Share News

రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు రావాలి

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:27 AM

డబ్బు ప్రభావం లేని రాజకీయ సిద్ధాంతాలకు, అభ్యర్థుల గుణగణాలకు ప్రాధాన్యం ఇచ్చిన పాత రోజుల రాజకీయాలు మళ్లీ రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తాను విద్యార్థి నేత స్థాయి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు ఎంపీగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తన జేబులోంచి తీసి ఖర్చు చేయలేదని...

రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు రావాలి

  • ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • వైభవంగా ఒంగోలు ఉత్సవం

  • ఆకట్టుకున్న ఒంగోలు గిత్తల ప్రదర్శన

ఒంగోలు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): డబ్బు ప్రభావం లేని రాజకీయ సిద్ధాంతాలకు, అభ్యర్థుల గుణగణాలకు ప్రాధాన్యం ఇచ్చిన పాత రోజుల రాజకీయాలు మళ్లీ రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తాను విద్యార్థి నేత స్థాయి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు ఎంపీగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తన జేబులోంచి తీసి ఖర్చు చేయలేదని, అలాగే రాజకీయాల్లోకి వచ్కాక ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకోలేదన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నగరంలో జరిగిన వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ రాజకీయాల్లో పాత రోజులు రావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి కోరిక ప్రకారం న్యాయవాది కావాలనుకున్న తనను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో అరెస్టు చేయడం వల్ల రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తొలి నుంచి సిద్ధాంతంతో, కష్టపడేతత్వంతో ప్రజలతో మమేకమై పనిచేయడం వల్ల ఎలాంటి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా దేశస్థాయిలో రాజ్యాంగబద్ధ అత్యున్నత రెండవ పదవిని చేరుకోగలిగానని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నవారు కూడా మంచి గుణగణాలు, సిద్ధాంత నిబద్ధతతో ప్రజలతోనూ మమేకమై కష్టపడి పనిచేయడం ద్వారా ఎదగాలని సూచించారు.

జిల్లావాసి అయిన ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు, ఒంగోలు శతాబ్దిన్నర ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఒంగోలు గిత్తల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్సవాల సందర్భంగా ఒంగోలు చరిత్ర, ఆర్ట్‌ గ్యాలరీ, ఫొటో ఎగ్జిబిషన్‌లు నిర్వహించారు. ఈ వేడుకలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సారధ్యంలో నిర్వహించగా రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.


ఒంగోలు ప్రజలకు సీఎం శుభాకాంక్షలు

ఒంగోలు శతాబ్దిన్నర వేడుకలను పురస్కరించుకుని సీఎం చంద్రబాబునాయుడు ఎక్స్‌ వేదికగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1876లో9 వేల మందితో మున్సిపాలిటీగా ప్రారంభమైన ప్రస్థానం నేడు 3 లక్షలకుపైగా జనాభాతో విస్తరించిందన్నారు. 150 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చారిత్రాత్మకమైన మైలురాళ్లు అధిగమించిందన్నారు. ఒంగోలు గడ్డ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్త కీర్తి, ఆంధ్రకేసరి టంగుంటూరి స్ఫూర్తి అన్నారు. గత వైభవాన్ని ఘనంగా స్మరించుకుంటూనేభవిష్యత్‌ తరాలకు పరిశుభ్రమైన, పచ్చని, ఆధునిక నగరాన్ని అందించాలనే సంకల్పంతో ముందడుగు వేద్దామన్నారు.పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.150 ఏళ్ల ఒంగోలు నగర ప్రస్థానంపై ‘మన ఊరు-మన సంబరం.. మన జ్ఞాపకం’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, యంత్రాంగంతోపాటు నగర పౌరులందరికీ అభినందనలు.. ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:27 AM