకవరంలో మరో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:55 PM