జడ్పీ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:05 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,350 కేంద్రాలు
విశాఖపట్నంలో 203, అనకాపల్లిలో 1,530, అల్లూరి జిల్లాలో 617
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మూడు జిల్లాల పరిధిలోని 39 మండలాలకు సంబంధించి 2,350 పోలింగ్ కేంద్రాలతో తుది జాబితాను శనివారం విడుదల చేశారు. ఈ మేరకు విశాఖపట్నం జడ్పీ కార్యాలయంలో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్ సంయుక్తంగా నోటీసు బోర్డులో తుది జాబితాను ప్రదర్శించారు. అలాగే మూడు జిల్లాల్లోని అన్ని మండల అభివృద్ధి కార్యాలయాల్లో తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించారు. విశాఖపట్నం జిల్లాలో 203, అనకాపల్లి జిల్లాలో 1,530, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 617 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. మండలాల వారీగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజల అవగాహన, పరిశీలన నిమిత్తం మండలాల్లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు స్పష్టంచేశారు.
------------------------------------------------------------------
విశాఖపట్నం జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ కేంద్రాలు
------------------------------------------------------------------
మండలం ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు
----------------------------------------------------------------
ఆనందపురం 17 65
భీమునిపట్నం 12 43
పద్మనాభం 15 56
పెందుర్తి 9 39
-----------------------------------------------------------------
మొత్తం 53 203
----------------------------------------------------------------
వర్షంతో ఉపశమనం
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఏడు గంటల వరకు దఫదఫాలుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. ఐదారు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నుంచి రెండు, మూడురోజులపాటు నగరంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.