Share News

ఆ హామీ ఏమైంది?

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:29 PM

నెల రోజుల కిందట ఖండ్యాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహనరావు పర్యటించారు.

ఆ హామీ ఏమైంది?
చెలిగానవలస వద్ద సాయన్న చానల్‌లో స్వచ్ఛందంగా పిట్టతామర తొలగిస్తున్న రైతులు(ఫైల్‌)

- సాయన్న చానల్‌ హెడ్‌ మరమ్మతులు ఒట్టిదేనా?

- పనులు చేపట్టకపోవడంపై రైతుల అసంతృప్తి

- సాగునీటి కోసం తప్పని ఇబ్బందులు

నెల రోజుల కిందట ఖండ్యాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహనరావు పర్యటించారు. ఖండ్యాం నీటి సం ఘం ప్రతినిధులు పి.వెంకటప్పలనాయుడు, గొలివి జగ్గు నాయుడు తదితరులు సాయన్న చానల్‌ హెడ్‌ సమస్య ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. దీంతో ఎమ్మెల్యే.. ఇరిగేషన్‌ మం త్రితో మాట్లాడారని, త్వరలో పనులు ప్రారంభమవుతా యని ఆయన హామీ ఇచ్చారని నీటిసంఘం ప్రతినిధులు రైతులకు చెప్పారు. కానీ, ఇంత వరకూ పనుల ఊసెత్త డం లేదు. దీంతో ఎమ్మెల్యే మాటలు ఒట్టి మాటలేనా? అన్న అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రేగిడి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సాయన్న చానల్‌ రెండు మండలాల సాగునీటి వనరు. దాదాపు 12వేల ఎకరాల ఆయకట్టు. రెండు మండలాల్లో దాదాపు 13 గ్రామాలకు ఇదే సాగునీటి ఆధారం. వైసీపీ హయాంలో ఈ చానల్‌ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభు త్వం వచ్చిన తరువాత కాలువకు మహర్దశ పడుతుం దని రైతులు ఆశపడ్డారు. కానీ, రెండున్నరేళ్లవుతున్నా పనుల ఊసెత్తకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. సాయన్న చానల్‌కు ఇటీవల అరకొర నిధులు మంజూర య్యాయి. అవి ఏ మూలకూ సరిపోలేదు. దిగువన ఉన్న పిల్ల కాలువల మరమ్మతులతో ఆగిపోయాయి. దీని హెడ్‌ నాగావళి తీరం పాతచెలిగానవలస వద్ద ఉంది. ఇక్కడ నదికి అడ్డంగా కొరంబో (అడ్డకట్టు) పని చేస్తేనే సాగు నీరు అందుతుంది. ఇటీవల దేవుదళ, పుర్లికు చెందిన ముగ్గురు రైతులు పాలవలస రమణమూర్తి, పాలవలస సూర్యారావు, కురిటి రామకోటి స్వచ్ఛందంగా రూ.4లక్షల వరకు వెచ్చించి 3 కిలోమీటర్ల మేర పూడికలు, నదికి అడ్డంగా కొరంబో పనులు చేయించారు. అయితే, నిధులు చాలకపోవడం, హెడ్‌ నుంచి మరో 4 కిలోమీటర్లు మేర కాలువల్లో పిట్టతామర పేరుకుపోవడంతో ఈఏడాది సాగునీరు గగనమైంది. దీంతో రైతులు శ్రమదానం చేసి పిట్ట తామరను తొలగించారు. ఈక్రమంలో నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం, చానల్‌ హెడ్‌ కంటే నది మట్టం కిందకు ఉండడం, కొరంబో పని సరిగా లేకపోవడం వంటి కారణాలతో సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పూర్తిస్థాయి దృష్టిసారించాలని కోరుతున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:29 PM