Share News

విజయవాడ లాకప్ డెత్‌పై NHRC ఆగ్రహం.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అల్టిమేటం

ABN , Publish Date - Jun 26 , 2026 | 09:29 PM

ఇటీవల నగరంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విజయవాడ లాకప్ డెత్‌పై NHRC ఆగ్రహం.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అల్టిమేటం
Vijayawada Custodial Case

విజయవాడ, జూన్ 26: ఇటీవల నగరంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా స్పందించింది. విజయవాడలో అక్రమ నిర్బంధం, హింస నిజమేనని ప్రాథమిక విచారణలో 'సిట్' (SIT) సైతం నిర్ధారించింది. ఈ క్రమంలోనే రక్షకులే భక్షకులుగా మారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికార దుర్వినియోగాన్ని కమిషన్ తీవ్రంగా ఖండించింది. జీవించే హక్కుపై జరిగిన దాడి ఇది అని పేర్కొంటూ.. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీసులు లాకప్ డెత్‌ను దాచేందుకు సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. యువకుడి శవాన్ని కాల్చివేసి, ఆ బూడిదను నదిలో కలిపేసిన ఏపీ పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, స్టేషన్‌లో ఏం జరిగిందో బయటపడకుండా ఉండేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు కావాలనే డిలీట్ చేసినట్లు తేలింది.


బాధితుడు మరణించడానికి ముందు అక్కడి సీఐ ‘నీ కొడుకుకు దండ కొనుక్కో’ అంటూ అన్న భయానక మాటలను బాధితుడి తల్లి కన్నీళ్లతో గుర్తుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెండ్ చేసి, సిట్ విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కస్టడీ మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీ, విజయవాడ సీపీలకు.. వారం రోజుల గడువుతో నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని వెంటనే రికవరీ చేయాలని, అలాగే నదిలో కలిపిన బాధితుడి అస్థికలను వెలికితీయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ స్టేటస్, నిందితుల పూర్తి వివరాలు, బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారంపై వారం రోజుల్లోగా సమగ్ర 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (సమర్పించిన నివేదిక) ఇవ్వాలని ఏపీ పోలీస్ బాసులకు అల్టిమేటం జారీ చేసింది. దాంతో పాటు, కుమారుడిని కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణమే పూర్తి రక్షణ, భద్రత కల్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరి మృతి

తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. గోల్డ్ మ్యాన్‌ సూర్య భాయ్‌పై కేసు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 09:41 PM