ప్రకృతి విపత్తుల్లో ప్రజలకు అండగా సీఎం చంద్రబాబు.. జగన్‌పై మంత్రి సవిత విమర్శలు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:07 PM
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారని రాష్ట్ర మంత్రి సవిత అన్నారు.
శ్రీ సత్యసాయి, అక్టోబర్ 30: సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారని మంత్రి సవిత అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడని కొనియాడారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ బాధితులకు అండగా నిలుస్తూ.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పారు.
విజయవాడ వరదల సమయంలోనూ, తాజాగా ఆర్నాబ్ తుపాను సమయంలోనూ నిద్రపోకుండా ప్రజల కోసం పనిచేశారని పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు స్వయంగా పర్యటించి బాధితులకు భరోసా కల్పించారని.. బాధితులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. అయితే.. గత ప్రభుత్వ హయాంలో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రి విమర్శలు గుప్పించారు. వరద బాధితులను పరామర్శించే పేరుతో సినిమా సెట్టింగులు ఏర్పాటు చేశారని.. తుపాను సమయంలో ఐమాక్స్ థియేటర్‌లో సినిమా చూస్తూ గడిపారని ఆరోపించారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది మరణించిన సమయంలోనూ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. ప్రజల కష్టాలు, బాధితులను ఆదుకోవడం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని సవిత వ్యాఖ్యానించారు.
ఒక్కరోజే రూ.5,825 కోట్ల ఆర్థిక సాయం..
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఒకే రోజు పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.5,825 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకే వేసి అభివృద్ధికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, పట్టణాల అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సవిత కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News