Share News

పోలీస్‌ చేజింగ్‌.. ‘ఎర్ర’ స్మగ్లర్లపై కాల్పులు!

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:03 AM

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ జాకీర్‌తో పాటు మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా..

పోలీస్‌ చేజింగ్‌.. ‘ఎర్ర’ స్మగ్లర్లపై కాల్పులు!

  • కడప జిల్లాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ జాకీర్‌, మరో నిందితుడు అరెస్ట్‌

  • వారి వాహనాలను వెంబడించగా.. కత్తులు, కర్రలతో ఎదురుదాడి.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలు

  • పోలీసుల కాల్పుల్లో జాకీర్‌ కాలికి బుల్లెట్‌ గాయం

  • నిందితుడిపై 82 ఎర్రచందనం రవాణా కేసులు

  • వివరాలు వెల్లడించిన ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌

మైదుకూరు/కడప క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ జాకీర్‌తో పాటు మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా.. పోలీసులు నిందితులను పట్టుకొనేందుకు వారి వాహనాలను వెంబడించారు. ఈ క్రమంలో నిందితులు కత్తులు, కర్రలు, రాళ్లతో ఎదురుదాడి చేశారు. ఓ కానిస్టేబుల్‌కు గాయాలుకాగా.. పోలీసులు జాకీర్‌ ఎడమ కాలిపై కాల్పులు జరిపి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చాపాడు మండలం ఖాదరపల్లెకు చెందిన షేక్‌ చిమ్మర్తి జాకీర్‌ మరికొందరితో కలసి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నాడన్న సమాచారంతో చాపాడు ఎస్సై చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దువ్వూరు వద్ద తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా వస్తున్న ఒక ఐచర్‌, షిఫ్ట్‌ డిజైర్‌ వాహనాలను ఆపేందుకు ప్రయత్నించారు. నిందితులు వాహనాలు ఆపకుండా అడవిలోకి పారిపోయేందుకు చూశారు. ఆ వాహనాల్లో జాకీర్‌ ఉన్నాడని గుర్తించిన ఎస్సై తన సిబ్బందితో వెంబడించారు. దువ్వూరు వద్ద ఉన్న జగనన్న కాలనీ సమీపంలో వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా.. నిందితులు వాహనాలను ఆపి పోలీసులపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జాకీర్‌ దాడిలో కానిస్టేబుల్‌ చెన్నయ్యకు గాయాలయ్యాయి.


జాకీర్‌ను లొంగిపోవాలని పలుమార్లు హెచ్చరించినా లెక్క చేయకుండా పోలీసులపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణతో పాటు అతన్ని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్సై మొదట రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా దాడికి ప్రయత్నించడంతో జాకీర్‌ ఎడమ కాలిపై కాల్చడంతో గాయపడ్డాడు. మరో నిందితుడు మంగపట్నం సుధాకర్‌నూ అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ చెన్నయ్యను మైదుకూరు ప్రభుత్వాపత్రికి, జాకీర్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. నిందితుల నుంచి 161 కిలోలు బరువున్న 7 ఎర్రచందనం దుంగలు, ఐచర్‌ వాహనం, షిఫ్ట్‌ డిజైర్‌ కారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జాకీర్‌పై 82 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, 15 చోరీ కేసులు, 4 పీడీ యాక్ట్‌ కేసులు, రెండు దాడి కేసులు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే మూడు గ్యాంగ్‌లను పట్టుకున్నామని, వారితో జాకీర్‌కు సంబంధాలున్నాయ్న అనుమానం ఉందని ఎస్పీ తెలిపారు.

పోలీసులే తీసుకెళ్లి కాల్పులు జరిపారు: జాకీర్‌ కుమార్తె

కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జాకీర్‌ను కలిసేందుకు అతని కుమార్తె అప్సానా బంధువులతో కలిసి రాగా.. పోలీసులు అనుమతించలేదు. అప్సానా మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రొద్దుటూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నామని, కొంతకాలంగా తన తండ్రి ఇంటి వద్దే ఉన్నాడన్నారు. బుధవారం మైదుకూరు సీఐ మరో 15 మంది పోలీసులు తన తండ్రిని తీసుకెళ్లేందుకు తమ ఇంటికి వచ్చారని, అయితే తన తండ్రి వారితో వెళ్లేందుకు నిరాకరించారని తెలిపారు. రెండు నెలల క్రితం తన తల్లిని కూడా ఎర్రచందనం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. అందుకని పోలీసుల వెంట వెళ్లేందుకు తన తండ్రి నిరాకరించారన్నారు. రాకపోతే కాలుస్తామని పోలీసులు బెదిరించి, బలవంతంగా తీసుకుని వెళ్లారన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

సన్నాలకు రికార్డు ధర

అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..

Updated Date - Sep 25 , 2026 | 05:03 AM