Share News

గిరిపుత్రుల ఆరోగ్యానికి ‘సంజీవని’

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:12 AM

ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ‘సంజీవని’ ప్రాజెక్టును చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.

గిరిపుత్రుల ఆరోగ్యానికి ‘సంజీవని’

  • గిరిజన ప్రాంతాల్లో విద్య, తాగునీరు, రోడ్లు

  • ప్రతి కుటుంబానికీ ఆరోగ్య భరోసా

  • ప్రతి తల్లికీ ధైర్యం, ప్రతి బిడ్డకూ భవిష్యత్‌

  • రాష్ర్టాన్ని ధ్వంసం చేసిన గత పాలకులు

  • గ్రూప్‌-1 పేపర్లలో అక్రమాలు

  • కూటమి వచ్చాక మెగా డీఎస్సీ పెట్టాం

  • 16 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశాం

  • ఏడాది తర్వాత గొడ్డలి పార్టీ రాద్ధాంతం

  • సెప్టెంబరు, అక్టోబరులో స్థానిక ఎన్నికలు

  • దీంతో ఆ పార్టీ నేత కొత్త రాగాలు

  • ఏకగ్రీవాలపై నాడో మాట, నేడో మాట

  • బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారు

  • మాజీ మంత్రి కోడలే బయటపెట్టారు: సీఎం

  • గన్నెల పీహెచ్‌సీలో సంజీవనికి శ్రీకారం

  • మహిళలు, గ్రామస్థులతో ముఖాముఖి

  • 20 ఆరోగ్య రథాలు ప్రారంభం

  • నేడు శ్రీకాళహస్తి, అనంతకు చంద్రబాబు

  • ‘బాల స్వాస్థ్య’.. భేష్‌!.. 441 మంది పిల్లలకు చికిత్స

అరకులోయ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ‘సంజీవని’ ప్రాజెక్టును చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఈ ప్రాజెక్టును తొలుత చిత్తూరు జిల్లాలో అమలు చేశామని, ఇప్పుడిక్కడ ప్రారంభించామని, రానున్న 3 నెలల్లో జిల్లాలోని అన్ని ఆస్పత్రులకూ అనుసంధానిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య భరోసా, ప్రతి తల్లికీ ధైర్యం, ప్రతి బిడ్డకూ ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ‘అల్లూరి జిల్లా చరిత్రలోనే ఈరోజు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ప్రకృతి సంపద, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేయడమే సంజీవని లక్ష్యం. ఇది ప్రాజెక్టు మాత్రమే కాదు.. గిరిజనుల ఆరోగ్య రక్షణకు భరోసా. ఏఐ, డ్రోన్‌లతో వైద్య సేవలు అందిస్తాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఉపాధి, సంక్షేమ రంగాలను నిరంతరం అభివృద్ధి పథంలో నడిపిస్తాం’ అని తెలిపారు. రాష్ట్రాన్ని గత పాలకులు ధ్వంసం చేశారని.. వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


గ్రూప్‌-1 పేపర్లు అటెండర్లతో దిద్దించారు..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే పెట్టాను. 16 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తే, ఏడాది తర్వాత దానిపై గొడ్డలి పార్టీ రాద్ధాంతం చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలోని మొత్తం టీచర్‌ పోస్టుల్లో 80 శాతం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేసినవే. గత పాలకులు గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్టీవో స్థాయి అధికారులను ఎంపిక చేసే పరీక్ష పత్రాలను ఎలక్ర్టీషియన్లు, అటెండర్లతో దిద్దించారు. అలాగే దేవాలయాల ప్రతిష్ఠను దెబ్బతీశారు. బలవంతపు మత మార్పిడులు చేశారు. ఓ మాజీ మంత్రి కోడలు సైతం బయటకు వచ్చి ఇంట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టింది. తనను బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేశారని చెప్పింది. గత పాలకులు వాళ్ల పార్టీలో ఉండాలంటే మతం మార్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గొడ్డలి పార్టీతో చేతులు కలిపిన సివిల్‌ సర్వీస్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేత కొత్త రాగాలు తీస్తున్నారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదంటున్నారు. వారి పాలనలో మాత్రం ఏకగ్రీవాలు కావాలన్నారు. అధికారంలో ఉంటే ఒక విధంగా, విపక్షంలో ఉంటే మరో విధంగా మాట్లాడుతున్నారు. కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్టీఏ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పనిచేస్తోంది. సోమవారం వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తున్నాం. వచ్చే నెల రెండో తేదీన గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకొస్తున్నాం.


ఆర్కే నగర్‌వాసులతో మాటామంతీ

గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆర్కే నగర్‌లో 30 మంది సంజీవని లబ్ధిదారుల(డిజిట్‌ హెల్త్‌ రికార్డులు కలగినవారు)తో సీఎం సమావేశమయ్యారు. గర్భిణి దివ్యతో, మరో మహిళతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావం వల్ల వరి నాట్లు వేయలేకపోయామని దొన్ను అనే రైతు చెప్పగా.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రాజ్‌మా, రాగులు, కందులు మొదలైన విత్తనాలు సరఫరా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాఫీ తోటలు ఎంతమందికి ఉన్నాయి.. అంతర పంటగా మిరియాలు వేశారా.. ఏడాదికి ఎంత ఆదాయం వస్తోందని చంద్రబాబు రైతులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, స్ర్తీశక్తి పథకాల అమలు గురించీ అడిగారు. అనంతరం గ్రామస్థులతో ఫొటో దిగారు.

ఆరోగ్య రథాలు ప్రారంభం

అల్లూరి జిల్లాకు కేటాయించిన 20 ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గన్నెల పీహెచ్‌సీని సందర్శించారు. రక్త నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం డ్రోన్‌ ద్వారా పాడేరు ఆస్పత్రికి తరలించే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్‌, గుమ్మిడి సంధ్యారాణి, అరకు, పాడేరు టీడీపీ ఇన్‌చార్జులు దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.

స్థానికంలో అన్నీ గెలవాలి..

గన్నెలలో అరకు అసెంబ్లీ టీడీపీ నాయకులు, కార్యకర్తలతోనూ సీఎం సమావేశమయ్యారు. సెప్టెంబరు, అక్టోబరుల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయని.. అన్ని స్థానాల్లోనూ విజయం సాధించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చారు.


ఈ వార్తలను కూడా చదవండి

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్‌.. రూ.4.07 కోట్ల తక్షణ సాయం

ధోని, కోహ్లీ ఇచ్చిన సలహాలు పని చేశాయి: పంజాబ్ ప్లేయర్ యశ్ ఠాకూర్

Updated Date - Aug 30 , 2026 | 04:12 AM