Share News

పల్నాడులో భారీ వర్షం.. పిడుగుపాటుకు నలుగురి మృతి

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:17 PM

పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు గ్రామాల్లో పిడుగుపాటుకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పల్నాడులో భారీ వర్షం.. పిడుగుపాటుకు నలుగురి మృతి
Palnadu Lightning Strikes

పల్నాడు, సెప్టెంబర్ 13: జిల్లాలోని నరసరావుపేట ప్రాంతంలో వేకువజామున ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. పిడుగుపాటు కారణంగా వేర్వేరు గ్రామాల్లో ఒకే రోజు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెట్లూరివారి పాలెంలో తల్లపునేని నాగమ్మ (63) ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా.. ఆ శబ్దానికి ఆమె గుండె ఆగి మృతి చెందింది. అలాగే లక్ష్మీపురంలో ఇంటి పక్కనే పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో మేకల వెంకాయమ్మ (60) గుండెపోటుతో చనిపోయింది. మరోవైపు పాలపాడు గ్రామానికి చెందిన రైతు డేరంగుల వెంకటయ్య, యక్కలవారిపాలేనికి చెందిన రైతు మజ్జిగ చిన్న కోటేశ్వరరావు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. ఇదే సమయంలో మరో రెండు గ్రామాల్లో పడిన పిడుగుల ధాటికి మూడు ఆటోలతో పాటు కొబ్బరి, మామిడి చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.


బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం చంద్రబాబు నాయుడు

నరసరావుపేట మండలంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్న కోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

ఒకేరోజు నరసరావుపేట పరిధిలో పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందడంపై స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన మృతుల గ్రామాలు సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ నష్టపరిహారం త్వరితగతిన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 09:01 PM