నీటిని కలుషితం చేయొద్దు
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:21 AM
నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ పరిశ్రమల బాధ్యత
ఆక్వా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రమాణాలు పాటించాలి
సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యులతో డిప్యూటీ సీఎం
82 ఆక్వా యూనిట్లలో 49 నిబంధనలు పాటించడం లేదు
వాటివద్ద ప్రమాదకర స్థాయిలో బీఓడీ, టీఎస్ఎస్‌లు: పీసీబీ
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఏ పరిశ్రమయినా పర్యావరణానికి హాని కలిగించేలా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా- ఏపీ ప్రాంత ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పాటించాల్సిన పర్యావరణ నిబంధనలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 128 ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లలో 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించి తయారు చేసిన నివేదికను డిప్యూటీ సీఎంకు అందజేశారు. ‘49 యూనిట్లు ప్రమాణాలు పాటించడం లేదు. బీవోడీ స్థాయిలు లీటర్‌కు 30 మిల్లీగ్రాములునమోదయ్యాయి. 64 శాతం యూనిట్లలో 90 ఎంజీకి మించి బీవోడీ ఉంది. టీఎస్ఎస్ స్థాయిలు కూడా ప్రమాదకర రీతిలో ఉన్నాయి. లీటర్‌కు 365 ఎంజీ నమోదయింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం 50 ఎంజీకి మించకూడదు. ఈ ఉల్లంఘన జలవనరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని నివేదికలో పొందుపరిచారు.
దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ’ఇంత యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. ఆక్వా ప్రాసింగ్ కార్యకలాపాల నుంచి వచ్చే మురుగునీరు.. నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలు, భూగర్భ జలాలు, ఇతర నీటి వనరులను కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆక్వా యూనిట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించి, ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు. సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, కార్యదర్శి దిలీప్, ఉపాధ్యక్షుడు జోగివర్మ, జగదీశ్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు