Share News

రాయచోటిలో పంజాబ్‌ బౌన్సర్లు

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:12 AM

అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ బౌన్సర్ల నుంచి పోలీసులు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జిన్నా షరీఫ్‌కు బౌన్సర్లుగా ఉన్న నలుగురు సరైన పత్రాలు లేకుండా ఆయుధాలు కలిగి ఉండడంతో ..

రాయచోటిలో పంజాబ్‌ బౌన్సర్లు

  • రంగంలోకి దించిన వైసీపీ అభ్యర్థి

  • పోలీసుల అదుపులో జిన్నా షరీఫ్‌,

  • ఆయన కొడుకు సహా 15 మంది బౌన్సర్ల నుంచి 2 తుపాకులు స్వాధీనం

  • 15 మందిపైనా ఆయుధ చట్టం కింద కేసు

  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

  • హింసకు కుట్ర పన్నారని చర్యలకు వినతి

  • బౌన్సర్లను రంగంలోకి దించిన వైసీపీ అభ్యర్థి

  • 2 తుపాకులు స్వాధీనం

అమరావతి/అన్నమయ్య, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ బౌన్సర్ల నుంచి పోలీసులు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జిన్నా షరీఫ్‌కు బౌన్సర్లుగా ఉన్న నలుగురు సరైన పత్రాలు లేకుండా ఆయుధాలు కలిగి ఉండడంతో వారి వద్ద నుంచి రెండు తుపాకులు, లైవ్‌ తూటాలు స్వాధీనం చేసుకుని... వారితోపాటు జిన్నా షరీఫ్‌, ఆయన కొడుకు సహా మొత్తం 15 మందిపై రాయచోటి పోలీసులు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

బౌన్సర్లు నలుగురూ.. తాము మాజీ సైనిక ఉద్యోగులమని, ఆయుధాలకు జమ్మూకశ్మీర్‌కు చెందిన అనుమతి ఉందని పోలీసులకు చూపించారు. ఆయుధాలకు అనుమతులు ఉన్నప్పటికీ బహిరంగంగా ప్రదర్శించడం నేరం కావడంతో కేసు నమోదు చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. జిన్నా షరీఫ్‌ ఆదేశాల మేరకు అవసరమైతే వ్యక్తులపై కాల్పులు జరపడానికి ఈ ఆయుధాలు కలిగిన వ్యక్తులు సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి చెందిన మరో ఐదుగురిని కూడా చైర్మన్‌ అభ్యర్థి తనకు రక్షణగా రప్పించారని ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. బౌన్సర్లు పంజాబ్‌కు చెందినవారని టీడీపీ నేతలు చెబుతున్నారు.


రాయచోటి ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత, హింసను సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ కుట్ర పన్నారని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, పర్చూరి అశోక్‌బాబు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. జిన్నా షరీఫ్‌ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించడానికి, ఎన్నికల్లో హింసను ప్రేరేపించేందుకు పంజాబ్‌ నుంచి సంఘవిద్రోహ శక్తులను, అక్రమ ఆయుధాలను తీసుకొచ్చారని తెలిపారు. వారికి ఒక లాడ్జీలో ఆశ్రయం కల్పించారని, స్థానిక పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద నుంచి లైసెన్స్‌ లేని పిస్టల్స్‌, తూటాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. జిన్నా షరీఫ్‌పై తక్షణమే కఠిన చర్యలను తీసుకోవాలని, కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్‌ చేయాలని ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:16 AM