Share News

‘పవన్‌ రాజీనామా’ అంటూ కలకలం!

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:24 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేస్తున్నారన్న వదంతి గురువారం కలకలం రేపింది. పైగా ఆయన సీఎం చంద్రబాబును కలవడానికి ఉండవల్లి నివాసానికి వెళ్లడంతో దీనికి బలం చేకూరింది.

‘పవన్‌ రాజీనామా’ అంటూ కలకలం!

  • ఓ వాట్సాప్‌ చానల్‌లో పోస్టుతో కలవరం

  • అదే సమయంలో సీఎంతో ఉపముఖ్యమంత్రి భేటీ

  • భద్రత, భారీ కాన్వాయ్‌ లేకుండా సాదాసీదాగా వెళ్లిన పవన్‌

  • రాజీనామా ఇవ్వడానికేనంటూ చెలరేగిన వైసీపీ సోషల్‌ మీడియా

  • ఇదంతా ఫేక్‌ అంటూ ఖండించిన డిప్యూటీ సీఎం కార్యాలయం

  • బాధ్యులపై కఠిన చర్యలకు హెచ్చరిక.. క్షమాపణ చెప్పిన చానల్‌ వ్యక్తి

  • మరొకరి నుంచి వచ్చిన సమాచారాన్నే పోస్టు చేశానని వెల్లడి

  • దీంతో రాజీనామా ప్రచారానికి తెర

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేస్తున్నారన్న వదంతి గురువారం కలకలం రేపింది. పైగా ఆయన సీఎం చంద్రబాబును కలవడానికి ఉండవల్లి నివాసానికి వెళ్లడంతో దీనికి బలం చేకూరింది. దీంతో కూటమి వర్గాల్లో కలకలం రేగింది. అయితే ఇదంతా ఫేక్‌ సమాచారమని డిప్యూటీ సీఎం కార్యాలయం తేల్చేయడంతో అంతా సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం ఓ ప్రైవేటు వ్యక్తి ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం’ పేరిట నిర్వహిస్తున్న వాట్సాప్‌ చానల్‌లో ‘డిప్యూటీ సీఎం రాజీనామా’ అని పోస్టు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.

ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి నేతల మధ్య అక్కడక్కడా సీట్లు సర్దుబాటులో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ సమయంలో డిప్యూటీ సీఎం రాజీనామా అని సోషల్‌ మీడియాలో హడావుడి జరగడంతో.. ఇది నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. ఈ ఫేక్‌ వార్త హల్‌చల్‌ చేస్తున్న సమయంలోనే పవన్‌ కల్యాణ్‌ ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రమ్మనడంతో ఆయన అక్కడకు వెళ్లారు. అయితే భద్రత, భారీ కాన్వాయ్‌ను పక్కనపెట్టి సాదాసీదాగా బయల్దేరారు. అంతే.. వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా హ్యాండ్లర్స్‌ పేట్రేగిపోయారు. రాజీనామా సమర్పించడానికే ఆయన భద్రతేమీ లేకుండా ఒకట్రెండు వాహనాలతోనే వెళ్లారని.. రాజీనామా సమర్పించి బయటకు రాబోతున్నారంటూ ఒకటే ఊదరగొట్టారు.


కీలకమైన స్థానిక ఎన్నికల వేళ ఇదేమిటంటూ జనసేన, కూటమి వర్గాల్లో కలవరం రేగడంతో.. డిప్యూటీ సీఎం కార్యాలయం తక్షణమే స్పందించింది. రాజీనామా వదంతులు ఫేక్‌ అంటూ తీవ్రంగా ఖండించింది. ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం’ పేరిట నిర్వహిస్తున్న వాట్సాప్‌ చానల్‌ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారిక చానల్‌ కాదని కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ అనధికారిక చానల్‌.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధంలేని ఇతర అంశాలను ప్రచారం చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు నకిలీ చానల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘డిప్యూటీ సీఎం పేరుతో అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

ఇటువంటి చర్యలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నకిలీ చానల్‌ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు చర్యలు చేపట్టాం. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. ఈ నకిలీ చానల్‌ను విశ్వసించవద్దని, అనుసరించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని ప్రజలకు సూచిస్తున్నాం’ అని తెలిపింది. ప్రామాణికమైన సమాచారం, అధికారిక తాజా వివరాల కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన.. అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్‌ మీడియా ఖాతాలను, ధ్రువీకరించిన వాట్సాప్‌ చానల్‌ను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది.


ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధ్యులైన వారిని చట్టం ఎదుట నిలబెట్టి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ చానల్లో పోస్టుచేసిన వ్యక్తి వెంటనే స్పందించి.. క్షమాపణ చెప్పారు. మరొకరి నుంచి వచ్చిన సమాచారాన్ని పోస్టు చేశానని.. మరోసారి తప్పులు జరగకుండా చూసుకుంటానని, ఒకటికి పదిసార్లు చెక్‌ చేసిన తర్వాత పోస్టులు పెడతానని తెలిపారు. దీంతో ఫేక్‌ ప్రచారానికి తెరపడింది.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 04:24 AM