Share News

ఆ ‘సీక్రెట్‌’ ఫండ్‌ నాకు పంపండి!

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:46 AM

రవాణా శాఖలో ‘సీక్రెట్‌ ఫండ్‌’ వ్యవహారంపై పెద్దఎత్తున అంతర్గత చర్చ జరుగుతోంది. కమిషనరేట్‌ నుంచి ఇటీవల విడుదలైన నిధులను డబ్బుల రూపంలో మార్చి తనకు పంపండి అంటూ ఓ రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ సంబంధిత ఆర్టీవోలకు ఫోన్‌ చేసి అడిగినట్లు సమాచారం. ‘ఎందుకు అడుగుతున్నానో.. మీరే అర్థం చేసుకోండి..’ అంటూ ఆ రిటైర్డ్‌ జేటీసీ అంటుండడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ‘సీక్రెట్‌’ ఫండ్‌ నాకు పంపండి!

  • ఎందుకు అడుగుతున్నానో.. మీరే అర్థం చేసుకోండి

  • ఆర్టీఏ అధికారులకు రిటైర్డ్‌ జేటీసీ ఫోన్లు

  • ఈ వ్యవహారంపై రవాణా శాఖలో గుసగుసలు

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో ‘సీక్రెట్‌ ఫండ్‌’ వ్యవహారంపై పెద్దఎత్తున అంతర్గత చర్చ జరుగుతోంది. కమిషనరేట్‌ నుంచి ఇటీవల విడుదలైన నిధులను డబ్బుల రూపంలో మార్చి తనకు పంపండి అంటూ ఓ రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ సంబంధిత ఆర్టీవోలకు ఫోన్‌ చేసి అడిగినట్లు సమాచారం. ‘ఎందుకు అడుగుతున్నానో.. మీరే అర్థం చేసుకోండి..’ అంటూ ఆ రిటైర్డ్‌ జేటీసీ అంటుండడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కమిషనర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌పై అవినీతి మరకల్లేవు. వారిద్దరికి తప్ప ఈ ఫండ్‌ వ్యవహారం మరొకరికి తెలియదు. అయినా ఒక పదవీ విరమణ పొందిన అధికారికి ఎలా తెలిసింది? ఆయన ఎందుకు ఇలా డబ్బులు అడుగుతున్నారు?’ అంటూ ఈ వ్యవహారం రహస్య చర్చకు దారితీసింది. వాహనాలు అక్రమంగా తిరుగుతున్నా, దొంగ లైసైన్స్‌లు జారీచేస్తున్నా, నకిలీ ఆర్‌సీలు సృష్టిస్తున్నా, రోడ్‌ టాక్స్‌ ఎగ్గొడుతున్నా, బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తున్నా, ఆఖరికి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నా.. రహస్యంగా సమాచారం సేకరించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రవాణా శాఖకు ‘సీక్రెట్‌ సర్వీస్‌ ఫండ్‌’ కింద ఏటా లక్షలాది రూపాయలు కేటాయిస్తుంది. గత ప్రభుత్వంలో కార్యాలయాలకు నిర్వహణ ఫండ్‌ విడుదల చేయకపోవడంతో ఈ నిధులను స్టేషనరీ కోసం, అధికారుల సమావేశాల్లో భోజనాలు, రవాణా ఖర్చులకు కేటాయించారు. అయితే మూడేళ్లుగా సీక్రెట్‌ సర్వీస్‌ ఫండ్‌ అలా వాడుకోవడానికి వీళ్లేదంటూ ఉన్నతాధికారి బ్రేకులేశారు.


ఎవరో చెబితేనే కదా తెలిసేది..!

ఈ క్రమంలో ఇటీవల కమిషనరేట్‌ పలువురు ఆర్టీవోలకు ఆ ఫండ్‌ నుంచి లక్షలాది రూపాయలు విడుదల చేసింది. ఆ సొమ్ము ఖాతాల్లోకి చేరిన వెంటనే ఇటీవలనే పదవీ విరమణ పొందిన ఒక రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌ సంబంధిత ఆర్టీవోలకు ఫోన్‌ చేసి ‘మీ ఖాతాలో పడ్డ డబ్బులు నాకు నగదు రూపంలో పంపండి’ అని అడిగినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు అకౌంట్లో వేశారు? ఎందుకు నగదు రూపంలో మార్చి పంపమంటున్నారు? అని ఒకరిద్దరు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని సమాచారం. ఆర్టీవోల్లో వారిలో వారే.. ‘నీకు సీక్రెట్‌ సర్వీస్‌ ఫండ్‌ వచ్చిందా? ఆ డబ్బులు డ్రా చేసి రిటైర్డ్‌ జేటీసీ పంపమన్నారా?’ అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతలోనే విషయం తెలుసుకున్న రిటైర్డ్‌ జేటీసీ ‘మీకు డబ్బులు వచ్చిన విషయం నాకు ఎలా తెలుస్తుంది.. ఎవరో చెబితేనే కదా.. సర్వీ్‌సలో ఉన్నప్పుడే నేను ఎవరినీ డబ్బు డిమాండ్‌ చేయలేదు.. రిటైర్డ్‌ అయ్యాక అడుగుతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి.. ఆరా తీయకూడదు’ అని వారితో అనడంపై అనుమానాలు వస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 05:47 AM