తిరుమలలో జలాశయాలు కళకళ
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:36 AM
తిరుమలలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు నీరు చేరుతోంది. తిరుమలలో కేవలం 90 రోజులకు మాత్రమే నీటి లభ్యత ఉందని ఇటీవలే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.
ఇటీవల వర్షాలతో డ్యాములకు 61.68 లక్షల గ్యాలన్ల నీరు
తిరుమల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు నీరు చేరుతోంది. తిరుమలలో కేవలం 90 రోజులకు మాత్రమే నీటి లభ్యత ఉందని ఇటీవలే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఆగస్టు చివరిలో తిరుమలలో వరుణయాగం నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో కురిసిన వర్షాల కారణంగా 148.48 లక్షల గ్యాలన్ల నీరు జలాశయాల్లోకి చేరింది. గురువారంతో పోలిస్తే శుక్రవారానికి తిరుమలలోని ఐదు జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరిగింది.
తిరుమలలో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. పాపవినాశనం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు కాగా.. గురువారం నాటికి జలాశయంలో 2667 లక్షల గ్యాలన్ల నీరుండగా ప్రస్తుతం 2688.35 లక్షల గ్యాలన్లకు పెరిగింది. గోగర్భం డ్యాంలో మొత్తం 2833.10 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా గురువారం వరకు 499.06 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే ఉంది. అయితే శుక్రవారం నాటికి 508.31 లక్షల గ్యాలన్లకు చేరింది.
ఆకాశగంగలో మొత్తం 685 లక్షల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా గురువారం నాటికి 24.07 లక్షల నీరు మాత్రమే ఉంది. వర్షం కారణంగా నీటి నిల్వ 30.40 లక్షల గ్యాలన్లకు చేరింది. కుమారధారలో మొత్తం 4259.01 లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం ఉండగా గురువారం నాటికి 338.84 లక్షల గ్యాలన్ల నీరు ఉంది. గురువారం, శుక్రవారం కురిసిన వర్షానికి నీటి నిల్వ 363.98 లక్షల గ్యాలన్లకు చేరుకుంది. పసుపుధారలో 1287.54 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా గురువారం నాటికి 24.38 లక్షల గ్యాలన్లు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టులోకి కొత్తగా నీరు చేరలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల