చేయి చేయి కలిపారు.. బెడ్ డ్యాం బాగుచేశారు!
ABN , Publish Date - Aug 12 , 2026 | 06:57 AM
రైతులంతా సంఘటితమయ్యారు. చేయిచేయి కలిపారు. రూ.35 లక్షల నిధులు సమీకరించుకున్నారు. బుడమేరు వరదలకు దెబ్బతిన్న బెడ్ డ్యాంను తిరిగి పునర్నిర్మించుకున్నారు.
(జి.కొండూరు-ఆంధ్రజ్యోతి): రైతులంతా సంఘటితమయ్యారు. చేయిచేయి కలిపారు. రూ.35 లక్షల నిధులు సమీకరించుకున్నారు. బుడమేరు వరదలకు దెబ్బతిన్న బెడ్ డ్యాంను తిరిగి పునర్నిర్మించుకున్నారు. దాదాపు వెయ్యి ఎకరాల సాగుకు తలెత్తుతున్న కష్టాలకు చెక్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన్ననందిగామ రైతుల భగీరథ ప్రయత్నానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన్ననందిగామ గ్రామ సమీపంలో ఉన్న బుడమేరులో బెడ్ డ్యాం వరుస వరదలతో దెబ్బతింది. దీంతో గ్రామంలోని రెండు చెరువులకు సాగునీరు సవ్యంగా చేరక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బెడ్ డ్యాంకు మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు ఆలస్యం అవుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రోద్బలంతో రైతులంతా ఏకమయ్యారు. రూ.35 లక్షల వరకు నిధులు సమకూర్చుకొని వంతుల వారీగా బెడ్ డ్యాం వద్ద నిలబడి ఎట్టకేలకు దాని మరమ్మతులు పూర్తిచేశారు. మొత్తం 130 మీటర్ల పొడవున, 20 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు పూర్తి చేయించారు. తమకు అండగా నిలిచి బెడ్ డ్యాం మరమ్మతు పనులు పూర్తయ్యేలా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో పాటు నిధులిచ్చిన వారందరికీ ఆయకట్టు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..