రాప్తాడు ఉన్మాదిపై పోలీసు కాల్పులు
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:42 AM
ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై పాశవిక దాడిచేసిన ఉన్మాదికి, 24 గంటల్లోపే పోలీసులు బేడీలు వేశారు.
రాప్తాడు ఉన్మాదిపై పోలీసు కాల్పులు
విద్యార్థినిని రంపంతో కోసిన నిందితుడు ఆస్పత్రిపాలు
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నక్కిన వైనం.. పట్టుకోడానికి
వెళ్లిన పోలీసులపై దాడి.. సీఐని కత్తితో పొడిచి పారిపోయే యత్నం
6 రౌండ్లు కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
కాళ్లలోకి దూసుకెళ్లిన తూటాలు.. బాణసంచా కాల్చి ప్రజల సంబరాలు
అనంతపురం క్రైం, వైద్యం, రాప్తాడు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై పాశవిక దాడిచేసిన ఉన్మాదికి, 24 గంటల్లోపే పోలీసులు బేడీలు వేశారు. తరగతి గదిలోకి వెళ్లి, అందరి ముందే దారుణానికి పాల్పడ్డ అతడు, తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపైనా దాడికి ప్రయత్నించాడు. దీంతో.. కాళ్లపై కాల్చి ఆ ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘అమ్మాయిలపై చెయ్యి పడితే ఖబడ్దార్’ అనే రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికను ఆచరణలో అమలుచేసి చూపారు. విషయం తెలియగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై విచక్షణారహితంగా హేమంత్ దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. అతడు ఆత్మకూరు అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం మధ్యాహ్నం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీన్ని పసిగట్టిన హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. అనంతరం పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలు తగిలి కుప్పకూలిన హేమంత్‌ను సంఘటనా స్థలం నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో..
శనివారం రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలోకి ఎలక్ట్రిక్ రంపం తీసుకుని వెళ్లిన హేమంత్ పదో తరగతి విద్యార్థినిపై భయానకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాలిక ముఖం, తల, వీపు భాగాలపై రంపంతో కోసి గాయపరిచాడు. అడ్డుకోబోయిన మరో విద్యార్థినిని కూడా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. బైక్‌పై పారిపోయిన హేమంత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. శనివారం రాత్రి తాడిపత్రి, పుట్లూరు మండలాల్లో గాలించారు. పుట్లూరు మండలంలో సంచరిస్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆ తరువాత ఆదివారం మధ్యాహ్నం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు సాయంత్రం కనిపించగా పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిందితుడు రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోవాలని చూశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాళ్లకు బుల్లెట్లు తగలడంతో కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడి నుంచి అనంతపురం సర్వజన వైద్యశాలకు వాహనంలో తీసుకువచ్చారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద వాహనం నుంచి కిందకు దించి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారన్న వార్త తెలియడంతో ఆసుపత్రి వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హేమంత్‌ను ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదని, ఇలాంటి వాడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతను పెంచి ప్రజలను కట్టడి చేశారు.
24 గంటలు.. 15 బృందాల గాలింపు
రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. దాడికి పాల్పడ్డ దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోం మంత్రి అనిత జిల్లా ఎస్పీ జగదీశ్‌తో మాట్లాడారు. హేమంత్‌ను పట్టుకునేందుకు ఏకంగా 15 పోలీసు బృందాలు రంగంలోకి దిగారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా పోలీసులు 24 గంటలకు పైగా శ్రమించి అటవీ ప్రాంతంలో ఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు. హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలియగానే రాప్తాడు ప్రజలు ఆదివారం రాత్రి సంబరాలు జరుపుకొన్నారు. బస్టాండు సమీపంలో టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన పోలీసులను అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం