Share News

బియ్యం ధరలకు రెక్కలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:09 AM

ఏదైనా వస్తువు ధర పెరగాలంటే.. ఉత్పత్తి తక్కువగా ఉండి, వినియోగం పెరగాలి. లేదా ఆ వస్తువుపై పన్నుల భారం పడాలి. కానీ ఇవేమీ లేకుండానే రాష్ట్రంలో బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి.

బియ్యం ధరలకు రెక్కలు

  • రెండు నెలల్లోనే క్వింటాకు వెయ్యి పెరుగుదల

  • ఎల్‌నినో పేరుతో వ్యాపారుల మాయాజాలం

  • కృత్రిమ డిమాండ్‌ సృష్టిస్తూ రేట్లు పెంపు

  • సూపర్‌ఫైన్‌ రకం 2 వేలకు చేరిన వైనం

  • రేట్లు పెరుగుదలతో సామాన్యుల బేజారు

  • రైతుబజార్లలో కిలో 52కే సన్న బియ్యం

  • అయినా మార్కెట్లలో తగ్గని బియ్యం ధర

  • ధరల నియంత్రణపై దృష్టి పెట్టని అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఏదైనా వస్తువు ధర పెరగాలంటే.. ఉత్పత్తి తక్కువగా ఉండి, వినియోగం పెరగాలి. లేదా ఆ వస్తువుపై పన్నుల భారం పడాలి. కానీ ఇవేమీ లేకుండానే రాష్ట్రంలో బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. నెల నెలా పెరుగుతూ పోతున్నాయి. బియ్యం ధరలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కాక సామాన్యులు సతమతమవుతున్నారు. ఎల్‌నినో సాకుతో వ్యాపారులు ధరల మాయాజాలానికి తెరతీశారు. ఈ ఏడాది వర్షాలు లేక ధాన్యం పండదనే ప్రచారంతో జూలై నెల నుంచి బియ్యం ధరలను పెంచుకుంటూ పోతున్నారు. రెండు నెలల్లోనే బియ్యం రేటు క్వింటాలుకు రూ. వెయ్యికి పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం రిటైల్‌ దుకాణాల్లో సాధారణ రకం కిలో బియ్యం రూ. 50కి తక్కువ లేదు. నాణ్యమైన బియ్యం రిటైల్‌గా కిలో రూ. 60 నుంచి 70దాకా పలుకుతున్నాయి. సోనా మసూరి, బీపీటీ రకాలు 25 కిలోల రైస్‌ బ్యాగ్‌ జూన్‌లో రూ. 1,250కే వచ్చేది. ఇంకాస్త నాణ్యమైన బియ్యం బ్యాగ్‌ రూ. 1,500కు లభించేది. ఇవే రకాలు ఇప్పుడు రూ. 1,500 నుంచి 1,750 చెప్తున్నారు. ఇంకా నాణ్యమైన బియ్యం కిలో రూ. 80 చొప్పున 25 కిలోల బ్యాగ్‌ రూ. 2 వేలు పలుకుతోంది. ప్రజల మోజు, కొనుగోళ్లను ఆసరాగా చేసుకుని, ఈ రకంగా నాణ్యమైన, సన్న బియ్యానికి కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించి వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. ఫైన్‌ క్వాలిటీ రైస్‌ మాత్రమే ప్రజలు అడుగుతున్నారని, ముతకరకాల బియ్యాన్ని ఎవరూ అడగడం లేదంటూ వ్యాపారులు వాటిని షాపుల్లో అందుబాటులో ఉంచడంలేదు. ఉన్న చోట్ల వాటి రేటు కూడా కిలోకు రూ. 50-55 చెప్తున్నారు.


గ్రామాల్లో రైతు బజార్లు లేక..

రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో రైస్‌మిల్లర్లతో పౌరసరఫరాలశాఖ ఒప్పందం చేసుకుని, ఆగస్టు నుంచి అన్ని రైతుబజార్లలో నాణ్యమైన బియ్యం కిలో రూ. 52కే సరఫరా చేస్తోంది. అయినా అందరూ అక్కడికి వెళ్లి నెలకు సరిపడా కొని తెచ్చుకునే పరిస్థితి ఉండటం లేదు. పైగా రైతుబజార్లు కేవలం పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్థానికంగా రిటైల్‌ దుకాణాల్లోనే కొనాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఓ వైపు పేద వర్గాలకు పౌరసరఫరాల సంస్థ రేషన్‌ కార్డులపై బియ్యం ఉచితంగా ఇస్తోంది. మరోవైపు తక్కువ ధరకు రైతుబజార్లలో నాణ్యమైన బియ్యం విక్రయిస్తోంది. అయినా వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో ధరలు పెంచడం వెనుక ప్రభుత్వంపై అసంతృప్తిని రగిలించే అంశమేదైనా ఉందేమో అని కొందరు భావిస్తున్నారు.

కరువును బూచిగా చూపి..

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, పంటలు సరిగ్గా పండకపోతే.. దాని ప్రభావం వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంటుంది. కానీ కొందరు వ్యాపారులు ఇప్పటికే కరువు వచ్చేసినట్లు.. వరి పండనట్టు, ధాన్యం ఉత్పత్తి కానట్టు.. బియ్యం నిల్వలు తరిగిపోయినట్టు.. ప్రజలను భయపెడుతున్నారు. బియ్యంతో పాటు పప్పులు, వంట నూనెల ధరలు కూడా పెంచారు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో బియ్యం ధరలు పెరిగిన దాఖలా లేదు. సహజంగా పెరిగే రీతిలో కొన్ని రాష్ట్రాల్లో కిలోకు రూ. నాలుగైదు పెరిగినట్లు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోనే రేట్లు అనూహ్యంగా పెరిగాయి. వాస్తవంగా ఖరీఫ్‌లో 15.14లక్షల హెక్టార్ల వరి సాగు చేస్తారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 12.72 లక్షల హెక్టార్లలో (84 శాతం) నాట్లు వేశారు. సాధారణ విస్తీర్ణంలో పండించిన ధాన్యం కూడా ఏటా మిగులు ఉంటోంది. ఈ ఏడాది వరి ఉత్పత్తిపై అధికారులు ఇంకా తుది అంచనాకు రాలేదు.


సాధారణంగా కొత్త ధాన్యం మార్కెట్‌కు వచ్చే దశలో పాత బియ్యం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటం సహజం. కానీ పంట ప్రారంభ సమయంలోనే వ్యాపారులు ధరలు పెంచేశారు. ఖరీఫ్‌ వరి కోతలకు ఇంకా నెలపైనే వ్యవధి ఉంది. అయినా ఇప్పటికే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని ధరలతో పాటు బియ్యం ధరలను కూడా పెంచేయడంతో సామాన్యులకు భారంగా మారింది. నాణ్యమైన బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. కరువు ఛాయలను ఆసరా చేసుకుని, అధిక లాభాలు ఆర్జించాలన్న ఉద్దేశమే వ్యాపారుల్లో కనబడుతోందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. ధరల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శిస్తున్నారు.

అర్థగణాంక శాఖ లెక్కలివీ

  • రాష్ట్ర అర్థగణాంక, ప్రణాళికశాఖ నెలవారీగా సేకరించే సమాచారం ప్రకారం మే నెలలో రాష్ట్ర సగటు ధరల్లో సూపర్‌ఫైన్‌ రకం బియ్యం కిలో రూ. 60.34, ఫైన్‌ రకం రూ. 53.26, కామన్‌ వెరైటీ రూ. 43.05గా ఉంది.

  • జూలై నెలలో సూపర్‌ఫైన్‌ రూ. 63.17, ఫైన్‌ రకం రూ. 55.71, కామన్‌ వెరైటీ రూ. 45.69గా నమోదైంది.

  • ప్రస్తుతం మార్కెట్‌లో సూపర్‌ఫైన్‌ రకం రూ. 80, ఫైన్‌ రకం రూ.70, కామన్‌ వెరైటీ రూ. 60 పలుకుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:09 AM