జులాయి నుంచి ఉన్మాదిగా
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:10 AM
తల్లిదండ్రులు మరణించిన తర్వాత జులాయిగా మారాడు. రక్తం పంచుకున్నవాళ్లు కూడా దూరం పెట్టారు. చదువు పెద్దగా అబ్బలేదు. ఇష్టానుసారం తిరుగుతూ పెరిగాడు. ఆర్నెల్ల క్రితం భూమి అమ్మగా కొంత సొమ్ము రావడంతో జల్సాలు మరింత పెరిగాయి.
హేమంత్ ఎలక్ట్రిక్ రంపం కొన్నది దాడి కోసమే
అనంతపురంలో రూ.6500 వెచ్చించి కొనుగోలు
పదో తరగతిలో చదువు మానేసి.. గాలి తిరుగుళ్లు
ఆర్నెల్ల క్రితం 5 లక్షలు చేతికి రావడంతో అల్లరిచిల్లర
ప్రేమ పేరిట సోదరి వరసయ్యే బాలికకు వేధింపులు
వ్యతిరేకించడంతో కక్ష.. రెక్కీ నిర్వహించి మరీ దాడి
(అనంతపురం క్రైం-ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు మరణించిన తర్వాత జులాయిగా మారాడు. రక్తం పంచుకున్నవాళ్లు కూడా దూరం పెట్టారు. చదువు పెద్దగా అబ్బలేదు. ఇష్టానుసారం తిరుగుతూ పెరిగాడు. ఆర్నెల్ల క్రితం భూమి అమ్మగా కొంత సొమ్ము రావడంతో జల్సాలు మరింత పెరిగాయి. విచక్షణ మరచి సోదరి వరసయ్యే బాలిక వెంటపడ్డాడు. ఆమె వ్యతిరేకించడంతో కక్ష పెంచుకున్నాడు. దాడి చేయాలనే ప్రణాళికతో రంపం కొన్నాడు. తరగతి గదిలోకి వెళ్లి ఉన్మాదిలాగా దాడి చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాల ఘటనలో బాలికపై దాడి చేసిన రాక్షసుడు హేమంత్ పెరిగిన తీరిది. బాలికపై దాడికి వినియోగించిన ఎలక్ట్రిక్ రంపాన్ని అనంతపురం నగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
తన ప్రేమను ఒప్పుకోనందుకు బాలికపై దాడిచేసేందుకు పక్కా ప్రణాళికతో రూ.6500 వెచ్చించి ఈ పవర్ కట్టర్‌ను కొన్నట్లు గుర్తించారు. దాడికి కొన్నిరోజుల ముందు కొనుగోలు చేశాడని, నాలుగైదు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడని తేల్చారు. గత నెల 31వ తేదీ పదో తరగతి గదిలోకి ప్రవేశించి బాలికపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఇంత దారుణానికి పాల్పడటం వెనుక నిందితుడు పెరిగిన తీరు, కుటుంబ జీవనం లేకపోవడం, జల్సాలకు అలవాటుపడటం కారణమని స్పష్టమౌతోంది. పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
డ్రాప్ అవుట్ నుంచి...
హేమంత్ పదో తరగతి నుంచి డ్రాప్ అవుట్ విద్యార్థి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన ఇతని తల్లి నాగమణి కొవిడ్ సమయంలో మరణించింది. ఆ తరువాత తండ్రి నాగరాజు మరో జబ్బుతో చనిపోయాడు. ఈ క్రమంలో కుటుంబ జీవితానికి దూరమైన హేమంత్ జులాయిగా మారిపోయాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. చదువు పెద్దగా అబ్బలేదు. ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న మోడల్ స్కూల్‌లో 10వ తరగతి వరకూ చదివాడు. పరీక్షలకు ముందు డ్రాప్ అవుట్‌గా మారాడు. అదిమొదలు ఇష్టానుసారం తిరుగుతూ పెరిగాడు. కొంతకాలం బెంగళూరులో పనికి వెళ్లాడు. మళ్లీ అనంతపురం వచ్చాడు. అప్పుడప్పుడు అయ్యవారిపల్లిలో ఉంటున్న తనసోదరి ఇంటికివెళ్లేవాడు. ఈ క్రమంలో వారి బంధువు అయిన బాలికపై కన్నేశాడు. సుమారు రెండేళ్ల నుంచి బాలిక కదలికలను గమనించేవాడు.
ఆరు మాసాల కిందట చేతికి 5 లక్షలు
హేమంత్‌కు ఆరు మాసాల కిందట రూ.5 లక్షలు చేతికి వచ్చిందని సమాచారం. వారి భూమిని అమ్మగా సుమారు రూ.25 లక్షల వరకూ వచ్చిందని, అందులో ఆడబిడ్డలు తీసుకోగా మిగిలిన రూ.5 లక్షలను హేమంత్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆ సొమ్ము చేతికి వచ్చాక జల్సాలు మరింత పెరిగాయని, అల్లరచిల్లరగా తిరిగాడని పోలీసులు అంటున్నారు. ఇదే సమయంలో బాలిక వెంటపడ్డాడు. ఆమె వ్యతిరేకించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆమెపై దాడి చేయాలని అనంతపురంలో రంపం కొన్నాడు. గత నెల 31న తరగతి గదిలోకి వెళ్లి ఉన్మాదిలాగా దాడి చేశాడు. అనంతరం రంపాన్ని అక్కడే పడేసి పారిపోయాడు. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
పెరిగిన తీరే పతనానికి కారణం...
హేమంత్ పెరిగిన తీరే అతని పతనానికి కారణమని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత జులాయిగా మారడంతో రక్తం పంచుకున్నవాళ్లు కూడా అతడ్ని దూరం పెట్టారు. దీంతో అనంతపురం నగర శివారులోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని గడిపేవాడు. టమోటా మండీలో కూలి పనులు చేసేవాడు. అలా వచ్చిన డబ్బుతోనూ జల్సాలు చేశాడు. క్రమశిక్షణ లేని నడవడికతో ఉన్మాదిగా మారాడు. సోదరి వరుసయ్యే బాలికను ప్రేమ పేరిట వేధించాడు. అత్యంత పాశవికంగా ఇద్దరు విద్యార్థినులపై దాడి చేశాడు. ఓ మృగంలా చెడ్డపేరు తెచ్చుకున్నాడు.
ఆస్పత్రి గడపతొక్కని అయినవారు
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను మాట్లాడించేందుకు కూడా అనంతపురం సర్వజన వైద్యశాలకు ఎవరూ రాలేదు. ‘ఛీ.. వాడిని మాట్లాడించడం ఏమిటి..?’ అన్నట్లు బంధువులు దూరంగా ఉన్నారు. అతని పేరు ఉచ్ఛరించేందుకూ ఇష్టపడటంలేదు. నిందితుడికి ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నా, వారుసైతం పలుకరించేందుకు రావడంలేదు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి