అడ్డగోలుగా పార్ట్‌టైమ్ జేఎల్స్ క్రమబద్ధీకరణ!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:20 AM
జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇంటర్ విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఓవైపు రెగ్యులరైజేషన్ కోసం వేల మంది జేఎల్స్ ఎదురుచూస్తుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులను కూడా క్రమబద్ధీకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వీసు లేకపోయినా రెగ్యులర్ చేసిన అధికారులు
న్యాయస్థానంలో కౌంటర్లు వేయకుండా తాత్సారం
ఓ సూపరింటెండెంట్ చక్రం తిప్పినట్లు ఆరోపణలు
కొందరు అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు?
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇంటర్ విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఓవైపు రెగ్యులరైజేషన్ కోసం వేల మంది జేఎల్స్ ఎదురుచూస్తుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులను కూడా క్రమబద్ధీకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 11 మంది పార్ట్‌టైమ్ జూనియర్ లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
వారిలో పలువురికి సర్వీసు బ్రేక్ ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా రెగ్యులరైజ్ చేయడంపై విమర్శలొస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ పార్ట్‌టైమ్ జేఎల్ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఇంటర్ విద్యాశాఖను ఆదేశించింది. అయినా స్పందన లేకపోవడంతో 2024లో పార్ట్‌టైమ్ జేఎల్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
పదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే మధ్యలో ఉద్యోగం మానేసి ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేసుకున్నవారిని కూడా ఇప్పుడు రెగ్యులర్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఓ పార్ట్‌టైమ్ జేఎల్ ఏకంగా 1,039 రోజులు సర్వీసులో లేరు. ఆ కాలంలో ఆయన స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసినట్లు చెబుతున్నారు. మరో జేఎల్ 485 రోజులు, ఇంకొకరు 14 నెలలు ఉద్యోగమే చేయలేదు. అయినప్పటికీ వారిని క్రమబద్ధీకరించారు.
బ్రేక్ తర్వాత నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తే వారికి కొత్త పెన్షన్ స్కీం వర్తిస్తుంది. అయితే వారికి ఓపీఎస్ అమలుచేయడమే లక్ష్యంగా సర్వీసులో చేరినప్పటి నుంచీ వరుసగా పదేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరించారు. సర్వీసులో బ్రేక్ ఉన్నవారు అనర్హులు అయినా వారిని అడ్డగోలుగా క్రమబద్ధీకరించి నిబంధనలను తుంగలో తొక్కారు.
కావాలనే కౌంటర్లు వేయలేదా?
తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్టు జేఎల్స్ చాలాకాలంగా కోరుతున్నా పార్ట్‌టైమ్ జేఎల్స్‌ను అడ్డగోలుగా క్రమబద్ధీకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ అధికారులు కావాలనే కౌంటర్లు దాఖలు చేయలేదనే వాదన వినిపిస్తోంది.
ఇందులో ఇంటర్మీడియట్ కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్ చక్రం తిప్పారని అంటున్నారు. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికోసం కొందరు అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు అందినట్లు ఇంటర్ విద్య వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు