Share News

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:59 AM

జగన్‌ హయాంలో విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు! ట్రూ అప్‌ పేరుతో షాకులే షాకులు! ఇప్పుడు ఆ రోజులు పోయాయి! 21 మాసాలుగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పైసా పెంచలేదు.

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

  • 16 వేల కోట్ల లోటు భర్తీకి సర్కారు రెడీ

  • ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపేందుకు సర్కారు ససేమిరా

  • ఈ ఏడాది మొదట్లో రూ.4,497 కోట్లు ఇచ్చి ప్రజలకు ‘బాదుడు’ నుంచి విముక్తి

  • మొత్తం మీద రూ.20,288 కోట్ల లబ్ధి

  • అదనంగా రూ.923 కోట్ల ‘ట్రూ డౌన్‌’

  • వాణిజ్యానికీ యూనిట్‌కు 2.30 తగ్గింపు

  • 21 నెలల్లో పైసా భారం మోపని సర్కార్‌

  • వైసీపీ హయాంలో బాదుడే బాదుడు

  • బిల్లులతో సామాన్యుల జేబులకు చిల్లు

  • వైసీపీ షాకులు.. కూటమి రాయితీలువివిధ వర్గాలకు లబ్ధి ఇలా..

  • ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది.

  • 22 లక్షల మంది వ్యవసాయ రంగ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగుతుంది.

  • ఎస్సీ, ఎస్టీ, ఆర్థిక బలహీన వర్గాలకు(22 లక్షల కుటుంబాలు) ఉచిత, రాయితీతో కూడిన విద్యుత్‌.

  • 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్‌ ధర రూ.12.25 నుంచి రూ.9.95కు తగ్గింపు.

  • వాణిజ్య వినియోగ విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.30 మేర తగ్గుతుంది.

  • కుటీర పరిశ్రమలకు లోడ్‌ పరిమితిని 10 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంచారు.

  • సుమారు 18 వేల కుటీర పరిశ్రమలకు రాయితీతో విద్యుత్‌ అందనుంది.

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు! ట్రూ అప్‌ పేరుతో షాకులే షాకులు! ఇప్పుడు ఆ రోజులు పోయాయి! 21 మాసాలుగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పైసా పెంచలేదు. పైగా యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గించి భారీ ఊరట కలిగించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. డిస్కమ్‌లు చూపించిన సుమారు రూ.16 వేల కోట్ల మేర లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. తాజా నిర్ణయంతో.. విద్యుత్‌ చార్జీలు పెంచబోమన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నట్టయింది.


ఏడాది ప్రారంభంలోనే.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్‌ వినియోగదారులకు ఊరట కలిగించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.4497.89 కోట్ల ట్రూ అప్‌ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించింది. మొత్తం మీద 21 నెలల్లో ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయకపోగా రూ.20,288.46 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించింది. గత ఏడాది సెప్టెంబరులో రూ.923 కోట్లను ‘ట్రూడౌన్‌’ చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గించి గృహ వినియోగదారులకు మరింత ఊరట కల్పించింది.

లోటు రూ.15,790.57 కోట్లు

విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు) 2026-27 సంవత్సరానికి రూ.17,508.17 కోట్ల ఆదాయలోటును ప్రతిపాదించాయి. దీన్ని పరిశీలించిన విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్‌, విద్యుత్‌ కొనుగోలు చార్జీల సర్దుబాటు, ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జ్‌స్టమెంట్‌(ఎఫ్‌పీపీసీఏ) చార్జీల కింద రూ.1717.60 కోట్లకు కోత వేసింది. ఈక్రమంలో రూ.15,790.57 కోట్ల ఆదాయ లోటుకు మాత్రమే ఆమోదం తెలిపింది. అయితే, ఈ లోటును వినియోగదారులపై మోపవద్దని, ఆ మొత్తాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి లిఖితపూర్వకంగా తెలిపింది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏ వినియోగదారులపైనా విద్యుత్‌ చార్జీల పెంపు భారం ఉండదు. ఈ నిర్ణయంతో 2024-25 ఆర్థికసంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్‌ చార్జీల విధింపు నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించనట్లయింది.

వైసీపీ భారాలను కూడా

డిస్కంల ఆదాయ లోటును వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. అయితే, విద్యుత్‌ చార్జీలు పెంచకూడదని నిశ్చయించుకున్న ప్రభుత్వం ఆదాయ లోటు రూ.రూ.15,790.57 కోట్ల భారాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది తొలి రోజునే వైసీపీ హయాంలో(2019-2024 మధ్య) వినియోగదారులు వినియోగించిన విద్యుత్‌పై డిస్కంలు విధించిన రూ.4497.89 కోట్ల ట్రూఅప్‌ మొత్తాన్ని కూడా ప్రభుత్వం భరించింది.


టారిఫ్‌ వర్గీకరణలో మార్పు

వివిధ రకాల వ్యాపారులకు లబ్ధి చేకూరేలా ఈఆర్సీ పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు సోలార్‌ మాడ్యూల్‌ తయారీ పరిశ్రమకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వాటర్‌ ప్లాంట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లను ప్రస్తుతం ఉన్న వాణిజ్య విభాగం నుంచి పారిశ్రామిక విభాగానికి మార్చారు. జాతీయ రహదారులపై వీధి దీపాలను విభాగం-2(వాణిజ్య) నుంచి విభాగం-4(ఏ) యుటిలిటీస్‌ విభాగానికి మార్చారు. ఈము పక్షుల యూనిట్లను ఇకపై సీజనల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌గా పరిగణించి చార్జీలను వసూలు చేస్తారు. ఫౌలీటరు ఫారాల్లోని కీలక ఆహార తయారీ ప్లాంట్లలో ప్రత్యేక సబ్‌ మీటర్ల ఏర్పాటుకు అనుమతించారు. దీంతో యూనిట్‌కు రూ.5.85 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.

డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ నో..

సోలార్‌ రూఫ్‌ టాప్‌ వినియోగదారులకు నాన్‌ టెలిస్కోపిక్‌ పద్ధతిలో బిల్లింగ్‌ చేయడానికి విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించగా దాన్ని ఈఆర్సీ తిరస్కరించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారులకు ఉపయోగపడే గ్రీన్‌ పవర్‌ క్యాటగిరీని తొలగించాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను కూడా ఈఆర్సీ తిరస్కరించింది. విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించడంపై పంపిణీ సంస్థలు దృష్టి సారించాలని ఈఆర్సీ ఆదేశించింది. పంపిణీ సంస్థలు, ట్రాన్స్‌కో తమ తమ వెబ్‌సైట్లలో ప్రమాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఫొటోలను, వివరాలను సామాన్య ప్రజలు సైతం అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. ఈ ఫిర్యాదులను డిస్కంలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరింది. ప్రభుత్వ శాఖల బకాయిలను 100 శాతం వసూలు చేయాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.

Updated Date - Mar 26 , 2026 | 02:59 AM