Share News

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరగలేదు

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:45 AM

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ జూడో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ నామిశెట్టి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ఉద్దేశాలతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరగలేదు

  • విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు అసలు సంబంధం లేదు

  • జగన్‌ మీడియాపై పరువు నష్టం దావా తప్పదు

  • ఏపీ జూడో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌

విజయవాడ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ జూడో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ నామిశెట్టి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ఉద్దేశాలతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూడో అసోసియేషన్‌లో అవకతవకలకు పాల్పడిన కొంతమందిని ఇప్పటికే బహిష్కరించామని తెలిపారు. తప్పులు, అవినీతికి పాల్పడిన వారంతా ఒకచోట చేరి మంత్రి లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించినందుకే తనపైన, తన కుమారుడిపైన జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారని మండిపడ్డారు. అసలు సంబంధం లేకపోయినా విశాఖ ఎంపీ శ్రీభరత్‌ పేరును ఈ వ్యవహారంలోకి తీసుకొస్తున్నారని నామిశెట్టి పేర్కొన్నారు.

ఓ చానల్‌లో మాట్లాడిన ఆనం కిశోర్‌ రెడ్డి, కేఎన్‌ బాబు, సి. కిరణ్‌కుమార్‌, ఆర్‌కే పురుషోత్తం, తెలంగాణ జూడో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కైలాశ్‌ యాదవ్‌లపై కోర్టు కేసులు, ఫేక్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని ఆరోపించారు. కైలాష్‌ యాదవ్‌ ఏసీబీ కేసులో అరెస్టయ్యారని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ జరిగిన సమయంలో తాను, ఎంపీ శ్రీభరత్‌ జూడో అసోసియేషన్‌లో లేమని స్పష్టం చేశారు. డీఎస్సీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని, లేదంటే జగన్‌ చానల్‌పై చట్టపరంగా పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. జూడో అసోసియేషన్‌లో అవకతవకలపై విచారణ జరపాలని విజిలెన్స్‌ విభాగాన్ని హైకోర్టు ఆదేశించిందని వెంకట్‌ నామిశెట్టి తెలిపారు. ఈ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని నామిశెట్టి స్పష్టం చేశారు. ప్రత్యర్థులు చూపిస్తున్న ఆధారాలు, సర్టిఫికెట్లు నకిలీవేనని విచారణలో నిరూపిస్తానని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:45 AM