Share News

నట శిఖరానికో నజరానా

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:51 PM

నటరత్న ఎన్టీఆర్‌ స్మృత్యర్థం చిత్రకారుడు ఆర్‌.ఆర్‌.జనార్దన్‌ , ఆ మహానటుడి సినిమాలు, రాజకీయాలను స్పృశిస్తూ... ఆర్టిస్ట్స్‌ ట్రిబ్యూట్‌గా 400 పేజీల కాఫీ టేబుల్‌ బుక్‌ను సచిత్రంగా తీసుకొచ్చారు.

నట శిఖరానికో నజరానా
NT Ramarao

నటరత్న ఎన్టీఆర్‌ స్మృత్యర్థం చిత్రకారుడు ఆర్‌.ఆర్‌.జనార్దన్‌ , ఆ మహానటుడి సినిమాలు, రాజకీయాలను స్పృశిస్తూ... ఆర్టిస్ట్స్‌ ట్రిబ్యూట్‌గా 400 పేజీల కాఫీ టేబుల్‌ బుక్‌ను సచిత్రంగా తీసుకొచ్చారు. అందులోని కొన్ని గ్లింప్స్‌...

కాలేజీ రోజుల్లోనే ఎన్టీఆర్‌ని సినిమా పిలిచింది. అప్పటి సినీ పెద్దల దృష్టి ఎన్టీఆర్‌పై పడింది. ముఖ్యంగా దర్శకులు సి.పుల్లయ్యగారు సినిమాల్లోకి రమ్మనమని ఆహ్వానం. నిజానికి ఒకింత బలవంతమే చేశారు. బి.ఏ. పూర్తి కాకుండా తాను రాలేనని ఎన్టీఆర్‌ చెప్పేసరికి ఆయన చాలా నచ్చచెప్ప చూశారు. అయినా ఎన్టీఆర్‌ అంగీకరించలేదు. అలా ఎన్టీఆర్‌ తొలి సినిమా అవకాశం వదిలేశారు. 1947లో ఎన్టీఆర్‌ బి.ఏ. పూర్తి చేశారు.


vvv.jpg‘షావుకారు’ సినిమా తర్వాత విజయా సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణీలు వరసగా నాలుగు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఎల్‌.వి. ప్రసాద్‌, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులను దర్శకులుగా ఎంచుకున్నారు. ఆపైన చర్చల్లో దర్శకులు ముగ్గురూ ఎన్టీఆర్‌నే కథానాయకునిగా అడిగేసరికి, ఓ రెండేళ్ల పాటూ తమ సంస్థలో తప్ప మరే ఇతర సంస్థలోనూ నటించకూడదనే నిబంధనతో విజయావారు అడుగగా, ఆ రెండేళ్లపాటు తనతో తప్ప మరే ఇతర హీరోతో విజయావారు సినిమా తీయరాదనే ఆంక్షతో ఎన్టీఆర్‌ ఒప్పుకున్నారు. దానితో మొదటి ఏడాది నెలకు రూ. 500 జీతం, సినిమాకు రూ. 5000 రెమ్యునరేషన్‌, ఆపై రెండో ఏడాది నెలకు రూ. 750 జీతం, రూ. 7000లు రెమ్యునరేషన్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నారు.


nnm.jpgఎన్టీఆర్‌ కెరీర్‌లో 1950 మొదటి సంవత్సరం. ఈ ఏడాది తెలుగులో 17 చిత్రాలు విడుదలవ్వగా అందులో ఎన్టీఆర్‌ నటించినవి 4. యావత్‌ ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఐదో దశకం మొత్తం ‘స్వర్ణయుగంగా’ భాసిల్లింది. అదే నిజమన్నట్టుగా ఎన్టీఆర్‌ చిత్రరంగ ప్రవేశం కూడా ఈ సంవత్సరమే జరగడం ఓ యాదృచ్ఛికమే. వాటిలో ‘పల్లెటూరి పిల్ల’, ‘సంసారం’ చిత్రాలు ఘనవిజయం సాధించి శతదినోత్సవాలు చేసుకోగా, ‘షావుకారు’ విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్‌ నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం ‘మాయరంభ’.

దక్షిణ భారత సినీ పరిశ్రమకే మొట్టమొదటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘పాతాళ భైరవి’. కలెక్షన్ల కనకవర్షం కురిపించి యావత్‌ దేశాన్నే కుదిపేసిన ఓ సంచలనం ఈ సినిమా. సినిమా అన్నది లాభాలు గడించే ఓ పెద్ద వ్యాపారంగా గుర్తింపబడింది ఈ సినిమాతోనే. హీరో అన్న పదానికి కొత్త నిర్వచనం చెప్పబడింది. మొదటిసారిగా ఇండియన్‌ స్ర్కీన్‌పై ఓ సూపర్‌ పవర్ఫుల్‌ హీరోయిజాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. సినిమాని పల్లెల వరకూ తీసుకెళ్లిన సినిమా ఇది. ఇందులోని హీరో పాత్ర ‘తోటరాముడు’గా నటించిన ఎన్‌.టి.ఆర్‌ని అమాంతం ఒక్కసారిగా దేశంలోనే తిరుగులేని మాస్‌ హీరోని చేసేసిన సినిమా ఇది. ఎన్‌.టి.ఆర్‌ ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఇది.


xxx.jpg‘శ్రీకృష్ణుని పాత్రలో ఎన్‌.టి.ఆర్‌ మొట్టమొదటిసారి 1954లో విడుదలైన ‘ఇద్దరు పెళ్లాలు’ చిత్రంలో ఒక పాటలో కనిపిస్తారు. ఆపై పూర్తిస్థాయి శ్రీకృష్ణుని పాత్రలో 18 చిత్రాలలోనూ, ఇంకా పలు సినిమాల అంతర్నాటకాలలోమరో 15 సార్లు కనిపిస్తారు.’

ఎన్‌.టి.ఆర్‌ తన కెరీర్‌ మొత్తంలో 39 పౌరాణిక చిత్రాలలో నటించగా, ఒక్క ‘దాన వీరశూర కర్ణ’ తప్ప మిగిలిన అన్ని సినిమాలూ హిందీ, బెంగాలీ, తమిళ భాషల్లోకి అనువాదం చేయబడ్డవే! అలాగే 44 జానపద చిత్రాలలో ఆయన నటించగా, ఒక్క ‘ఎర్రకోట వీరుడు’ సినిమా తప్ప మిగిలిన అన్నీ ఇతర భాషలకు అనువాదం చేయబడ్డవే! సినీ పరిశ్రమ నుంచి ఆయన నిష్క్రమణతో ఈ తరహా పౌరాణిక, జానపద, చరిత్రాత్మక చిత్రాలు కూడా భారతీయ సినిమా నుంచి నిష్క్రమించినట్టయ్యింది.


‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ సినిమా తర్వాత మళ్లీ ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌లు కలిసి నటించడానికి 14 సం.లు పట్టింది. దానికి కారణం నాగేశ్వరరావుగారి భార్య అన్నపూర్ణమ్మ ‘శ్రీకృష్ణార్జునయుద్ధము’ చూశాక ‘‘మీరిద్దరూ తెరపై కనిపిస్తుంటే మిమ్మల్ని నేను పట్టించుకోలేదు. అలాంటిది జనం ఏం పట్టించుకుంటారు? ఇక ఆయనతో మీరు నటించకండి.. పౌరాణికాలయితే అస్సలు వద్దు’’ అన్నారట.

ప్రముఖ గాయకులు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ‘చిట్టి చెల్లెలు’ చిత్రంలో మొదటిసారి ఎన్‌.టి.ఆర్‌కు ‘‘పట్టాలి అరక, దున్నాల మెరక’’ అనే పాట పాడారు.


50 సంవత్సరాల వయసు దాటాక కూడా హీరోగా అలరించవచ్చని ‘నిప్పులాంటి మనిషి’తో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన ఎన్టీఆర్‌, ‘వేటగాడు’తో మరో ఒరవడికి బీజం వేశారు. హీరో, హీరోయిన్‌ల మధ్య వయసు తేడా అనే రేఖను ఈ సినిమాతో ఆయన చెరిపేశారు.

ఎన్టీఆర్‌ ఎన్నికల్లో ప్రకటించిన 289 మందిలో జనం ఎరిగినవారు ఇద్దరంటే ఇద్దరు. నాదెండ్ల భాస్కరరావు,

నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి అంతే! మిగతావారంతా ఇంచుమించు ఊరూ పేరు లేని అనామకులు. కానీ అత్యధికులు యువ కులు, విద్యాధికులు. అట్టడుగు వర్గాలకు చెందిన సామాన్య కుటుంబాలకు చెందినవారే ఎక్కువ. ఇలాంటి ఎన్టీఆర్‌ టీమ్‌ని చూసి ఆశ్చర్యపోయారంతా.


NT RAMA RAO

An Artist's Tribute

రచన: ఆర్‌. ఆర్‌. జనార్దన్‌

పేజీలు: 400, వెల: రూ. 5,500

ప్రతులకు: 99513 32139 (WhatsApp)

Mail: sudhasagarpublishers@gmail.com

Updated Date - Nov 22 , 2026 | 01:56 PM