Share News

రేణిగుంట సబ్‌డివిజన్‌లోకి రైల్వే కోడూరు సర్కిల్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:14 PM

రేణిగుంట సబ్‌డివిజన్‌ పరిధిలోకి రైల్వేకోడూరు సర్కిల్‌ను కలుపుతూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మాక్పులు, చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రేణిగుంట సబ్‌డివిజన్‌లోకి రైల్వే కోడూరు సర్కిల్‌

  • పాకాల సర్కిల్‌ కనుమరుగు

  • నాయుడుపేట సబ్‌ డివిజన్‌లోకి

  • వాకాడు, వెంకటగిరి సర్కిళ్ళు

  • పోలీసు సబ్‌ డివిజన్‌, సర్కిళ్ళ పునర్వ్యవస్థీకరణ ఫలితం

తిరుపతి: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా తిరుపతి జిల్లాలో పోలీసు సబ్‌ డివిజన్లు, సర్కిళ్ళు కూడా మార్పుచేర్పులకు గురయ్యాయి. నెల్లూరు జిల్లాలో గూడూరు సబ్‌ డివిజన్‌ను కలపడంతో జిల్లాలో పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్య తొమ్మిది నుంచీ ఎనిమిదికి తగ్గింది. గూడూరు రూరల్‌ సర్కిల్‌ నెల్లూరు జిల్లాలో కలవడం, పాకాల సర్కిల్‌ రద్దు కావడం వంటి నిర్ణయాలతో సర్కిళ్ళ సంఖ్య 12నుంచి 10కి తగ్గింది. అదే సమయంలో రైల్వే కోడూరు సర్కిల్‌ చేరడంతో జిల్లాలో సర్కిళ్ళ సంఖ్య 11కు చేరింది. ఇప్పటి వరకూ జిల్లాలో కొనసాగిన గూడూరు సబ్‌ డివిజన్‌ నెల్లూరు జిల్లాలో విలీనమైంది.


దాని పరిధిలోని గూడూరు సర్కిల్‌, గూడూరు, కోట, చిల్లకూరు పోలీసు స్టేషన్లు కూడా ఆ జిల్లాలో విలీనమయ్యాయి. కొత్తగా అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నుంచీ రైల్వే కోడూరు సర్కిల్‌, దాని పరిధిలోని ఐదు పోలీసు స్టేషన్లు తిరుపతి జిల్లాలోకి వచ్చాయి.పాకాల పోలీస్‌ సర్కిల్‌ను తొలగించి అక్కడి స్టేషన్‌ను అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌గా మార్చారు. నాయుడుపేట పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధి అమాంతం పెరిగింది. ఇప్పటి దాకా గూడూరు సబ్‌ డివిజన్‌లో వున్న వాకాడు సర్కిల్‌, వాకాడు, చిట్టమూరు పోలీసు స్టేషన్లు నాయుడుపేట సబ్‌ డివిజన్‌లోకి కలిశాయి. అలాగే గూడూరు సబ్‌ డివిజన్‌లో వున్న వెంకటగిరి సర్కిల్‌, వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి పోలీసు స్టేషన్లు సైతం నాయుడుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చాయి.


ZZZZZ.jpg

రాజంపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో కొనసాగిన రైల్వే కోడూరు పోలీస్‌ సర్కిల్‌ తాజా మార్పులతో రేణిగుంట సబ్‌ డివిజన్‌లో కలిసింది. రైల్వే కోడూరు సర్కిల్‌తో పాటు దాని పరిధిలోని రైల్వే కోడూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేలి పోలీసు స్టేషన్లు కూడా రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చాయి.ఇప్పటి వరకూ జిల్లాలో 53 స్టేషన్లు వుండేవి. గూడూరు వన్‌ టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌ స్టేషన్లు, కోట, చిల్లకూరు స్టేషన్లు నెల్లూరు జిల్లాలో కలిసిపోవడంతో స్టేషన్ల సంఖ్య 53 నుంచీ 48కి తగ్గింది. అయితే రాజంపేట సబ్‌ డివిజన్‌ పరిధి నుంచీ రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు స్టేషన్లు కొత్తగా జిల్లాలోకి రావడంతో జిల్లాలోని పోలీసు స్టేషన్ల సంఖ్య తిరిగి 53కు చేరుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2026 | 01:14 PM