ముంపు గ్రామాల్లో ఎన్నికలు వద్దు
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:49 AM
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల పరిధులపై ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏలూరు జిల్లా పోలవరం మండలం ముంపు గ్రామాల ప్రజలు, ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు డిమాండ్ చేశారు.
గ్రామాల పరిధిపై ప్రత్యేక గెజిట్ ఇవ్వండి
ఆ తర్వాతే ఎన్నికలు జరపండి
ముంపు గ్రామాలు, ఎల్‌ఎన్‌డీ పేట ప్రజల డిమాండ్
పోలవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల పరిధులపై ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఏలూరు జిల్లా పోలవరం మండలం ముంపు గ్రామాల ప్రజలు, ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిలిపివేయాలని కోరారు. ఈమేరకు బుధవారం పోలవరం ఆర్డీవో ఎంవీ రమణ, తహసీల్దారు బి.సాయిరాజుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు, ఎల్‌ఎన్‌డీ పేట గ్రామస్థులు మాట్లాడుతూ కోండ్రుకోట, తూటిగుంట, కొరుటూరు, పైడిపాక, దేవరగొంది గ్రామ పంచాయతీలను ఎల్‌ఎన్‌డీ పేట, రెడ్డి గణపవరం పి.అంకంపాలెం, ఇటుకలకోట, పోలవరం పంచాయతీల్లో విలీనం చేయడం వల్ల, గ్రామాలన్నీ వివిధ పంచాయతీల్లోకి విడిపోయాయని చెప్పారు.
దీనివల్ల ఆయా గ్రామాల ప్రజలకు స్థానిక ప్రాతినిధ్యం, గ్రామసభల నిర్వహణ, గిరిజన హక్కులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తమ గ్రామాల పరిధిపై ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. మాజీ సర్పంచులు పైదా నాగరాజు, కొవ్వాసి శ్రీనివాసరావు, గోపాల్, టీడీపీ గుబ్బా రాంబాబు, ఇల్లా సత్యనారాయణ, కొల్లేపర వేణుగోపాల్, చిక్కాల రాంబాబు, బీజేపీ నాయకులు మోతు అయ్యప్ప, వైసీపీ నాయకులు ఇల్లా కళ్యాణ్, బాపిరాజు, పీసీ కమిటీ సభ్యులు మొడియం సింహాచలం, మూలెం శ్రీనివాసరావు, తామా రాజు, మూలుం గంగరాజు, వెట్టి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి..