Share News

ఉద్యానవన ‘సీమ’

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:31 AM

ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌- రాయలసీమ రైజింగ్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

ఉద్యానవన ‘సీమ’

  • మారనున్న రాయలసీమ ముఖచిత్రం

  • లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌

  • సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నిర్మల

  • పూర్వోదయ నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారుల నిర్మాణం

  • 9.6 లక్షల మంది రైతుల ఆదాయం పెంపే లక్ష్యం: మంత్రి అచ్చెన్న

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌- రాయలసీమ రైజింగ్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. సీమ రైతులు తరచూ ఎదుర్కొనే కరువు, సాగు నీరు, మార్కెటింగ్‌ సమస్యలకు పరిష్కారంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక(ఐహెచ్‌డీపీ)కు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రూపకల్పన జరిగింది. శుక్రవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఉద్యాన హబ్‌ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ నిధులతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయింది. ఐహెచ్‌డీపీ కోసం రూ.లక్ష కోట్లు వెచ్చించబోతున్నాం.

10 జిల్లాలు... అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 303 మండలాలు, 5869 గ్రామాల్లో 201 క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. మొత్తం 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తాం. అంతిమంగా 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాల పెంపే మా లక్ష్యం. ఉద్యానవన పంటల విస్తరణకు అనువైన మౌలిక సదుపాయాలు... సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. ఐహెచ్‌డీపీతో సీమ ముఖచిత్రమే మారిపోతుంది. ఇందుకోసం ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. ప్రైవేట్‌ రంగంలో మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నాం. ఇందులో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.4,562 కోట్లు ఖర్చు చేయనున్నాం. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వివరించారు.


విత్తన రాయితీకి 348 కోట్లు: అచ్చెన్న

‘ఈ ఏడాది విత్తన రాయితీకి రూ.348 కోట్లు అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 40 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాలకు తరలించాం. మిగతా విత్తనాలను 15 నాటికి చేరుస్తాం. 80 శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నాం. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా జగన్‌ మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది’ అని మంత్రి అచ్చెన్న మరో ప్రకటనలో మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:31 AM