షాక్ అవ్వాల్సిందే!
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:23 AM
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, ఆత్మకూరులోని 220కేవీ సబ్‌స్టేషన్ నుంచి అనంతసాగరం 132 కేవీ సబ్‌స్టేషన్ వరకు 132 కేవీ లైన్ నిర్మాణం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆయా పనుల్లో ప్రజల సొమ్మును దోచుకునేందుకు క్షేత్రస్థాయిలో కొందరు విద్యుత్తు శాఖ అధికారులు అడ్డదారులు తొక్కారు.
విద్యుత్ శాఖలో ఇదోరకం అవినీతి
రూ.34 కోట్ల పనిలోనే 10 కోట్ల అక్రమం
టెండరు ఖరారయ్యాక రూ.8 కోట్లు అదనం
ఇన్సెంటివ్ కోసం ఏకంగా తేదీలు తారుమారు
కాంట్రాక్టరుకు రూ.85 లక్షలు ‘ప్రోత్సాహకం’
కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయిన అధికారులు
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో లీలలు
విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు.. ప్రజలపై చార్జీల భారం మోపకుండా ఉండేందుకు ఓవైపు విద్యుత్తు శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం సరికొత్త మార్గాల్లో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి.. వారికి అడ్డగోలు లబ్ధి చేకూర్చేందుకు.. అటు నుంచి కమీషన్ల రూపంలో దండుకునేందుకు రికార్డులనే ట్యాంపర్ చేసిన ఉదంతం నెల్లూరు జిల్లాలో బయటపడింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా అనంతసాగరంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, ఆత్మకూరులోని 220కేవీ సబ్‌స్టేషన్ నుంచి అనంతసాగరం 132 కేవీ సబ్‌స్టేషన్ వరకు 132 కేవీ లైన్ నిర్మాణం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆయా పనుల్లో ప్రజల సొమ్మును దోచుకునేందుకు క్షేత్రస్థాయిలో కొందరు విద్యుత్తు శాఖ అధికారులు అడ్డదారులు తొక్కారు. రూ.34.24 కోట్ల విలువైన ఈ పనుల్లో సుమారు రూ.10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల నిర్మాణంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందోనన్న చర్చ సాగుతోంది.. కాంట్రాక్టర్ కోసం రేటు పెంచేసి.. అనంతసాగరం సబ్‌స్టేషన్ నిర్మాణం, కొత్త లైను ఏర్పాటు పనులకు 2019లో రూ.34.24 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులను ఓ కాంట్రాక్టర్ 9.18శాతం తక్కువకు దక్కించుకున్నారు. అంటే టెండరు విలువ సుమారు రూ.30 కోట్లుగా ఉండాలి. కానీ, పనులు ముగిసే సమయానికి కాంట్రాక్టర్‌కు చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.38.64 కోట్లు. స్టీల్ ధరలు పెరిగాయన్న సాకుతో అడ్డగోలుగా టెండరు మొత్తాన్ని పెంచి అదనంగా రూ.8 కోట్ల పైచిలుకు మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ఒకసారి టెండరు ప్రక్రియ పూర్తయిన తర్వాత ధరలను పెంచడం నిబంధనలకు విరుద్ధం.
తేదీ మార్చేసి..
ఈ అవినీతి వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు.. కాంట్రాక్టు గడువు 12 నెలలుగా టెండరులో పేర్కొన్నారు. కాంట్రాక్టు గడువుని కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు నిబంధనల ప్రకారం పనిని ప్రారంభించిన తేదీ చాలా ముఖ్యం. సకాలంలో పనులు పూర్తి చేయడానికి, పనులు ఆలస్యంగా జరిగాయని గుర్తించడానికి ఈ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. అనంతసాగరం సబ్‌స్టేషన్‌కు ఆత్మకూరు సబ్‌స్టేషన్ నుంచి 132 కేవీ విద్యుత్తు లైను పనులకు సంబంధించి అధికారులు రూపొందించిన ఎంబుక్ రికార్డుల్లో డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్(పని ప్రారంభమైన తేదీ)ని కాంట్రాక్టరుకు చెల్లించిన 7వ బిల్లు వరకు 30-4-2020గా పేర్కొన్నారు.
అయితే అకస్మాత్తుగా 8వ బిల్లును ఎంబుక్ చేసే సమయంలో ఆ తేదీ మారిపోయింది. పనులు 20-07-2020న ప్రారంభమైనట్లుగా చూపారు. అప్పటికే పనులు ప్రారంభమై సుమారు 3 నెలలు కావడంతోపాటు కాంట్రాక్టరుకు సమారు రూ.2 కోట్ల మేరకు చెల్లింపులు కూడా చేశారు. ఇంత జరిగిన తర్వాత రికార్డులను టాంపర్ చేసి పనుల ప్రారంభ తేదీని ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. నిర్దేశిత సమయానికన్నా ముందే పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు ఇన్సెంటివ్‌లు చెల్లిస్తారు. పనుల ప్రారంభతేదీని మార్చడానికి ఈ ఇన్సెంటివ్(ప్రోత్సాహకం)లే కారణమని తెలుస్తోంది. వాస్తవంగా ప్రారంభించిన తేదీతో అయితే కాంట్రాక్టర్ ఇన్సెంటివ్‌లకు అనర్హుడవుతాడు. అందుకనే పనులు సుమారు 81 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మార్చేసి.. పనులు త్వరగా చేసేశారని పేర్కొంటూ.. రూ.85 లక్షల మేరకు ఇన్సెంటివ్ చెల్లించాల్సిందిగా అధికారులు సిఫారసు చేశారు.
కారులోనూ కక్కుర్తే..!
ఇదే పనికి సంబంధించి కారు అలవెన్స్ విషయంలోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. టూర్ డైరీలో 35 వేల కిలోమీటర్లు తిరిగినట్లు చూపిన అధికారులు ఎంబుక్‌లో మాత్రం 95 వేలు కిలోమీటర్లు తిరిగినట్లు చూపారు. తద్వారా 60 వేల కిలోమీటర్లకు అదనంగా అలవెన్స్ క్లెయిమ్ చేసుకుని, సుమారు రూ.10 లక్షలు అదనంగా సొమ్ము చేసుకున్నారు.
అవసరం 600.. తెప్పించింది 3 వేల మీటర్లు
సబ్‌స్టేషన్ నిర్మాణ సమయంలో చేపట్టే ఎర్తింగ్ ఫ్లాట్ విషయంలోనూ అధికారులు కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సాధారణంగా 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 600 మీటర్ల ఎర్తింగ్ ఫ్లాట్ మెటీరియల్ సరిపోతుంది. కానీ, 3 వేల మీటర్ల మెటీరియల్‌ను తెప్పించారు. వాస్తవంగా వాడింది 600 మీటర్లు మాత్రమే. మిగిలిన 2,400 మీటర్ల మెటీరియల్(25 టన్నులు) వృథాగా పడేశారు. దీని విలువ సుమారు రూ.25 లక్షలుపై చిలుకేనని తెలిసింది. మొత్తంగా అనంతసాగరం సబ్‌స్టేషన్, లైను నిర్మాణంలోనే సుమారు రూ.10 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తాజాగా ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య