Share News

పోలవరం సివిల్‌ వర్క్స్‌ 90 శాతం పూర్తి

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:32 AM

పోలవరం ప్రాజెక్టు సివిల్‌ వర్క్స్‌ 90 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ సీఎం చంద్రబాబుకు నివేదించింది. భూసేకరణ పనులు 97 శాతం, సహాయ పునరావాస కార్యక్రమాలు 52 శాతం జరిగాయని తెలిపింది.

పోలవరం సివిల్‌ వర్క్స్‌ 90 శాతం పూర్తి

  • తొలి దశ నిర్వాసితులకు డిసెంబరుకి పునరావాసం

  • జనవరికల్లా అప్రోచ్‌ చానల్‌లో మిగిలిన పనులు

  • సీఎంకు జలవనరుల శాఖ నివేదిక

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సివిల్‌ వర్క్స్‌ 90 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ సీఎం చంద్రబాబుకు నివేదించింది. భూసేకరణ పనులు 97 శాతం, సహాయ పునరావాస కార్యక్రమాలు 52 శాతం జరిగాయని తెలిపింది. ప్రాజెక్టు తొలిదశ పనులు 2027 జూన్‌నాటికి పూర్తవుతాయని పేర్కొంది. 2028 నాటికి 36 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసేందుకుగాను మరో రూ.37,102.26 కోట్లు అవసరమవుతాయని గురువారం సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ‘పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం వద్ద గ్యాప్‌-1 పనులు 51 శాతం, గ్యాప్‌-2 పనులు 47 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చినాటికి ప్రాజెక్టు కనెకివిటీ పనులు పూర్తవుతాయి.


అప్రోచ్‌ చానల్‌ బ్యాలెన్స్‌ పనులు వచ్చే జనవరికి అయిపోతాయి. ఈ ఏడాది డిసెంబరునాటికి తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేస్తాం. ఎడమ ప్రధాన కాలువ పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తాం. జాతీయ రహదారులను కలుపుతూ నిర్మించే కనెక్టివిటీ బ్రిడ్జి డిజైన్లు వచ్చే నెలలో ఆమోదం పొందుతాయి. 2028 మార్చినాటికి దీని నిర్మాణం పూర్తవుతుంది. ఈ నెల 14 నుంచి 18వ తేదీ దాకా విదేశీ నిపుణుల బృందం క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించింది.

ప్రధాన డ్యాం పనులు, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కొండ అంచులను తాకుతూ చేసిన జెట్‌ గ్రౌటింగ్‌ పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలను పాటించారని ప్రశంసించింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులకు సంబంధించి మట్టి, ఇసుక మిశ్రమాలు బాగున్నాయని తెలిపింది’ అని నివేదికలో వివరించింది.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:32 AM