పులివెందులలో వైసీపీ అరాచకాలు.. వైసీపీపై టీడీపీ నేతల ఆగ్రహం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:16 PM
పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు అల్లర్లు, ఘర్షణలకు పాల్పడుతూ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే రౌడీ మూకలను రంగంలోకి దించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
కడప, నవంబంర్ 1: జిల్లాలో పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఓడిపోతామనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి అల్లర్లకు తెరలేపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రౌడీ మూకలను పులివెందులకు తీసుకొచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను సైతం లెక్కచేయకుండా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయని అన్నారు. వైసీపీ నాయకులు తమ వాహనాలను తామే తగలబెట్టుకుని ఆ నెపాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వందలాది మందిని పులివెందులకు ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వాహనాలను ఎందుకు నిలిపారు? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక రాజకీయాలను ప్రజలు గమనించాలని, ఎలాంటి భయాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఓటమి భయంతోనే పులివెందుల్లో వైసీపీ అల్లర్లు: టీడీపీ నేత భూపేశ్ రెడ్డి
పులివెందుల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత భూపేశ్ రెడ్డి ఆరోపించారు. రౌడీ మూకలను పులివెందులకు తీసుకొచ్చి కావాలనే ఘర్షణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో బాబాయ్ హత్యను టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసినట్లుగానే, ప్రస్తుతం కార్లకు నిప్పుపెట్టి ఆ నెపాన్ని కూడా టీడీపీపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చొక్కా మడతపెడతానంటూ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే పులివెందుల్లో ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. జమ్మలమడుగులో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం కూడా జగన్కు ఇష్టం లేదని విమర్శించారు.
పులివెందులలో ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతున్నాయి: ఎమ్మెల్సీ వర్ల రామయ్య
దశాబ్దాలుగా పులివెందుల వైఎస్ కుటుంబం గుప్పిట్లో ఉండేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేర్కొన్నారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఏదో ఒకదాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించినట్లుగా జగన్ రెడ్డి పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పులివెందుల్లో వైఎస్ కుటుంబం పాలనలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలు ఇక భరించే పరిస్థితి లేదన్నారు. రౌడీలు, అసాంఘిక శక్తులకు ధైర్యం కల్పించేలా జగన్ రెడ్డి చొక్కా మడతపెడతానంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పిన్ని ప్రమిళ గెలుపు కోసమే కార్లు తగలబెట్టే కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగితే జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.