Share News

అధికారులను ఇబ్బంది పెట్టడానికే ఆర్టీఐ అప్పీళ్లు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:49 AM

అనంతపురం జిల్లా కుం దుర్పి మండలానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇకపై ఎలాంటి అప్పీళ్లు చేయకుండా నిషేధం విధించినట్లు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ గాజుల ఆదెన్న ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారులను ఇబ్బంది పెట్టడానికే ఆర్టీఐ అప్పీళ్లు

  • దరఖాస్తుదారుపై సమాచార కమిషన్‌ నిషేధం

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కుం దుర్పి మండలానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇకపై ఎలాంటి అప్పీళ్లు చేయకుండా నిషేధం విధించినట్లు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు, రాష్ట్ర సమాచార కమిషనర్‌ గాజుల ఆదెన్న ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేశారు. డాక్యుమెంట్‌ రైటర్‌గా చెలామణి అయ్యే గోపాల్‌ అనే వ్యక్తి పదే పదే ఆర్టీఐ ద్వారా సమచారం అడగడం, ఇచ్చిన సమాచారం తప్పంటూ అప్పీలు చేయడం, దాని ఆధారంగా బెదిరింపులకు దిగడం చేస్తున్నారంటూ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం సమాచార కమిషన్‌ వద్ద గోపాల్‌కు చెందిన 101 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి తమ ముందుకు రావాలంటూ చీఫ్‌ కమిషనర్‌ ఆగస్టు 20న ఒకసారి, సెప్టెంబరు 9, 15 తేదీల్లో మరో రెండుసార్లు సమయం ఇచ్చారు. ఫిర్యాదుదారుడు విచారణకు రాలేదు. దీంతో అనంతపురం జిల్లాలోని అధికారుల్ని పిలిచి కమిషన్‌ వివరాలు అడిగింది.

‘గడిచిన 20 సంవత్సరాల్లో గోపాల్‌ 300 ఆర్టీఐ అప్పీళ్లు వేశాడు. వాటన్నింటికీ సమాధానం ఇచ్చాం. అయినా పదేపదే దరఖాస్తు చేస్తూ తమ పనికి ఆటంకం కలిగిస్తున్నాడు’ ఆ అధికారులు వివరించారు. దీంతో గోపాల్‌పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌... ‘అతను తెల్లకార్డుకు అర్హుడా? కాదా? అనే విషయం తెల్చండి’ అంటూ జిల్లా కలెక్టరును ఆదేశించారు. గోపాల్‌ బాధితుల్ని విచారించి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకూ ఆదేశాలిచ్చారు. ‘ఆర్టీఐ... సమాచారం పొందేందుకు మాత్రమే. బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడానికి కాదు’ అని వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:49 AM