రోడ్ ఇడియట్స్!
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:48 AM
ఇడియట్స్.. త్రీ ఇడియట్స్ గురించి విన్నాం కానీ... ఈ ‘రోడ్ ఇడియట్స్’ ఎవరంటారా? వాహనాలతో రోడ్డెక్కి అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారే... రోడ్ ఇడియట్స్!
రహదారి పొడవునా యమ కింకరులు.. ప్రమాదాలకు కారణమై ప్రాణాలు తీస్తారు
హైవేల పక్కన ఆగే లారీలతో యమ డేంజర్
అతి వేగంతో అదుపు తప్పి అనంత లోకాలకు
డ్రంక్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో ఘోరాలు
2025లో 5.13 లక్షల రోడ్డు ప్రమాదాలు
ఆ ఏడాది 1.83 లక్షల మంది మృత్యువాత
70 శాతం మరణాలకు అతివేగమే కారణం
హెల్మెట్ పెట్టుకోవాలంటే బద్ధకం...
భారీ సంఖ్యలో టూ వీలర్ల ప్రమాదాలు
రోడ్ల నిర్వహణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఇడియట్స్.. త్రీ ఇడియట్స్ గురించి విన్నాం కానీ... ఈ ‘రోడ్ ఇడియట్స్’ ఎవరంటారా? వాహనాలతో రోడ్డెక్కి అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారే... రోడ్ ఇడియట్స్! సోషల్ మీడియాలో ఈ మాటా బాగా పేరు పొందిందే! ఒకరకంగా చెప్పాలంటే... వీళ్లు యమ కింకరులు! హైవేల పక్కన అక్రమంగా లారీలు ఆపేవాళ్లు, రాంగ్ రూట్‌లో బండి నడిపేవాళ్లు, తాగి స్టీరింగ్ పట్టుకునే వాళ్లు, బ్రేకుకూ, యాక్సిలరేటర్‌కు తేడా తెలియకుండానే డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్న వాళ్లూ... అందరూ యమ కింకరులే!
తమ నిర్లక్ష్యంతో పరుల ప్రాణాలు తీసేస్తారు. ఈ ప్రమాదాల్లో వాళ్లూ ప్రాణాలు కోల్పోతారు. నిద్రమత్తులో నడిపేవాళ్లూ, హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కేవాళ్లూ ఆత్మాహుతి దళాల టైపు! తమతోపాటు ఇతరుల ప్రాణాలనూ బలితీసుకుంటారు. దారుల వెంట రక్తధారలకు ఇలాంటి వాళ్లే కారణం. ప్రమాదంలో ఒక్కరు మరణించడమంటే... ఆ కుటుంబం మొత్తం జీవితాంతం శోకం అనుభవించడమే! అలాంటిది మన దేశంలో 2025లో ఏకంగా రోడ్డు ప్రమాదాల్లో 1,83,382 మంది చనిపోయారు. అంటే... సగటున రోజుకు 501 మరణాలు! సగటున ప్రతి గంటకూ 21 ప్రాణాలు రోడ్లకు బలైపోతున్నాయి. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఎంత ఘోరం... ఎంత దారుణం! ఈ ప్రమాదాలకు ఏమిటి కారణం? వాటిని నివారించలేమా?
ప్రమాదంలో ఒక్కరు మరణించడమంటే... ఆ కుటుంబం మొత్తం జీవితాంతం శోకం అనుభవించడమే! అలాంటిది మన దేశంలో 2025లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1,83,382 మంది చనిపోయారు. అంటే... సగటున రోజుకు 501 మరణాలు! ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఎంత ఘోరం... ఎంత దారుణం! ఈ ప్రమాదాలకు ఏమిటి కారణం? వాటిని నివారించలేమా?
యువకులే బలి...
రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 65శాతం మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు వారే. మొత్తం మృతుల్లో 25 శాతం మంది 25-34 సంవత్సరాల మధ్య వయసు వారు. అంటే... అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడి, పెళ్లి చేసుకుని, చిన్న పిల్లలున్న వారు అర్ధంతరంగా రోడ్లకు బలైపోతున్నారు. వారి మరణం... మొత్తం కుటుంబానికే అశనిపాతం! ఇంకా ప్రమాదాల్లో వేలాదిమంది తీవ్రంగా గాయపడి... తలలు పగలడం, కాళ్లూ, చేతులూ విరిగి శాశ్వతంగా వైకల్యం బారిన పడుతున్నారు.
మరణాల్లో యూపీ టాప్
2025లో రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్, రోడ్డు ప్రమాదాల సంఖ్యలో తమిళనాడు టాప్‌లో ఉన్నాయి. 2024లో యూపీలో 24,118 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా, 2025లో 27,550కు పెరిగాయి. 2024లో తమిళనాడులో 67,526 రోడ్ యాక్సిడెంట్లు జరగగా, 2025లో అవి 71,387కు పెరిగాయి.
