Share News

పారదర్శకంగా పరిషత్‌ ఎన్నికలు

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:14 AM

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా పరిషత్‌ ఎన్నికలు

  • భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులను సమీక్షించుకోవాలి

  • కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాలు, స్థానిక పరిస్థితులపై సమీక్షించారు. మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మైక్రో లెవెల్‌ ప్లానింగ్‌ రూపొందించామని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సెక్టార్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎ.మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో సుమారు 2,52,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ కోసం సుమారు 52వేల మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ మాట్లాడుతూ పరిషత్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని, పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:14 AM