Share News

రుషికొండ.. గుదిబండ

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:58 AM

నాడు జగన్‌ హయాంలో ప్రజాధనం రూ.450 కోట్లు వెచ్చించి.. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. నేడు కూటమి ప్రభుత్వం దానిని ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థకు లీజుకు ఇవ్వాలని ప్రకటన జారీ చేసినా జగన్‌ సర్కారు నిర్వాకంతో అడుగు ముందుకు పడడం లేదు.

రుషికొండ.. గుదిబండ

  • జగన్‌ అడ్డగోలు నిర్ణయం వల్లనే

  • వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన

  • ప్రజాధనం రూ.450 కోట్ల వ్యయం

  • కోర్టులో కేసులు వేసినా పట్టని వైనం

  • కూటమి ప్రభుత్వం లీజుకు ఇచ్చే యత్నం

  • కోర్టులో పిటిషన్లతో సాగని ప్రక్రియ

నాడు జగన్‌ హయాంలో ప్రజాధనం రూ.450 కోట్లు వెచ్చించి.. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంది.

నేడు కూటమి ప్రభుత్వం దానిని ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థకు లీజుకు ఇవ్వాలని ప్రకటన జారీ చేసినా జగన్‌ సర్కారు నిర్వాకంతో అడుగు ముందుకు పడడం లేదు.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రుషికొండ భవంతిని ఏం చేయాలన్న విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్‌ కమిటీని వేసింది. ఈ నెలాఖరుకు దానిపై నిర్ణయం తీసుకుంటామని విశాఖకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు, అంతకు ముందు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. అయితే, రుషికొండ ప్యాలె్‌సపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేక పోవడానికి నాడు జగన్‌ సర్కారు పర్యావరణ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించడమే కారణమని తెలిసింది. రుషికొండను చెక్కేసి.. నిబంధనలను పాతాళానికి తొక్కేసి.. నిర్మించిన ఈ భవంతి విషయంపై తాజాగా విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్‌ ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ భవనం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినందున కోర్టుల్లో కేసులు ఉన్నాయని, అందుకనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్నారు. దీంతో ఈ నెలాఖరుకు కూడా భవనంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.


నాడు పర్యాటకుల పేరిట పన్నాగం

రుషికొండపై పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి వైసీపీ ప్రభుత్వం 9.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లు వెచ్చించి నాటి సీఎం జగన్‌ కోసం ప్యాలెస్‌ను నిర్మించింది. ఆ భూమి కోస్తా నియంత్రణ మండలి(సీఆర్‌జెడ్‌) పరిధిలో ఉండడంతో నిర్మాణాలకు ఢిల్లీలోని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్‌) నుంచి అనుమతులు తీసుకోవాలి. వాస్తవానికి హరిత రిసార్ట్స్‌ నిర్మించిన సమయంలో 4.5 ఎకరాలకే అనుమతి లభించింది. ఆ రిసార్ట్స్‌ను కూలగొట్టి అదే స్థలంలో పర్యాటకుల కోసం భవనాలు నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ఢిల్లీకి తప్పుడు సమాచారం ఇచ్చింది. కానీ, ఇక్కడ కొండను భారీగా చెక్కేసి.. 9.8 ఎకరాల్లో నాలుగు బ్లాకులు నిర్మించింది. వాటిని పార్టీ సమావేశాలకు, జగన్‌ కుటుంబం ఉండడానికి అనుకూలంగా నిర్మించారు. సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని అప్పట్లోనే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ సమయంలో హైకోర్టుకు సైతం వైసీపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది. మరోవైపు భవనాలను వేగంగా పూర్తి చేసి 2024, ఫిబ్రవరిలో నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా వాటిని ప్రారంభించేశారు. కొద్ది నెలలకే కూటమి ప్రభుత్వం రావడంతో భవనాలను పరిశీలించింది. ఏ విధంగాను ఉపయోగపడేలా లేకపోవడంతో కొద్దిరోజులు వదిలేసింది.

వినియోగంలోకి తేవాలన్నా..

గత ఏడాది సెప్టెంబరులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రుషికొండ భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని వినియోగంలోకి తేవాలని పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్‌ని కోరారు. ఆ వెంటనే ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఆతిథ్య రంగంలో తాజ్‌, ఫెమా, వరుణ్‌ వంటి గ్రూపులు భవనాన్ని లీజుకు తీసుకునేందుకు ముందుకువచ్చాయి. అయితే, తాము సూచించిన కొన్ని మార్పులు చేస్తే తీసుకుంటామని మెలిక పెట్టాయి. దీంతో ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలుమార్లు భవనాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మరోవైపు, పలు సంస్థల సూచనల మేరకు రుషికొండపై ఖాళీగా ఉన్న 9 ఎకరాల భూమి కూడా ఇస్తామని ప్రభుత్వం మరోసారి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీచేసింది. అయితే, 7.5 ఎకరాలు సీఆర్‌జెడ్‌లో ఉండడంతో 1.5 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.


కేసు తేలే వరకు తప్పదా!

ఏదో ఒక విధంగా రుషికొండ ప్యాలెస్‌ను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌లు వేసిన పిటిషన్‌ గత జూలై 7న హైకోర్టులో విచారణకు వచ్చింది. అప్పటికే డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కూడా ఆ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను లీజుకు ఇవ్వడం తగదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో తాము ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే కోరామని, లీజుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది చూడాలి.

అందుకే.. ఇబ్బందులు: ఎంపీ

‘‘ఓ ఐటీ కంపెనీ ఆ భవనం తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కాకపోతే పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, కోర్టు కేసుల వల్ల లీజుకు ఇవ్వలేకపోతున్నాం’’ అని విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్‌ 2 రోజుల క్రితం ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనినిబట్టి ఆ కోర్టు కేసులు తేలేంత వరకు రుషికొండ భవనాల లీజు వ్యవహారం కొలిక్కివచ్చేలా కనిపించడం లేదు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 03:58 AM