Share News

పదేళ్ల నిర్లక్ష్య గ్రహణం వీడేనా?

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:00 AM

విద్యుత్‌ లైన్‌ ఎత్తు విషయంలో రెండు శాఖల నిర్లక్ష్యం పదేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓ నిండు ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. పదేళ్ల క్రితం రూ.63 లక్షలతో అయిపోయే పనిని నాన్చుతూ రావడంతో ఇప్పుడు ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 పదేళ్ల నిర్లక్ష్య గ్రహణం వీడేనా?

  • ప్రజల ప్రాణాలతో ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ చెలగాటం

  • నిడదవోలు-పీటీపల్లి 132 కేవీ లైన్‌ కింద మృత్యునీడ

  • 2016లో కాలువ మట్టి తీసి లైన్‌ కింద పోసిన వైనం

  • 6.1 మీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌.. 3.5 మీటర్లకే పరిమితం

  • కమీషన్ల కక్కుర్తితో అటకెక్కిన లైన్ల కింద మట్టి తొలగింపు

  • రూ.63 లక్షలతో లైన్‌ ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు

  • ఆ తర్వాత పట్టించుకోకుండా రెండు శాఖల నిర్లక్ష్యం

  • 2022లో హైటెన్షన్‌ వైరు తగిలి ఓ రైతు మృతి

  • నాలుగేళ్లకు ఇప్పుడు అదే పనికి రూ.1.5 కోట్లతో టెండరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ లైన్‌ ఎత్తు విషయంలో రెండు శాఖల నిర్లక్ష్యం పదేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓ నిండు ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. పదేళ్ల క్రితం రూ.63 లక్షలతో అయిపోయే పనిని నాన్చుతూ రావడంతో ఇప్పుడు ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్కేకేవైఆర్‌ (శ్రీ కరటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ రిజర్వాయర్‌) ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల్లో భాగంగా నిడదవోలు-పీటీపల్లి నడుమ 132 కేవీ డీసీ హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌ వెళ్లే మార్గంలో లోకేషన్‌ నంబరు 74, 75 మధ్య కాల్వ నుంచి తీసిన మట్టిని లైను కింద పోశారు. దీంతో భూమికి, హైటెన్షన్‌ లైనుకు మధ్య ఉండాల్సిన 6.1 మీటర్లు గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 3.5 మీటర్లకు పడిపోయింది.

2016లో ఈ పరిస్థితిని వివరిస్తూ స్థానిక విద్యుత్తు శాఖ ఏఈ పైఅధికారులకు లేఖ రాశారు. దీంతో అప్పటి ట్రాన్స్‌కో ఎస్‌ఈ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాయడంతో రెండు శాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి.. ఆ మార్గంలో ప్రయాణించే వారికి ప్రాణాంతకమని, వెంటనే కాల్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌తో మట్టిని తొలగించే చర్యలు చేపట్టాలని లేదా టవర్ల ఎత్తు అయినా పెంచాలని నిర్ణయించారు.


మట్టి తొలగిస్తే ఖర్చు రూ.5 లక్షలే..

రెండు టవర్ల కింద 1620 క్యూబిక్‌ మీటర్ల మట్టి ఉందని, దాన్ని తొలగించేందుకు రూ.4-5 లక్షలు అవుతుందని అధికారులు తొలుత లెక్క కట్టారు. అయితే ఈ ప్రతిపాదనను అమలు చేస్తే.. ఎలాంటి కమీషన్లు రావన్న ఉద్దేశంతో ట్రాన్స్‌కో అధికారులు అటకెక్కించారు. రెండు టవర్ల ఎత్తు పెంచాలని, రూ.63 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ మొత్తాన్ని తమకు చెల్లిస్తే టవర్ల ఎత్తు పెంచుతామని ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. ఆ మొత్తం చెల్లించేందుకు నీటిపారుదల శాఖ 2017లో అంగీకారం తెలిపింది. ఇక ఇక్కడి నుంచి కథ మారింది. ట్రాన్స్‌కో అధికారులు బదిలీ కావడం, కొత్తగా వచ్చిన వారు నీటిపారుదల శాఖ లేఖపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2022 వరకు నీటిపారుదల శాఖ అధికారుల లేఖకు స్పందించలేదు.

ప్రాణం పోయిన నాలుగేళ్లకు టెండర్‌

2022 ఏప్రిల్‌ 24న ఆ మార్గంలో గడ్డిమోపు తీసుకువెళుతున్న ఓ రైతు తక్కువ ఎత్తులో ఉన్న హైటెన్షన్‌ లైను తగిలి మృతిచెందారు. దీంతో అప్రమత్తమైన ట్రాన్స్‌కో అధికారులు 2023లో తిరిగి అంచనాలు వేసి.. టవర్ల ఎత్తు పెంపునకు రూ.73 లక్షలు అవుతుందంటూ మరోసారి నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాశారు. అయితే ఈసారి నీటిపారుదల శాఖ అధికారులు చేతులు ఎత్తేశారు. ఓ నిండు ప్రాణం పోయిన నాలుగేళ్ల తర్వాత తాజాగా ట్రాన్స్‌కో అధికారులు పిలిచిన టెండర్లలో ఈ పని విలువ రూ.కోటిన్నరగా పేర్కొనడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 06:00 AM