చెరువుల సుందరీకరణే లక్ష్యం
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:07 AM
రాష్ట్రంలో చెరువుల సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. చెరువుల సుందరీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యం, ఆహ్లాదం అందించాలనేదే తమ ధ్యేయమన్నారు.
గ్రామీణులకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యం
పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి
6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ
జనసేనలో చేరిన వరుపుల సుబ్బారావు
కాకినాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చెరువుల సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు. చెరువుల సుందరీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యం, ఆహ్లాదం అందించాలనేదే తమ ధ్యేయమన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం విచ్చేశారు. మొత్తం రూ.1,500 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ పర్యటనలో చేయనున్నారు. తొలిరోజు నియోజకవర్గంలో రూ.6 కోట్లతో సుందరీకరించిన 11 చెరువులను ఆయన ప్రారంభించారు. పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో రూ.73 లక్షల వ్యయంతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువును, వాకింగ్‌ట్రాక్, ఓపెన్ ఎయిర్‌జిమ్, చిల్డ్రన్ పార్కులను ఆయన ప్రారంభించారు. పార్కులో ఆడుకుంటున్న చిన్నారులకు చాక్‌లెట్లు, తినుబండారాలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరుస్తాయని పవన్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 105 చెరువుల సుందరీకరణ పనులను రూ.50 కోట్లతో చేపట్టగా, ఇప్పటికే సగం పూర్తైనట్టు అధికారులు ఈ సందర్భంగా పవన్‌కు వివరించారు. నెలాఖరు నాటికి అన్ని చెరువుల పనులు పూర్తి చేస్తామన్నారు. చెరువు ప్రారంభోత్సవానికి ముందు గట్టుపై ఉన్న మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చెరువు మధ్యలో నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుడి విగ్రహాన్ని పరిశీలించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నగరవన్ యోజన ద్వారా రూ.1.83 కోట్లతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన పీఠికాపుర వనాన్ని(నగరవనం) ప్రారంభించారు. మొక్కలు నాటి నగరవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పనస, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప మొక్కలను వరుస క్రమంలో నాటగా వాటిని పవన్ ఆసక్తిగా తిలకించారు. శివస్వరూపమైన మారేడుతోపాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాలైన మొక్కలను శివపంచాయతన వనంగా ఏర్పాటుచేశారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు పెట్టారు. 70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనుని పవన్ పరిశీలించారు. కాగా, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సోమవారం పవన్‌కల్యాణ్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలో చేరారు. అలాగే పెద్దాపురం మున్సిపాల్టీకి చెందిన వైసీపీ మాజీ వైస్ చైర్మన్‌తోపాటు పలువురు మాజీ కౌన్సిలర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
నేడు పిఠాపురంలో పవన్ బహిరంగ సభ
పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మంగళవారం బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగించనున్నారు. స్థానిక ఎన్నికలపై జనసేన కీలక భేటీని కాకినాడ గోదావరి కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక