Share News

బాల్యం.. గొర్రెల కాపరికి బేరం!

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:02 AM

అసలే పేదరికం.. మరోవైపు తమ బిడ్డకు అనారోగ్యం. చిత్తు కాగితాలు, ప్లాస్లిక్‌ డబ్బాలు ఏరుకుని ఏ పూటకా పూట కడుపు నింపుకొనే ఆ కుటుంబానికి బతుకు భారమైంది..!

బాల్యం.. గొర్రెల కాపరికి బేరం!

  • తల్లిదండ్రులే బిడ్డను వెట్టిచాకిరికి పెట్టిన వైనం.. సోషల్‌ మీడియాలో వైరలైన బాలుడి వీడియో

  • వెంటనే స్పందించిన విద్యా శాఖ మంత్రి లోకేశ్‌

  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సమాచారం

  • తల్లిదండ్రుల చెంతకు బాలుడు.. వెట్టి నుంచి విముక్తి

  • పేద కుటుంబానికి ఇంటి స్థలం.. రుణం మంజూరు

ఒంగోలు నగరం, నెల్లూరు/ దుత్తలూరు, అమరావతి అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అసలే పేదరికం.. మరోవైపు తమ బిడ్డకు అనారోగ్యం. చిత్తు కాగితాలు, ప్లాస్లిక్‌ డబ్బాలు ఏరుకుని ఏ పూటకా పూట కడుపు నింపుకొనే ఆ కుటుంబానికి బతుకు భారమైంది..! దీంతో బడికి పంపాల్సిన తమ తొమ్మిదేళ్ల కుమారుడిని ఆ తల్లిదండ్రులు వెట్టిచాకిరికి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పని తన వల్లకాదని ఆ బిడ్డ ఏడుస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో కొడుకును గొర్రెల కాపరిగా పెట్టి ఇతర ప్రాంతానికి పంపించేశారు. రెండు రోజుల క్రితం ఆ బాలుడు పొలాల్లో మండుటెండలో గొర్రెలు కాస్తూ ‘‘నాకు సరైన ఆహారం కూడా పెట్టకుండా పనిచేయించుకుంటున్నారు’’ అని ఏడుస్తున్న దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పందించడంతో ఆ బాలుడికి వెట్టిచాకిరి నుంచి విముక్తి లభించింది. బడికి వెళ్లి చదువుకునే అవకాశం దక్కింది.


గొర్రెలు కాసేందుకు జీతానికి

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన పురుష ఆశీర్వాదం, ఎస్తేరమ్మ దంపతులు ప్రస్తుతం నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నర్రవాడలో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదేళ్ల రామయ్య, మరో ఇద్దరు ఆడపిల్లలు సంతానం. రామయ్యకంటే చిన్నవారైన ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరికి గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఆర్థిక కష్టాల నేపథ్యంలో వారు తమ కుమారుడు రామయ్యను ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బూరేపల్లి కాలనీకి చెందిన కన్నెబోయిన నాగయ్య వద్ద గొర్రెలు కాసేందుకు జీతానికి పెట్టారు. ఇందుకుగానూ నాగయ్య వారికి రూ.35 వేలు ముట్టజెప్పినట్టు తెలిసింది. ఇదంతా మధ్యవర్తుల ద్వారా జరిగింది. తల్లిదండ్రులు రామయ్యను బూరేపల్లిలోని నాగయ్య ఇంటి వద్ద వదలి వెళ్లి వారం రోజులవుతోంది. అప్పటి నుంచి నాగయ్య తన గొర్రెలు కాసుకురమ్మని రామయ్యను పంపిస్తున్నారు. అలా గొర్రెలు కాస్తూ ఆ బాలుడు కనిపించిన వాళ్లందరి దగ్గరా కన్నీటి పర్యంతమవుతున్నాడు. తన తల్లిదండ్రుల వద్దకు పంపించాలని వేడుకుంటున్నాడు. తిండి కూడా సరిగా తినడం లేదని వాపోతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ బాలుడు గొర్రెలు కాస్తూ ఏడుస్తున్న దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో బాగా వైరల్‌ అయింది.


మంత్రి లోకేశ్‌ చొరవతో... బడిబాట

ఈ వీడియో చూసిన మంత్రి లోకేశ్‌ వెంటనే ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి... వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని ఆదేశించారు. దీంతో నెల్లూరు కలెక్టర్‌ హిమాంశు శుక్లా, ప్రకాశం కలెక్టర్‌ రాజాబాబు ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. రాజాబాబు ఆదేశాల మేరకు స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధీనంలో పనిచేస్తున్న బాలల సంరక్షణ కమిటీ ప్రతినిధులు గురువారం బూరేపల్లి కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.

విషయం తెలిసి బాలుడిని పనిలో పెట్టుకున్న నాగయ్య అధికారులు రాకముందే గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే రామయ్యను అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. రెండు జిల్లాల అధికారులు దుత్తలూరు వెళ్లి బాలుడిని నెల్లూరు జిల్లా సీడబ్ల్యూసీ కమిటీ ముందు హాజరుపరిచారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై స్పందించిన లోకేశ్‌ రామయ్యను ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్చబోతున్నామని, తండ్రి అనారోగ్యానికి వైద్యం చేయిస్తామని, తల్లికి స్వయం ఉపాధి కల్పించనున్నామని లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. వెంటనే స్పందించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు దుత్తలూరు మండలం నర్రవాడలో ఆశీర్వాదం, ఎస్తేరమ్మ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేశారు. వారికి వెలుగు పథకం కింద రుణం అందజేశారు. కాగా, బాలుడిని చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న కన్నెబోయిన నాగయ్యపై మద్దిపాడు పోలీసు స్టేషన్లో బాల కార్మిక చట్టం, జస్టిస్‌ జువైనల్‌ చట్టం కింద గురువారం కేసు నమోదు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:02 AM