Share News

సాదిక్‌కు ‘సైనైడ్‌’ ఇచ్చాం!

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:57 AM

‘అవును! సాదిక్‌ ఖాన్‌ మా దగ్గరకొచ్చాడు. విషపూరితమైన లిక్విడ్‌ కావాలని అడిగాడు. మేము మొదట అతడికి థాయ్‌ పొటాషియం ఇచ్చాం.. ఆ సమయంలో ఇది ఎందుకు? అని కూడా అడిగాం. అతడు.. నేను రైఫిల్‌ షూటర్‌ని, నాకు కాస్త పని ఉందని చెప్పాడు. థాయ్‌ పొటాషియం ఆహార రూపంలో ఎవరికైనా ఇస్తే..

సాదిక్‌కు ‘సైనైడ్‌’ ఇచ్చాం!

  • తొలుత థాయి పొటాషియం విక్రయించాం

  • పోలీసులకు మరోసారి అత్తరు వ్యాపారుల వాంగ్మూలం

కాకినాడ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘అవును! సాదిక్‌ ఖాన్‌ మా దగ్గరకొచ్చాడు. విషపూరితమైన లిక్విడ్‌ కావాలని అడిగాడు. మేము మొదట అతడికి థాయ్‌ పొటాషియం ఇచ్చాం.. ఆ సమయంలో ఇది ఎందుకు? అని కూడా అడిగాం. అతడు.. నేను రైఫిల్‌ షూటర్‌ని, నాకు కాస్త పని ఉందని చెప్పాడు. థాయ్‌ పొటాషియం ఆహార రూపంలో ఎవరికైనా ఇస్తే.. అది ఆ మనిషి శరీర అవయవాల్లోకి నెమ్మదిగా చేరి.. వారి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది. ఇక పొటాషియం సైనైడ్‌ మిక్సింగ్‌ లిక్విడ్‌ కూడా ప్రమాదకరమే. ఇది మనిషి ప్రాణాలను వెంటనే హరిస్తుంది’ అని సాదిక్‌కు విషపూరితమైన లిక్విడ్‌ను విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహ్మన్‌, అబ్దుల్‌ ఖాదీర్‌ పోలీసులకు వివరించారు. రెండో రోజు బుధవారం కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు సాదిక్‌తో పాటు వీరిని కూడా విచారించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అలాగే నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి మృతి కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు.. అతడి నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తొలిరోజు మంగళవారం సర్పవరం స్టేషన్‌లో ఉంచి విచారించిన పోలీసులకు సాదిక్‌ ఖాన్‌ సహకరించలేదు. నేరాన్ని పూర్తిగా నూకరాజు కుమార్తె సౌజన్యపైకి నెట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇక రెండోరోజు బుధవారం అడిషనల్‌ ఎస్పీ మహంతి కిశోర్‌, సీఐ ప్రకాశ్‌ మరో ఇద్దరు ఎస్‌ఐలు సాదిక్‌ను ప్రశ్నించారు.


ఈ సమయంలో కూడా సాదిక్‌ ఎక్కడా భయం, బెరుకూ లేకుండా, ఏ ప్రశ్నకూ నోరు విప్పలేదని సమాచారం. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న జగదీశ్వరరెడ్డికి.. నీకు మధ్య గొడవ ఎందుకు జరిగింది? అతడిని చాకుతో ఎందుకు పొడిచి పారిపోయావ్‌?, నూకరాజు కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?, నీ వల్లే చనిపోతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య ఎందుకు రాశారు?, జగదీశ్వరరెడ్డి మరణం వెనుక నీ హస్తం ఉందని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు? అతడికి సైనైడ్‌ వంటి విషపూరితమైన లిక్విడ్‌ కలిపిన ప్రొటీన్‌ డ్రింక్‌ ఇచ్చి చంపినట్టుగా ఫిర్యాదు చేశారు. దీనిపై నీ సమాధానం ఏంటి?, నువ్వు ఏం చదివావు? ఎక్కడ చదివావు?’ ఇలా సుమారు 70కిపైగా ప్రశ్నలను పోలీసులు సంధించారు. ‘జగదీశ్వరరెడ్డి బ్యాంకు ఖాతాల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు నీవు వాడుకుంటున్నట్టుగా తెలిసింది. అతడి ఏటీఎం, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు కూడా నీ దగ్గరే ఉంచుకున్నావని అంటున్నారు? అందులో వాస్తవం ఎంత? వారి పలు ఆస్తిపత్రాల సైతం నీ దగ్గరే ఉంచుకున్నావని తెలిసింది? అవి ఎక్కడున్నాయి?’ అని గట్టిగా ప్రశ్నించినా పోలీసులకు సాదిక్‌ ఒక్కమాట కూడా చెప్పకుండా మౌనమే సమాధానంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే పోలీసులు తాము ఇప్పటికే సేకరించిన ఆధారాలను, ఫోన్‌ కాల్‌ రికార్డులు, వాట్సాప్‌ చాట్‌లను చూపి గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో సాదిక్‌ బిత్తర చూపులు చూశాడని తెలిసింది. కాగా, సాదిక్‌ ఖాన్‌ విద్యార్హత, అలాగే రైఫిల్‌ షూటింగ్‌లో అతడు సాధించిన సర్టిఫికెట్లు అంతా ఫేక్‌ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడి విద్యాభ్యాసమే సరిగా సాగలేదని, రైఫిల్‌ షూటింగ్‌కు సరైన ధ్రువీకరణ కూడా లేదని తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి..

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

Updated Date - Sep 10 , 2026 | 05:57 AM