బ్లాక్ స్పాట్స్ కూడా కారణం
జాతీయ రహదారులపై 6,358 బ్లాక్ కారిడార్లను మోర్త్ గుర్తించింది. వీటి వల్ల 2023-25 మధ్య 37,164 మంది మరణించారు. గుంతలను పూడ్చడం, సిగ్నల్స్ సరిగ్గా కనపడేలా ఉంచడం, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలు ప్రమాదాలు, మరణాలు సుమారు 46 నుంచి 50 శాతం నియంత్రించగలిగాయి.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
అక్రమ పార్కింగ్, బ్లాక్ స్పాట్స్, సరైన రోడ్డు భద్రత చర్యలు తీసుకోకపోవడం వంటి సరిదిద్దగల తప్పుల వల్ల ఒక్క ప్రాణం పోయినా కూడా పౌరుల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైనట్లే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ప్రయాణికుల భద్రత కూడా భాగమేనని పేర్కొంది. పాలనలో నిర్లక్ష్యం, మౌలిక వసతుల్లో లోపాల కారణంగా ఎక్స్‌ప్రెస్ వేలు.. ప్రమాదాలకు రహదారులుగా మారకూడదంది.
ప్రభుత్వాలూ యముడి ప్రతినిధులే!
రోడ్డు ప్రమాదాలు... మరణాలపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తరచూ భావోద్వేగానికి గురవుతుంటారు. ‘అయ్యో... ఇన్ని చావులా’ అని కన్నీరు పెడుతుంటారు. విచిత్రమేమిటంటే... ఈ మరణాలకు ప్రభుత్వాలూ కారణమే! రోడ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలవల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యంతో... దారుల మధ్య పడ్డ గోతులు ద్విచక్ర వాహనదారులకు యమపాశాలవుతున్నాయి. ప్రమాదకరమైన మలుపులు, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించినా... తగిన చర్యలు తీసుకోవడంలేదు. రోడ్ మార్కింగ్స్, హెచ్చరిక బోర్డులు, కీలక ప్రాంతాల్లో లైట్లు... ఇవన్నీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలే!
మబ్బు వదలండి...
ఇటీవల జరిగిన ప్రమాదమిది! వాళ్లు అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరారు! తెల్లవారుజామునే గమ్యం చేరుకుని... అక్కడ పని పూర్తికాగానే మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు! అంటే... డ్రైవర్‌కు అది నిద్రలేని రాత్రి! తిరుగు ప్రయాణమే వారికి ఆఖరి ప్రయాణమైంది! కారణం... డ్రైవర్ నిద్ర మత్తు! రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు మరో అతిపెద్ద కారణం.. డ్రైవర్ నిద్రమత్తు! ‘డ్రైవింగ్‌లో నిద్ర నాదాకా రాదు!’ అనే అతి విశ్వాసంతో స్టీరింగ్ పట్టడం పెద్ద తప్పు! లాంగ్ డ్రైవ్‌లో రకరకాల కారణాలవల్ల తెలియకుండానే మైకం ఆవరిస్తుంది. రెండు క్షణాలు రెప్ప వాల్చి... స్టీరింగ్ మూడు డిగ్రీలు పక్కకు తిరిగినా ‘కన్ను మూసి తెరిచేలోపు’ డివైడర్‌నో, చెట్టునో కారు ఢీకొడుతుంది. డ్రైవర్ చేసిన తప్పునకు ప్రయాణికులు బలైపోతారు.
ద్విచక్ర దారుణాలు...
2024తో పోలిస్తే 2025లో టూ వీలర్ల ప్రమాదాలు 5 శాతం పెరిగాయి. గత కొన్నేళ్లుగా వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2023లో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాలు 13,401 నమోదు కాగా... 2024లో ఆ సంఖ్య 16,302కు... 2025లో 17,163కు పెరిగింది. అంటే సగటున రోజుకు 50 మంది గతేడాది మృత్యువాత పడ్డారు. ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్... దీనికి ప్రధాన కారణం.
2025లో....
మొత్తం రోడ్ యాక్సిడెంట్లు - 5,13,563
మరణించిన వారు - 1,83,382
ప్రతి గంటకు 21, రోజుకు 501 మరణాలు
ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదాలు - 82,124
మొత్తం ప్రమాదాల్లో ఓవర్ స్పీడ్ శాతం - 16
రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదాలు - 4,089
సిగ్నల్ జంపింగ్ - 276
మొబైల్ ఫోన్ వినియోగం - 136
ప్రతి గంటకు రోడ్డు ప్రమాదాలు - 59
టూ వీలర్ల ప్రమాదాల్లో మరణాలు 17,163
తాగుబోతు... చచ్చినోళ్లు!
తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారు... నంబర్ వన్ రోడ్ ఇడియట్స్! ‘హాఫ్ కొట్టినా నాకేం కాదు! మూడు పెగ్గులు లెక్కలోకే రాదు’ అంటూ అతి విశ్వాసంతో స్టీరింగ్ పట్టేస్తుంటారు. అసలు వాస్తవం ఏమిటంటే... మద్యం మత్తులో ఉన్నప్పుడు మెదడుకు స్పందించే గుణం మందగిస్తుంది. ‘టైమింగ్’ మిస్ అవుతుంది. మెదడుకు, శరీరానికీ మధ్య సమన్వయం కుదరదు. ‘డ్రంక్ డ్రైవర్లు’ చాలా డేంజర్! పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నా, జరినామాలు వేస్తున్నా, కౌన్సెలింగ్‌లు జరుపుతున్నా... తాగుబోతు డ్రైవర్లు ఎక్కడా తగ్గడంలేదు.
అరగంటలో పోయేదేముంది!?
200 కిలోమీటర్ల ప్రయాణం... గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళితే 2 గంటలు! 80 కిలోమీటర్ల వేగంతో వెళితే రెండున్నర గంటలు! తేడా కేవలం అరగంట! కానీ... వందలో పోయేటప్పుడు ప్రమాదం జరిగితే రిస్క్ చాలా ఎక్కువ! 80 కిలోమీటర్ల వేగంతో పోల్చితే వంద కిలోమీటర్ల వేగంలో ప్రమాదం జరిగినప్పుడు... ప్రాణాలు కోల్పోయే అవకాశం 144శాతం పెరుగుతుంది. తీవ్రగాయాలపాలయ్యే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే... కేవలం 25శాతం వేగం పెరగడంవల్ల ‘క్రాష్ కైనెటిక్ ఎనర్జీ’ ఏకంగా 56 శాతం పెరుగుతుంది.
వందకే ఇంత డేంజర్! మరి... స్పీడు 120-130లో కొడితే ఏంటి పరిస్థితి!? రోడ్డు ప్రమాదాల మరణాల్లో 70 శాతానికి అతివేగమే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. వేగంలో వచ్చే చిన్న మార్పు కూడా ప్రమాదాల్లో పెద్ద ప్రభావం చూపుతుందని నీల్సన్ పవర్ మోడల్ స్పష్టం చేస్తోంది. ఆ మోడల్ లెక్క ప్రకారం.. సగటు వేగంలో ప్రతి 1 శాతం పెరుగుదల వల్ల గాయాలయ్యే ప్రమాదం దాదాపు 2 శాతం పెరుగుతుంది. తీవ్ర గాయాల ప్రమాదం 3 శాతం, ప్రాణాంతక ప్రమాదం 4 శాతం పెరుగుతాయి. కొంపలంటుకుపోతున్నట్లుగా స్పీడుగా వెళ్లి అక్కడ చేసేదేమీ ఉండదు! అవసరమైతే ఒక అరగంట ముందు బయలుదేరి... భద్రంగా గమ్యం చేరుకోవడం తెలివైన పని!
ఆగి ఉన్న ‘మృత్యువు’
ఒక డ్రైవరు హైవే పక్కన లారీ ఆపేసి కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లాడు. ఇంకొకడు డీజిల్ ఉందా లేదా అనే స్పృహ కూడా లేకుండా బండి నడుపుతూ... డీజిల్ అయిపోగానే లారీని రోడ్డు పక్కన ఆపేశాడు. వెనుక నుంచి వస్తున్న కారు, మరో లారీ వీటిని ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోయారు. ఇటీవల ఒకేరోజు వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న దుర్ఘటనలివి. నిర్దేశిత ప్రాంతాల్లో మినహా హైవేల వెంట ఎక్కడపడితే అక్కడ లారీలు, వాహనాలు ఆపడం చట్టవిరుద్ధం! ఏదైనా మరమ్మతులకు గురై వాహనాన్ని ఆపాల్సి వస్తే... వెనుక వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా రిఫ్లెక్టర్లు పెట్టాలి. అయినా... ఎవరూ పట్టించుకోరు.
అతి వేగం, ముందున్న వాహనం ఆగి ఉన్నప్పటికీ కదులుతోందనే భావించడం, రాత్రి వేళల్లో తగిన అంచనాలకు రాలేకపోవడం, డ్రైవర్ నిర్లిప్తత... ఇలాంటి కారణాలతో వేగంగా వెళ్లి నేరుగా ఆగి ఉన్న లారీలను ఢీకొట్టేస్తున్నారు. చివరి క్షణంలో గుర్తించినా... స్పందించే సమయం ఉండదు. కేంద్ర రవాణా శాఖ గణాంకాల ప్రకారం... ఆగిఉన్న లారీలు/వాహనాలను ఢీకొట్టడం అనే ఒకే ఒక్క కారణంతో సుమారు 13వేల ప్రమాదాలు జరిగాయి. ఐదువేల మందికిపైగా మరణించారు. 12వేల మంది గాయపడ్డారు. ఇన్ని ఘోరాలకు కారణయ్యే వాళ్లు యమ కింకరులా... కాదా!?
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా